FD Rate Hike: కీలక విధాన రేట్లను ఆర్బీఐ మరోసారి సవరించింది. రెపోరేటును శుక్రవారం మరో 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కేవలం 93 రోజుల్లోనే ఈ పెంపు 1.4 (40+50+50=140) శాతానికి చేరుకోవడం గమనార్హం. దీంతో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit Rates) వడ్డీరేట్లకు రెక్కలొస్తాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీరేటు అమలు చేసే రోజులు త్వరలోనే వస్తాయని అంటున్నారు.
మున్ముందు మరింత వడ్డీ
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీలు చెల్లించే కాలం పోయిందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ దారులకు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. 50 బేసిస్ పాయింట్లు పెంచితే ఎఫ్‌డీ వడ్డీరేటు 6.5 నుంచి 7 శాతానికి చేరుకుంటుంది. అంటే ఐదేళ్ల కాలపరిమితితో చేసే లక్ష రూపాయాల ఎఫ్‌డీపై (FD Rates) రూ.3,436 వరకు అదనపు వడ్డీ పొందొచ్చు.
రేట్ల పెంపు కొనసాగితే
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీరేటును సైకలాజికల్ బెంచ్‌మార్క్‌కు భావిస్తారు. సాధారణంగా దీనిని మెరుగైన రాబడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఆర్బీఐ కొనసాగిస్తున్న రేట్ల పెంపు సైకిల్‌ను బట్టి 8 శాతం వడ్డీరేటు ఆధారపడి ఉంటుంది. 93 రోజుల్లోనే 1.4 శాతం రెపోరేటును పెంచారు. రాబోయే సంవత్సర కాలంలో మరో 50-100 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022, జులై 11న పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ యీల్డు అత్యధికంగా 7.475 శాతానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయికి ఇంకా ముప్పు ఉంది. ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి రేట్ల పెంపును ఆపే దాఖలాలు కనిపించడం లేదు. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Also Read: పొద్దున్నే పేటీఎం డౌన్! డబ్బులు నష్టపోయిన యూజర్లు!!
ఎస్‌బీఐ ఎక్కువ స్ప్రెడ్
రెపో రేటు పెంచగానే ఇంటి రుణాలు, ఇతర రుణాలపై ఈఎంఐలను (EMIs) బ్యాంకులు వెంటనే పెంచేస్తుంటాయి. దీనికి అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మాత్రం పెంచవు. రెపోరేటు 4 శాతంగా ఉన్నప్పుడు ఎస్‌బీఐ 1.5 శాతం స్ప్రెడ్‌తో ఐదేళ్ల ఎఫ్‌డీలపై 5.5 శాతం వడ్డీ ఇచ్చేది. రాబోయే రోజుల్లో రెపోరేటు 6.25 శాతానికి పెరిగితే బ్యాంకు ఇదే స్ప్రెడ్ అమలు చేస్తుందని భావిస్తున్నారు. అలాంటప్పుడు సాధారణ ప్రజల ఎఫ్‌డీ రేటు 7.75 శాతానికి పెరగొచ్చు. సీనియర్ సిటిజన్ల వడ్డీరేటు 8.25 శాతానికి పెరుగుతుంది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే ప్రత్యేకమైన వడ్డీరేటు 8.55 శాతానికి చేరుకుంటుంది.
ముందు చిన్న బ్యాంకులే!
పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్నవే ఎఫ్‌డీలకు ఎక్కువ వడ్డీరేట్లను అమలు చేస్తున్నాయి. రెపో రేటు పెంచిన వెంటనే వీటికీ అమలు చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంకు వంటివి 6.5-7 శాతం వరకు ఇస్తున్నాయి. విదేశీ బ్యాంకులూ ఇదే విధానం అనుసరిస్తున్నాయి. ఏదేమైనా రాబోయే 1-2 సంవత్సరాల్లో ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీరేటును పొందే అవకాశం లేకపోలేదని నిపుణుల అంచనా.