వయసు మీద పడ్డాక ఎవరైనా ఉద్యోగానికి వీడ్కోలు పలకాల్సిందే. అయితే ఆ తర్వాత సుఖంగా, క్షేమంగా బతకాలంటే మాత్రం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ఇబ్బందుల్లేకుండా మీ ఆర్థిక అవసరాలు తీరాలంటే భారీ మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. వేతనం పెరిగాక, ఎక్కువ డబ్బు వచ్చాక రిటైర్మెంట్ ప్లానింగ్ చేద్దామని అనుకుంటూ చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ ఐదు పొరపాట్లు చేయకుంటే మంచి కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆలస్యం చేయడం
ఉద్యోగం దొరగ్గానే యువత చేసే మొదటి పొరపాటు వెంటనే రిటైర్మెంట్ ప్రణాళికలు వేసుకోకపోవడం. లేదా ఇంకా జీతం పెరిగాక చేద్దాంలే అనుకోవడం. అలా చేయడం వల్ల భారీ మొత్తం ఏర్పాటు చేసుకొనేందుకు ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. త్వరగా ఇన్వెస్ట్‌మెంట్ మొదలు పెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 40 ఏళ్ల వయసులో నెలకు రూ.10వేలను 15 శాతం వడ్డీ రేటుకు రూ.24 లక్షలు పెట్టుబడి పెడితే 60 ఏళ్లకు రూ.1.52కోట్లు వస్తాయి. అదే 25 ఏళ్ల వయసులో నెలకు రూ.3000తో మొదలు పెడితే రిటైర్మెంట్ నాటికి మీరు రూ.12.6 లక్షలు పెట్టుబడి పెడతారు. అప్పుడు 12శాతం వడ్డీరేటు ఇచ్చినా మీకు రూ.1.95 కోట్లు చేతికొస్తాయి.
ద్రవ్యోల్బణం చూసుకోకపోవడం
రిటైర్మెంట్ కార్పస్ ఏర్పాటు చేసుకొనేటప్పుడు చాలామంది చేసే మరో పొరపాటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం. పెట్టుబడి రుసుములు, పన్నులు పట్టించుకోకపోవడం. వీటివల్ల మీకు వచ్చే రాబడి విలువ తగ్గిపోతుంది. సుదీర్ఘ కాలంలో సంపద సృష్టించలేరు. భవిష్యత్తులో ఎంత ద్రవ్యోల్బణం ఉంటుంది, పన్నులు ఎంత పెరుగుతాయి, ఇతర ఖర్చులేమమైనా ఉంటాయా అన్నది లెక్కలోకి తీసుకొని ప్లానింగ్ చేసుకోవాలి.
సరైన ఆరోగ్య బీమా లేకపోవడం
వయసు పెరుగుతుంటే ఆరోగ్య ఇబ్బందులు రావడం సహజం. అందుకే సరైన ఆరోగ్య బీమా, కవరేజీ ముఖ్యం. ఎందుకంటే పదేపదే వైద్యానికి చేసే ఖర్చుల వల్ల మీ రిటైర్మెంట్ కార్పస్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే వైద్య, ఆరోగ్య రంగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటోంది. సరైన ఆరోగ్య బీమా ఉంటే భవిష్యత్తు ఖర్చులు అందులోంచే తీసుకోవచ్చు. దాంతో మీ రిటైర్మెంట్ ఫండ్ అలాగే ఉంటుంది.
తప్పుడు పెట్టుబడి సాధనం
కొందరు ఎక్కువ మొత్తాలను నిలకడగా పెట్టుబడి పెడుతుంటారు. కానీ రిటైర్మెంట్ నాటికి సరైన కార్పస్ ఏర్పాటు చేసుకోవడంలో మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే సరైన పెట్టుబడి సాధనం ఎంచుకోకపోవడమే అందుకు కారణం. అందుకే మీ వయసు, నష్టభయం, ఆదాయం, లక్ష్యాలను బట్టి సరైన పెట్టుబడి సాధనం ఎంచుకోవాలి. తక్కువ వయసులో ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. తర్వాత రిస్క్ తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడు మీ లక్ష్యాలకు అనుగుణంగా కార్పస్ ఏర్పాటవుతుంది.
కార్పస్ నుంచి తీసుకోవడం
మంచి రిటైర్మెంట్ కార్పస్‌ను నిర్మించుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. మీ అవసరాలకు తగిన రాబడి వనరులను ముందే తయారు చేసుకోవాలి. లేదంటే మీ రిటైర్మెంట్ కార్పస్ నుంచి డబ్బును తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మీకు తక్కువ మొత్తమే అందుకుతుంది. అందుకే అలాంటి పొరపాట్లను మీరు చేయొద్దు. ఏ అవసరం వచ్చినా కార్పస్‌ను ముట్టుకోవద్దు. మరో ప్రత్యామ్నాయ రాబడి పథకాలను ఎంచుకుంటే ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.