Holi Coloured And Teared Currency Notes Exchange Rules: మార్చి 14న దేశమంతా హోలీ రంగులతో మునిగి తేలింది. కొన్ని ప్రాంతాల్లో మార్చి 15, శనివారం నాడు కూడా హోలీ ఆడతారు. ఈ రంగుల పండుగ వేడుకల్లో రంగులు వెదజల్లుకోవడం, నీటి బెలూన్లు విసురుకోవడం లేదా వాటర్ గన్‌లతో రంగు నీళ్లు చల్లడం వంటి చిలిపి చేష్టలతో సరదాగా గడుపుతారు. ముందు జాగ్రత్తలు లేకపోతే, సరదా సమయం ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులను కలగజేస్తుంది. జేబులో డబ్బులు ఉన్నాయని మరిచిపోయి హోలీ ఆడితే, ఆ కరెన్సీ నోట్లు తడిచి చిరిగిపోవచ్చు & ఆ నోట్లకు రంగులు అంటుకుని వాటి రూపం మారిపోవచ్చు. ఒక్కోసారి, ఇంక్ వంటి రంగులు కూడా అంటుకుంటుంటాయి. సాధారణంగా, రంగులు అంటుకున్న & చిరిగిన నోట్లను తీసుకోవడానికి దుకాణదారులు అంగీకరించరు. దీంతో, ఆ నోట్లను ఎలా మార్చుకోవాలో అర్ధంగాక జనంలో టెన్షన్ పెరుగుతుంది.
రంగులు అంటిన నోట్లను మార్చుకోవచ్చా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, కరెన్సీ నోట్లను శుభ్రంగా ఉంచుకోవడం & చిరిగిపోకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత. హోలీ వంటి సందర్భాల వల్ల నోట్లు రంగు మారినా లేదా తడిసి చిరిగిపోయినా, అలాంటి సందర్భాలకు సంబంధించి ఆర్‌బీఐ కొన్ని నియమాలు రూపొందించింది.
ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం, మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు తడిసిపోతే మీరు వాటిని ఆరబెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. ఏ బ్యాంక్ లేదా దుకాణదారుడు వాటిని తీసుకోవడానికి నిరాకరించకూడదు. నోటుకు రంగు అంటుకున్నప్పటికీ, ఆ నోటు భద్రత లక్షణంపై అది ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. కాబట్టి, మీరు ఏ బ్యాంకుకైనా వెళ్లి అలాంటి నోట్లను మార్చుకోవచ్చు. దీని కోసం బ్యాంకులు మీ నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయలేవు.
రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం, కరెన్సీ నోట్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం లేదా ట్యాంపరింగ్ చేయడం నేరం. దీనికోసం, ఆర్‌బీఐ 'క్లీన్ నోట్' విధానాన్ని (RBI's clean note policy) అమలు చేస్తోంది. RBI చట్టం 1934లోని సెక్షన్ 27 ప్రకారం, ఎవరూ ఏ విధంగానూ కరెన్సీ నోట్ల రూపం మార్చకూడదు.
కొన్ని సందర్భాల్లో, ఇళ్లలో ఎక్కువ కాలం ఉంచిన కరెన్సీకి చెదలు పట్టడం లేదా ఎలుకలు కొట్టడం వంటివి కూడా జరుగుతుంది. బ్యాంక్ నుంచి తీసుకువచ్చిన నోట్ల కట్టలో లేదా ATM నుంచి డబ్బు తీసుకున్నప్పుడు కూడా చిరిగిన నోట్లు రావచ్చు. ఒక్కోసారి, జేబులోంచి డబ్బులు బయటకు తీయడం మరిచిపోయి వాటిని అలాగే ఉతుకుతారు. కొన్నిసార్లు నోట్లు పాక్షికంగా లేదా చాలా వరకు కాలిపోతాయి. అలాంటి నోట్లను దుకాణదారులు తీసుకోరు, వాటిని ఉపయోగించాలంటే ప్రజల తలప్రాణం తోకకు వస్తుంది. అయితే, వాటిని కూడా చాలా సులభంగా మార్చుకునే మార్గం ఒకటి ఉంది.
చిరిగిన & కాలిపోయిన నోట్ల మార్పిడిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌లు, చెస్ట్ బ్రాంచ్‌లలో చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు. ఎవరి దగ్గరైనా కాలిపోయిన నోట్లు ఉంటే వాటిని కూడా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి కరెన్సీ నోట్ల మార్పిడికి కొన్ని షరతులు ఉన్నాయి. నోట్ల చిరిగినా లేదా కాలినా వాటిని గుర్తు పట్టేంత భాగం మిగిలి ఉండాలి & నోట్లపై నంబర్ ఉండాలి.
కాలిపోయిన నోట్లను మార్చుకునే విషయంలో, ఆ నోట్ల పరిస్థితి దారుణంగా ఉండకూడదు. కొంత భాగం మాత్రమే కాలిపోతేనే దానిని మార్చుకోవచ్చు. దాదాపు పూర్తిగా లేదా గుర్తు పట్టలేనంతగా కాలిపోతే ఆ నోట్లను బ్యాంక్‌ల్లో కూడా తీసుకోరు. నోట్ల నంబర్ ప్యానెల్ సరిగ్గా ఉండాలి, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం స్పష్టంగా కనిపించాలి. నోటు ఎక్కువగా కాలిపోతే వాటి విలువ కూడా తగ్గవచ్చు.
ఎన్ని నోట్లను మార్చుకోవచ్చు?ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, 10 రూపాయల కంటే ఎక్కువ విలువైన నోట్లను మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఒకేసారి 20 కంటే ఎక్కువ నోట్లను మార్చుకోకూడదు & ఆ అన్ని నోట్ల మొత్తం విలువ రూ. 5000 మించకూడదు.
ఒకవేళ, ఏ బ్యాంక్ అయినా చిరిగిన నోటు లేదా కాలిన నోటును మార్చడానికి నిరాకరిస్తే, మీరు ఆ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చు.