కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హెచ్చరించింది. తెలియని ఫోన్ నంబర్లు, సందేశాలు, ఈమెయిళ్లు, ట్వీట్లకు స్పందించొద్దని సూచించింది. నగదు, కేవైసీకి సంబంధించి వచ్చే సందేశాలు, కాల్స్, మెయిళ్లకు రెస్పాండ్ కావొద్దని వెల్లడించింది.
తాజాగా ఎస్‌బీఐ కస్టమర్లను ఉద్దేశించి ఒక ట్వీట్ చేసింది. 'ఈ నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు. కేవైసీకి సంబంధించి వచ్చే ఫిషింగ్ లింక్స్‌ను క్లిక్ చేయొచ్చు. +91 8294710946, +91 7362951973 నంబర్లు ఎస్‌బీఐకి సంబంధించిన నంబర్లు కావు. ఈ రెండు నంబర్ల ద్వారా కస్టమర్లకు కాల్స్ వస్తున్నాయి. కేవైసీ అప్‌డేషన్ గురించి అడుగుతున్నారు. ఈ మోసపూరిత కాల్స్ నుంచి కస్టమర్లకు జాగ్రత్తగా ఉండాలి. ఫిషింగ్, అనుమానిత లింక్స్‌ను క్లిక్ చేయొద్దు' అని బ్యాంకు తెలిపింది.
ఈ ట్వీట్లపై స్పందించిన కస్టమర్లను ఎస్‌బీఐ అభినందించింది. 'మీ అప్రమత్తతను మేం అభినందిస్తున్నాం. ఈ విషయం మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీటిపై మా ఐటీ బృందం సత్వరమే చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు, లింక్స్‌కు స్పందించొద్దని కస్టమర్లను కోరుతున్నాం. ఐడీ, పాస్‌వర్డ్, డెబిట్ కార్డు నంబర్లు, పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దు. ఇలాంటి ఫిషింగ్ కాల్స్, మెయిల్స్ వస్తే report.phishing@sbi.co.in లేదా 1930 నంబర్‌ను సంప్రదించగలరు' అని బదులిచ్చింది.
బ్యాంకింగ్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ఆర్‌బీఐ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తరచుగా బుక్‌లెట్లు రిలీజ్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా వివరాలు పంచుకుంటోంది. ఈ మధ్య కాలంలో మోసగాళ్లు బ్యాంకులకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి డబ్బు కొట్టేస్తున్న సంగతిని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ వెబ్‌సైట్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ మీడియా, ఈమెయిళ్లు, ఇన్‌స్టాంట్ మెసేంజర్లు, ఇతర పద్ధతుల్లో లింకులు పంపించడాన్ని గుర్తించింది. వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.