Latest Gold-Silver Prices Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హోలీ తర్వాత మాత్రం, పుత్తడి & వెండి రేట్లు మరోమారు జీవన కాల గరిష్టానికి (Gold prices hit lifetime highs again) చేరాయి. దేశీయ మార్కెట్‌లో, MCXలో 10 గ్రాముల స్వచ్ఛమైన (24 కేరెట్లు) పసిడి ధర రూ. 88,310 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది & పన్నులతో కలిపి ఇది రూ. 91,300 రేటుతో రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ (31.10 గ్రాములు) బంగారం ధర $ 3,004.90 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది.
2025 సంవత్సరంలో ఇప్పటి వరకు, అంతర్జాతీయ ఆర్థిక & భౌగోళిక రాజకీయ కారణాల వల్ల గోల్డ్ రేట్లు దాదాపు 14 శాతం పెరిగాయి. ఈ బుల్ ట్రెండ్‌లో, వెండి ధరలు కూడా వేగం పుంజుకున్నాయి. శుక్రవారం నాడు MCXలో వెండి కిలోకు 1,01,999 వద్ద కొత్త రికార్డును చేరుకుంది. పన్నులతో కలుపుకుని, కిలో వెండి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,04,000 పైగా పెరిగింది.
బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎందుకు పెరిగాయి?
బంగారం, వెండి ధరలు పెరగడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి.
అమెరికా సుంకాల విధానం వల్ల ఆర్థిక అనిశ్చితి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా విధానం, సుంకాల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల, సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది.
US ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు: అమెరికాలో CPI ఇన్‌ఫ్లేషన్, PPI డేటా మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయి. దీంతో, ఈ ఏడాది జూన్‌లో, USలో వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలు పెరిగాయి.
డాలర్ బలహీనత: ఈ సంవత్సరం డాలర్ ఇండెక్స్ 4 శాతానికి పైగా పడిపోయింది. అందువల్ల దీనిలోని పెట్టుబడులు పసిడి వైపు ప్రవహిస్తున్నాయి, బంగారం ఆకర్షణీయంగా మారింది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచ కేంద్ర బ్యాంకులు బంగారం కొనడంలో ఏమాత్రం తగ్గడం లేదు, నిరంతరం కొనుగోళ్లు జరుపుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా, ప్రతి సంవత్సరం 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొంటూ విపరీతమైన డిమాండ్ సృష్టిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్ నుంచి బంగారానికి మార్పు: ప్రపంచ వాణిజ్య విధానాలలో అనిశ్చితి కారణంగా, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు తమ డబ్బును ఈక్విటీల నుంచి తీసి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కూడా పసిడి గిరాకీకి ప్రధాన కారణం.
భవిష్యత్‌లో ఏం జరుగుతుంది?
భవిష్యత్‌లో, గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరుగుతాయనే నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ విధాన సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు & US రిటైల్ సేల్స్ డేటా భవిష్యత్‌లో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇవి కాకుండా, భౌగోళిక & రాజకీయ సంఘటనలు కూడా పుత్తడి పనితీరును ప్రభావితం చేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం లేదా సుంకాల యుద్ధం వంటివి అనూహ్య మలుపు తీసుకున్నా బంగారం మరింత ఖరీదు అవుతుంది.
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
HT నివేదిక ప్రకారం, దిల్లీలో ఈ రోజు (శనివారం, 15 మార్చి 2025) ఉదయం, 24 కేరెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 89,963 గా ఉంది. నిన్న 10 గ్రాములకు రూ. 88,163 పలికింది. చెన్నైలో ఈ రోజు ఉదయం బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,811 గా ఉంది, నిన్న రూ. 88,011 పలికింది. ముంబైలో ఈ రోజు 10 గ్రాములకు రూ. 89,817 & నిన్న రూ. 88,017 గా ఉంది. కోల్‌కతాలో ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,815 & నిన్న రూ. 88,015 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో, ఈ రోజు ఉదయం, 24 కేరెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 90600 పలుకుతోంది. ఇది, రూ. 91,300 రికార్డ్ స్థాయి నుంచి తగ్గింది. కిలో వెండి రేటు ఈ రోజు ఉదయం రూ. 1,04,000 గా ఉంది.
రూ.లక్ష దాటనున్న బంగారం!
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి, స్వచ్ఛమైన పసిడి రేటు 10 గ్రాములకు అతి త్వరలోనే లక్ష రూపాయలు దాటొచ్చని బంగారం వర్తకులు అంచనా వేస్తున్నారు. కిలో వెండి రేటు రూ. 1,20,000 మార్క్‌ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.