పింఛన్‌దారుల కోసం ఎస్‌బీఐ ఓ అద్భుతమైన సేవను ప్రకటించింది. 'వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌' సౌకర్యం కల్పించింది. ఈ ఆప్షన్‌ ఉపయోగించుకొని పింఛన్‌దారులు వీడియో ద్వారా ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. అయితే ప్రభుత్వం నుంచి పింఛన్‌ తీసుకొనే వాళ్లకు ఈ ఫీచర్‌ ఉపయోగపడదని ఎస్‌బీఐ తెలిపింది. వీడియో ప్రక్రియ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఉచితంగానే సమర్పించొచ్చని వెల్లడించింది.

'ఇప్పుడు ఇంటి దగ్గర్నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్‌ చేయండి! 2021, నవంబర్‌ 1న మా వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ సర్వీస్‌ను ఆరభించాం. సులభంగా వీడియో కాల్‌ చేసి జీవినపత్రం సమర్పించొచ్చు' అని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులు నవంబర్‌ 30లోగా లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పించడం అత్యంత కీలకం. లేదంటే వారికి పింఛను ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

ఎస్‌బీఐలో మీకు పింఛన్‌ ఖాతా ఉంటే వీడియో ప్రక్రియ ద్వారా సులభంగా జీవన పత్రం సమర్పించొచ్చు. ఈ విధానాన్ని ట్వీట్లో స్పష్టంగా వివరించారు.

ఇలా సబ్మిట్ చేయండి

* మొదట www.pensionseva.sbiకి లాగిన్‌ అవ్వాలి.* వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రక్రియ మొదలు పెట్టేందుకు వీడియో ఎల్‌సీపై క్లిక్‌ చేయాలి.* ఎస్‌బీఐ పింఛన్‌ ఖాతా నంబర్‌ ఎంటర్‌ చేయాలి.* మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆధార్‌తో పాటు దానిని ఎంటర్‌చేసి సబ్‌మిట్‌ చేయాలి.* ఆడియో, వీడియో, కెమేరా యాక్సెస్‌ ఇవ్వాలని కోరుకుతుంది. 'స్టార్ట్‌ జర్నీ'ని క్లిక్‌ చేయాలి.* మీ పాన్‌ కార్డును సిద్ధంగా ఉంచుకొని 'ఐయామ్‌ రెడీ'పై క్లిక్‌ చేయాలి.* వీడియో కాల్‌ పర్మిషన్‌ అడుగుతుంది. అనుమతి ఇవ్వాలి. ఎస్‌బీఐ అధికారి మీతో మాట్లాడతాడు.* మీ స్క్రీన్‌పై కనిపించిన నాలుగు అంకెల వెరిఫికేషన్‌ను చదవాలి.* అధికారి అడగ్గానే మీ పాన్‌ చూపించాలి.* బ్యాంకు అధికారి మీ ఫొటో తీసుకొని లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రక్రియ ముగిస్తారు.