Senior Citizen Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల పెట్టుబడిదార్ల ఆదాయం పెంచేలా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సహా చాలా పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మరోవైపు, RBI రెపో రేటు పెంపుతో 2022 మే నుంచి అన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చాయి. చాలా బ్యాంకులు, సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ తరహాలోనే వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద, వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ కాలానికి (జూన్ త్రైమాసికం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీ కిందకు వచ్చి, అధిక రాబడి వచ్చే పెట్టుబడి మార్గం కోసం ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఏది మంచి ఎంపికో ఇప్పుడు చూద్దాం.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
2023 బడ్జెట్‌లో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచింది. ఇందులో.. మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 తేదీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.
SBI సీనియర్ సిటిజన్ FD రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FDs) 7% వడ్డీని చెల్లిస్తోంది. అయితే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్య కాలానికి 7.3 శాతం వడ్డీ ఇస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య కాలానికి 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ FD రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సీనియర్ సిటిజన్ల కోసం 18 నెలల నుంచి 5 సంవత్సరాల కాలానికి 7.50 శాతం వడ్డీని; 15 నెలల నుంచి 18 నెలల కాల వ్యవధికి 7.60 శాతం వడ్డీని అందిస్తోంది.
ICICI బ్యాంక్ FD రేట్లు
సీనియర్ సిటిజన్ల కోసం, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్ల మీద 7.50 శాతం వడ్డీని; 15 నుంచి 18 నెలల కాలానికి 7.60 శాతం వడ్డీని ఈ బ్యాంక్ చెల్లిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్ FD రేట్లు
ఈ బ్యాంక్, 18 నెలల నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం నుంచి 8.01 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
యెస్ బ్యాంక్ FD రేట్లు
సీనియర్ సిటిజన్లకు 15 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు 7.75% నుంచి 8% వరకు వడ్డీని యెస్ బ్యాంక్ అందిస్తోంది. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద, 35 నెలల కాల వ్యవధిపై 8.25 శాతం వడ్డీని ఈ బ్యాంక్ చెల్లిస్తోంది.