Cancel Unused Credit Card: క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే, ఉపయోగించని క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలా లేదా అలాగే కొనసాగించాలా?. మీరు కొత్త కార్డ్ తీసుకున్నాక, ప్రస్తుత కార్డ్‌తో ఇకపై అవసరం ఉండకపోవచ్చు. అయితే, దానిని రద్దు చేసే విషయంలో తొందరపడకూడదు.
క్రెడిట్ కార్డ్‌ను మూసేయడం వల్ల ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉంటాయి.
క్రెడిట్ కార్డ్‌ను మూసేయడం వల్ల ప్రయోజనాలు (Advantages Of Closing An Credit Card):
వార్షిక రుసుము (Credit Card Annual Fee) నుండి విముక్తి లభిస్తుంది. కార్డ్‌ను బట్టి, మీకు సంవత్సరానికి కొన్ని వందల నుంచి వేల రూపాయల వరకు ఆదా అవుతాయి. పునరావృత ఖర్చులను (Recurring expenses) ఆపడానికి కూడా ఆ క్రెడిట్ కార్డ్ ఖాతాకు మంగళం పాడడం మంచిది.
కొంతమందికి క్రెడిట్ కార్డ్ ఒక వ్యసనంలా మారింది. కార్డ్ చేతిలో ఉంటే అవసరం లేకపోయినా, లేదా అవసరానికి మించి ఖర్చు చేస్తుంటారు. కార్డ్‌ను మూసేయడం వల్ల అనవసర & అధిక ఖర్చులు తగ్గుతాయి, డబ్బు మిగులుతుంది.
ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నప్పుడు, వివిధ బిల్లింగ్ సైకిల్స్, గడువు తేదీలు, రివార్డ్ సిస్టమ్స్ కారణంగా వాటి నిర్వహణ చికాకు తెప్పిస్తుంది. అంతేకాదు, ప్రతి క్రెడిట్ కార్డ్‌లోని ఖర్చును కలిపితే, మొత్తం వ్యయం తడిసి మోపడవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్‌లను మూసేయడం మంచింది.
మీ దగ్గర ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, మీ ఐడెంటిటీని దొంగిలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉపయోగించని క్రెడిట్ కార్డ్‌లను రద్దు చేస్తే, మీ వ్యక్తిగత సమాచారం తప్పుడు చేతుల్లోకి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి.
క్రెడిట్ కార్డ్ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పులు పేరుకుపోవచ్చు. కార్డును మూసివేయడం వల్ల, అప్పు చేయాలన్న ప్రలోభం నుంచి మీరు బయటపడతారు.
క్రెడిట్ కార్డ్‌ను మూసేయడం వల్ల నష్టాలు (Disadvantages Of Closing An Credit Card):
క్రెడిట్ కార్డ్‌ను మూసివేయడం వల్ల కలిగే కీలక నష్టం - అది మీ క్రెడిట్ స్కోర్‌పై (Credit Score) ప్రతికూల ప్రభావం చూపొచ్చు. మీ క్రెడిట్ స్కోర్.. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR), క్రెడిట్ హిస్టరీ మీద ఆధాపరడుతుంది. కార్డ్‌ను మూసేయడం వల్ల CUR పెరుగుతుంది, క్రెడిట్ హిస్టరీ తగ్గుతుంది. ఈ రెండు పరిణామాలు మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తాయి.
కీలక సమయాల్లో క్రెడిట్ కార్డ్‌లు ఆదుకుంటాయి. కార్డ్‌ను మూసివేయడం వల్ల క్రెడిట్ లభ్యత తగ్గుతుంది.
క్రెడిట్ కార్డ్‌లు రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌లను అందిస్తాయి. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్, డైనింగ్ & షాపింగ్ డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. కార్డ్‌ను మూసేస్తే మీరు ఈ ప్రయోజనాలను కోల్పోతారని గుర్తుంచుకోవాలి.
ఇప్పటివరకు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, మీ క్రెడిట్ కార్డ్‌ను మూసేయాలా లేదా కొనసాగించాలా అన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ కార్డ్‌ను క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటే.. మీ కార్డ్‌ను మూసివేసే ముందు మీ కార్డ్ బకాయిని పైసలతో సహా పూర్తిగా చెల్లించండి. రివార్డ్ పాయింట్‌లు, ఇతర ప్రయోజనాలను పూర్తిగా రీడీమ్ చేసుకోండి.
ఒకవేళ, కార్డ్‌ను మూసేయడానికి ప్రధాన కారణం యాన్యువల్ ఫీజ్ అయితే.. మీ కార్డ్‌ను లైఫ్ టైమ్ ఫ్రీగా మార్చేలా మీ బ్యాంక్‌తో మాట్లాడండి. లేదా, మరొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌ను తీసుకోండి.
మరో ఆసక్తికర కథనం: సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా?