Dividend on PFC Shares: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థ 'పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్' (PFC), తన షేర్‌హోల్డర్లకు బంపర్ న్యూస్ చెప్పింది. పీఎఫ్‌సీ షేర్లు ఉన్న పెట్టుబడిదార్లు/ షేర్‌హోల్డర్లకు ఒక్కో షేర్ మీద రూ. 3.50ను ప్రకటించింది. ఒకవేళ మీరు పీఎఫ్‌సీ షేర్‌హోల్డర్ అయితే, మీ దగ్గర ఎన్ని పీఎఫ్‌సీ షేర్లు ఉంటే అన్ని 3.50 రూపాయలు మీకు అందుతాయి. డివిడెండ్ రూపంలో ఈ డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది.
కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం
12 మార్చి 2025న జరిగిన డైరెక్టర్ల సమావేశంలో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,40,000 కోట్ల రుణ ప్రణాళికను బోర్డ్ ఆమోదించింది. దీంతోపాటు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు (రూ.10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్) రూ. 3.50 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్ చెల్లించడానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ డివిడెండ్ TDS కటింగ్‌కు లోబడి ఉంటుంది.
షేర్‌హోల్డర్లకు డివిడెండ్ ఎప్పుడు వస్తుంది?
పీఎఫ్‌సీ ప్రకటించిన డివిడెండ్ కోసం రికార్డ్ తేదీని (Record date for PFC dividend) 19 మార్చి 2025గా నిర్ణయించారు. ఈ తేదీ లోపు ఎవరి డీమ్యాట్ ఖాతాల్లో పీఎఫ్‌సీ షేర్లు ఉంటాయో, డివిడెండ్ తీసుకోవడానికి వాళ్లు మాత్రమే అర్హులు. డివిడెండ్ కోసం మీరు పీఎఫ్‌సీ షేర్లు కొనాలనుకుంటే, 17వ తేదీ కల్లా వాటిని కొనడం బెటర్. ఆ షేర్లు 18వ తేదీ నాటికి మీ డీమ్యాట్ ఖాతాలో కనిపిస్తాయి, మీకు అర్హత లభిస్తుంది. అర్హులైన పెట్టుబడిదార్లు/ షేర్‌హోల్డర్లకు 11 ఏప్రిల్ 2025న లేదా దీనికంటే ముందు డివిడెండ్ చెల్లిస్తారు.
PFC డివిడెండ్ చరిత్ర
2024-25 ఆర్థిక సంవత్సరం కోసం, 12 మార్చి 2025న PFC ప్రకటించిన డివిడెండ్ 'నాలుగో మధ్యంతర డివిడెండ్' (Interim dividend). దీనికి ముందు, ఈ కంపెనీ 28 ఫిబ్రవరి 2025న ఒక్కో షేరుకు రూ. 3.50 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. 25 నవంబర్ 2024న ఒక్కో షేరుకు రూ. 3.50 లు; 30 ఆగస్టు 2024న ఒక్కో షేరుకు రూ. 3.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో PFC మొత్తం రూ. 13.75 డివిడెండ్ ఇచ్చింది, దీని డివిడెండ్ ఈల్డ్ దాదాపు 3.45 శాతం.
కంపెనీ పేరు మార్చడానికి సన్నాహాలు
కంపెనీ పేరును మార్చే ప్రతిపాదనను కూడా పీఎఫ్‌సీ బోర్డు ఆమోదించింది. PFC పేరును “పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్” నుంచి “PFC లిమిటెడ్” లేదా కంపెనీల రిజిస్ట్రార్ (RoC) ఆమోదించిన ఏదైనా ఇతర పేరుకు మార్చవచ్చు. దీని కోసం, కంపెనీ మెమోరాండం & ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో మార్పులు జరుగుతాయి. దీనికి వాటాదారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, ఇతర అధికారుల ఆమోదం అవసరం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.