Sovereign Gold Bond:


మంచి పెట్టుబడి సాధనాల గురించి వెతుకుతున్నారా? తక్కువ రాబడి వచ్చినా ఫర్వాలేదా? పెట్టుబడి సురక్షితంగా ఉండి మోస్తరు వడ్డీ వస్తే చాలా? అయితే సార్వభౌమ పసిడి బాండ్ల పథకం మీకు సరైనది! ఎందుకంటే బంగారం ధర పెరుగుదలతో వచ్చే లాభంతో పాటు రెండున్నర శాతం వడ్డీని సులభంగా పొందొచ్చు. పైగా నష్టభయమేమీ ఉండదు.


భారతీయ రిజర్వు బ్యాంకు సార్వభౌమ పసిడి బాండ్ల పథకాన్ని (SGB) మరో విడత ఆరంభించింది. సెప్టెంబర్‌ 11 నుంచి ప్రజలు పథకంలో చేరొచ్చు. ఒక గ్రాము బంగారం బాండ్‌ ధరను ప్రభుత్వం రూ.5,293గా నిర్ణయించింది. సెప్టెంబర్‌ 15 వరకు ప్రజలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.


'సార్వభౌమ పసిడి బాండ్ల ధరను నిర్ణయించేందుకు 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరను ప్రామాణికంగా తీసుకున్నాం. సబ్‌స్క్రిప్షన్‌ గడువైన సెప్టెంబర్‌ 6-8 వరకు ముందు బంగారం ముగింపును బట్టి ఒక గ్రాముకు రూ.5,923గా నిర్ణయించాం' అని ఆర్బీఐ తెలిపింది.


ఆన్‌లైన్‌ విధానంలో సార్వభౌమ పసిడి బాండ్లను కొనుగోలు చేస్తున్నవారికి ఆర్బీఐ రాయితీ కల్పిస్తోంది. ఒక గ్రాము బాండ్‌పై రూ.50 రాయితీ ఇస్తుంది. అంటే ఆన్‌లైన్‌ ఇన్వెస్టర్లకు ఒక గ్రాము పసిడి బాండ్‌ రూ.5,873కే లభిస్తుంది.


సార్వభౌమ పడిసి బాండ్ల పథకం 2023-24 రెండు సిరీసు బాండ్లు బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (SHCIL), పోస్టాఫీసులు, బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో లభిస్తాయి.


సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి?


 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్‌ అనేది డిజిటల్‌ బంగారం. భౌతికంగా కనిపించదు. ఫిజికల్‌ గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి, భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకునే వాళ్లు గోల్డ్‌ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు.


సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. భౌతిక బంగారం కొనుగోలులో వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు బాడుదు గోల్డ్‌ బాండ్లకు ఉండదు. 


SGBతో టాక్స్‌ బెనిఫిట్‌ 


బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొన్న తేదీ నుంచి మూడేళ్ల ముందు SGBలను అమ్మితే, స్వల్పకాలిక మూలధన లాభాల కింద వర్తించే శ్లాబ్‌ సిస్టమ్‌ ప్రకారం టాక్స్‌ చెల్లించాలి. 3 సంవత్సరాల తర్వాత అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాల కింద (ఇండెక్సేషన్‌ అనంతరం) 20% టాక్స్‌ కట్టాలి.