Stock Market Weekly Review: భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఇన్వెస్టర్లకు ఊహించని షాకిచ్చాయి! అంతకు ముందు వారం కీలక స్థాయిల వద్ద మద్దతు దొరకడంతో సూచీలు పైకి ఎగుస్తాయని అంతా భావించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పతనానికి బ్రేకులు పడతాయని అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. గ్యాప్‌ డౌన్‌తో ఆరంభమై రికవరీ బాట పట్టాయి. మార్కెట్లో బలహీనతను ప్రతిబింబించాయి. ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు రేంజ్‌బౌండ్‌లో ముగిశాయి.


1000 పాయింట్ల మేర ఊగిసలాట


జూన్‌ 26తో మొదలైన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) ఒడుదొడుకుల్లోనే కదలాడింది. తొలి రెండు రోజులు లాభాల బాట పడితే మిగతా మూడు రోజులు నష్టపోయింది. సోమవారం 52,727 వద్ద ఆరంభమైన సూచీ 52,101 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 53,498 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. చివరికి 0.34 శాతం లాభంతో 52,907 వద్ద ముగిసింది. అంటే 180 పాయింట్లు మాత్రమే పెరిగింది. ట్రేడింగ్‌ వాల్యూమ్‌ సైతం ఎక్కువేం లేదు.


ఒడుదొడుకుల్లోనే నిఫ్టీ


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) సైతం ఇదే దారిలో నడిచింది. సోమవారం 15,916 వద్ద ఓపెనైంది. 15,511 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత పుంజుకొని 15,925 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 15,752 వద్ద ముగిసింది. 0.34 శాతం మాత్రమే లాభపడింది. నెలవారీగా చూసుకున్నా 0.18 శాతం నష్టపోయింది.


సందిగ్ధంలో ఇన్వెస్టర్లు


ప్రస్తుతానికి మార్కెట్లో లాభాలకు ఆస్కారం కనిపించడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ఆసియా, ఐరోపా మార్కెట్లను అనుసరించి భారత ఈక్విటీ మార్కెట్ల గమనం ఉంటుంది. రూపాయి పతనం ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. చాలా వరకు క్వాలిటీ స్టాక్స్‌ 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం, మాంద్యానికి మదుపర్లు అలవాటు పడ్డారు. సూచీలు ఎక్కువగా పడటంతో లాంగ్‌టర్మ్‌, వాల్యూ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు చేపట్టే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.