Sukanya Samriddhi Yojana: 


కేంద్ర ప్రభుత్వం బాలికల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం సుకన్య సమృద్ధి యోజన! అమ్మాయిల విద్య, పెళ్లిళ్లకు డబ్బు మదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక కుటుంబం రెండు సుకన్య ఖాతాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కుమార్తెలకు 15 ఏళ్లు నిండేంత వరకు ఇందులో డబ్బు మదుపు చేసుకోవచ్చు. అంతకు మించి మరికొన్నాళ్లు డబ్బు దాచుకునేందుకు అవకాశం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం!


సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఎన్నాళ్లు డబ్బు డిపాజిట్‌ చేసుకోవచ్చు?


సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు డబ్బును డిపాజిట్‌ చేసుకోవచ్చు. పదేళ్లలోపు వయసున్న బాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షులు ఖాతా తెరవొచ్చు. ఉదాహరణకు బాలికకు తొమ్మిదేళ్లున్నప్పుడు ఖాతా తెరిస్తే 24 ఏళ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 15 ఏళ్లు డబ్బు జమ చేయాలి. 'ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు డిపాజిట్లు కొనసాగించాలి' అని ఎస్‌ఎస్‌వై నిబంధనలు పేర్కొంటున్నాయి. అలాగే 21 ఏళ్లకు ఖాతా మెచ్యూర్‌ అవుతుంది. 9 ఏళ్ల వయసులో తెరిస్తే ఆమెకు 30 ఏళ్లు నిండాకే మెచ్యూరిటీ వస్తుంది.


ఎస్‌ఎస్‌వై ఖాతాను ఎన్నాళ్లు ఆపరేట్‌ చేయాలి?


బాలికలకు 18 ఏళ్లు నిండేంత వరకే తల్లిదండ్రులు లేదా సంరక్షులు సుకన్య సమృద్ధి ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. 'ఖాతాదారుకు 18 ఏళ్లు నిండేంత వరకే సంరక్షులు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత ఖాతాదారు తన సొంత వివరాలను సమర్పించి ఖాతాను నిర్వహించుకోవచ్చు' అని నిబంధనలు చెబుతున్నాయి.


ప్రీమెచ్యూర్‌ క్లోజ్‌ చేయొచ్చా?


సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ముందుగానే ముగించొచ్చు. ఇందుకు ఖాతాదారుకు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆమె పెళ్లి కోసమే డబ్బు అవసరమని ధ్రువీకరించాలి. పెళ్లికి నెల రోజుల ముందు, మూడు నెలల తర్వాత మరే ఉద్దేశంతోనూ ఖాతాను క్లోజ్‌ చేసేందుకు వీల్లేదు.


Also Read: సుకన్యా సమృద్ధి యోజన అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ కావాలా? ఇదిగో సింపుల్‌ ప్రాసెస్‌


Also Read: మీ పిల్లల భవిష్యత్తు కోసం మేలైన పెట్టుబడి పథకాలివి, బలమైన రాబడి తిరిగొస్తుంది


సుకన్య సమృద్ధి యోజన ఖాతాను మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చా?


ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం కస్టమర్లు మొదట సుకన్యా సమృద్ధి యోజన ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్టును ఇప్పటికే ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఇవ్వాలి. కొత్తగా ఏ బ్యాంకు లేదా శాఖలోకి మార్చాలనుకుంటున్నారో దాని అడ్రస్‌ ఇవ్వాలి. అప్పుడు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఒరిజినల్‌ డాక్యుమెంట్లైన ఖాతా పుస్తకం, అకౌంట్‌ ఓపెనింగ్‌ దరఖాస్తు, స్పెసిమన్‌ సిగ్నేచర్‌ వంటివి ఐసీఐసీఐకి పంపిస్తుంది. దాంతో పాటు ఎస్‌ఎస్‌వై ఖాతాలోని డబ్బుల చెక్కు లేదా డీడీని పంపిస్తుంది. యాక్సిస్‌ సహా ఏ ఇతర బ్యాంకులైనా ప్రాసెస్‌ ఇలాగే ఉంటుంది.