History Of 1996 Be Repeated In Share Market: భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లకు శుక్రవారం (28 ఫిబ్రవరి 2025) మరో పీడకలలా మారింది, "బ్లడ్ బాత్ ఫ్రై డే"ని కళ్లకు చూపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ట్రేడ్ టారిఫ్ వ్యాఖ్యలతో శుక్రవారం నాడు గ్లోబల్ స్టాక్ మార్కెట్‌లు అమ్మకాల తుపానులో అల్లల్లాడాయి, ఆ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌లపైనా పడింది.
బాంబే స్టాక్ ఎక్సేంజ్, BSEలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువను మదుపర్ల సంపదగా పరిగణిస్తారు. శుక్రవారం ఒక్కరోజే మదుపర్ల సంపద విలువ ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ. 3.84,01,411 కోట్లకు దిగి వచ్చింది. ఈ వారం మొత్తంలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.20 లక్షల కోట్లు నష్టపోయారు.
5 నెలల్లో రూ.93.91 లక్షల కోట్ల సంపద ఆవిరి
BSEలో అన్ని కంపెనీల మార్కెట్ విలువ, 27 సెప్టెంబరు 2024న రూ. 4,77,93,922 కోట్లు చేరింది, ఇది జీవనకాల గరిష్ట స్థాయి. దీనితో పోలిస్తే, గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు, ఈ 5 నెలల్లో ఏకంగా రూ. 93.91 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ప్రస్తుతం మన మార్కెట్‌లో చూస్తున్న నష్టాలకు ప్రధాన కారణం విదేశీ పెట్టుబడిదార్ల (FII) అమ్మకాలు. 2024 సెప్టెంబర్ నుంచి FIIల సెల్లాఫ్ ప్రారంభమైనప్పటికీ, అక్టోబర్ నుంచి అది ఉధృతమైంది, ఐదు నెలలుగా చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదు నెలల్లో నిఫ్టీ 15.70 శాతం, సెన్సెక్స్ 14.86 మేర క్షీణించాయి.
BSE సెన్సెక్స్, 27 సెప్టెంబరు 2024న, 85,978.25 పాయింట్ల వద్ద లైఫ్ టైమ్ హై రేంజ్‌కు చేరింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు 12,780 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా జీవనకాల గరిష్ట స్థాయి 26,277.35 పాయింట్ల నుంచి ఇప్పటి వరకు 4,152 పాయింట్లు క్షీణించింది. లైఫ్ టైమ్ హై రేంజ్‌ల నుంచి నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 22%, స్మాల్ క్యాప్ 100 సూచీ 26% పడిపోయాయి.
30 ఏళ్ల నాటి రికార్డ్ బద్ధలయ్యేనా?
విదేశీ పెట్టుబడిదార్ల అమ్మకాల ధాటికి ఇప్పుడు 30 ఏళ్ల నాటి రికార్డ్ బద్ధలయ్యేలా ఉంది, దీనిపైనే మార్కెట్‌లో చర్చ జరుగుతోంది. మొదటిసారి, 1996 మే - సెప్టెంబర్ మధ్య వరుసగా ఐదు నెలలు మార్కెట్ క్షీణతను చూసింది. ఆ రికార్డ్ ఇప్పుడు బద్ధలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2025 మార్చి నెలలో కూడా మార్కెట్ నష్టాల్లో ముగిస్తే, 1996 నాటి రికార్డ్ కనుమరుగవుతుంది.
జీరోధా CEO నితిన్ కామత్ చెప్పిన ప్రకారం, మార్కెట్ ఒడుదొడుకుల కారణంగా ట్రేడింగ్ చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది, ప్రస్తుతం మార్కెట్ దాదాపు 2 కోట్ల మంది మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ట్రేడర్లు, పెట్టుబడిదార్ల సంఖ్య తగ్గడంతో లావాదేవీల విలువ కూడా దాదాపు 30% తగ్గింది. జీరోధా ఏర్పాటైన 15 సంవత్సరాల్లో వ్యాపారం తగ్గడం ఇదే తొలిసారి. దీనిని బట్టి, ప్రస్తుత మార్కెట్ జనాన్ని ఎంత భయపెడుతోందో అర్ధం చేసుకోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మార్చి నెలలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు - ఇదిగో ఫుల్ హాలిడేస్ లిస్ట్