RBI Digital Rupee: 


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డిజిటల్‌ రూపాయి (e Rupee) పైలట్‌ ప్రాజెక్టు మొదలైంది. ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో రిటైల్‌ డిజిటల్‌ రూపాయి లావాదేవీలను ఆర్బీఐ ఆరంభించింది. నెల రోజుల క్రితం కేంద్ర బ్యాంకు హోల్‌సేల్‌ రంగంలో డిజిటల్‌ రూపాయిని పరీక్షించింది. అది విజయవంతం కావడంతో గురువారం నాలుగు నగరాలకు విస్తరించింది. తొలి దశలో మరో 9 నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


ఆర్బీఐ డిజిటల్‌ రూపాయి (e-Rupee) అంటే ఏంటి?


కేంద్ర బ్యాంకు ప్రవేశపెట్టిన డిజిటల్‌ రూపాయి పూర్తిగా డిజిటల్‌ రూపంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చలామణీలోకి వస్తుంది. ఇప్పుడున్న కాయిన్లు, కాగితం కరెన్సీ విలువల్లోనే డిజిటల్‌ రూపాయిని జారీ చేస్తారు. బ్యాంకుల ద్వారానే ప్రజలకు బదిలీ చేస్తారు.


డిజిటల్‌ రూపాయితో లావాదేవీలు ఎలా చేస్తారు?


కస్టమర్లు డిజిటల్‌ వ్యాలెట్లు ఉపయోగించి డిజిటల్‌ రూపాయితో లావాదేవీలు చేపట్టొచ్చు. ఈ వ్యాలెట్లను ఆర్బీఐ అనుమతించిన బ్యాంకులే అందిస్తాయి. మొబైల్‌ ఫోన్‌ లేదా ఇతర డివైజుల్లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని పర్సన్‌ టు పర్స్‌ (P2P), పర్సన్‌ టు మర్చంట్‌ (P2M) విధానాల్లో లావాదేవీలు కొనసాగించొచ్చు. దుకాణాదారులు లేదా వ్యాపార సంస్థలు డిస్‌ప్లే చేసిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి డిజిటల్‌ రూపాయి బదిలీ చేయొచ్చు. కరెన్సీకి ఉన్నట్టే డిజిటల్‌ రూపాయికీ భద్రత, విలువ, నమ్మకం, సెటిల్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. 


డిజిటల్‌ రూపాయి లావాదేవీలు ఆఫర్‌ చేస్తున్న నగరాలు, బ్యాంకులు ఏవి?


డిజిటల్‌ రూపాయి ప్రాజెక్టును దశలవారీగా ఆరంభిస్తున్నారు. లావాదేవీలు చేపట్టేందుకు ఎనిమిది బ్యాంకులకు అనుమతి ఇచ్చారు. తొలి దశలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కస్టమర్లు ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో లావాదేవీలు చేపట్టొచ్చు. మరికొన్ని రోజుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కస్టమర్లకు సేవలు అందుతాయి. అతి త్వరలోనే అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, కోచి, లక్నో, పాట్నా, సిమ్లాలో సేవలను విస్తరిస్తారు.


రియల్‌ టైమ్‌లో డిజిటల్‌ రూపాయి సృష్టి, బదిలీ, రిటైల్‌ ఉపయోగం, భద్రతను ఈ పైలట్‌ ప్రాజెక్టులో పరీక్షిస్తారు. దీన్నుంచి నేర్చుకున్న పాఠాలతో మిగిలిన ఫీచర్లు, డిజిటల్‌ రూపాయి ఆర్కిటెక్చర్‌ను భవిష్యత్తు పైలట్‌ ప్రాజెక్టుల్లో పరీక్షిస్తారు.


Also Read: 40 ఏళ్ల వయస్సులో ఈ పని చేయగలిగితే బెటర్‌- ఆసుపత్రిపాలైనా డబ్బులకు టెన్షన్ ఉండదు!


Also Read: ఇయర్‌ ఎండ్‌కు ఎగిరిపోతారా! ఈ క్రెడిట్‌ కార్డులతో మస్తు బెనిఫిట్స్‌!