Credit Card Rules Changing From 1st November 2024: మన దేశంలో, క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే దేశవ్యాప్తంగా కొన్ని రూల్స్‌ మారతాయి. అంటే, పాత నిబంధనలకు మార్పులు-చేర్పులతో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. వీటిలో ఎక్కువ నియమాలు నేరుగా సామాన్యుడి డబ్బుల మీదే దృష్టి పెడతాయి. ఇప్పుడు, 01 నవంబర్‌ 2024 నుంచి కూడా కొన్ని రూల్స్‌ల మారాయి. రైలు ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీలో టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడం నుంచి క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం వరకు చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. వాటిని ముందుగానే తెలుసుకోవడం మీ ఆర్థిక ఆరోగ్యానికి మంచిది.


రైల్వే టిక్కెట్‌ బుకింగ్‌
IRCTC ద్వారా రైల్వే టిక్కెట్‌ రిజర్వేషన్‌కు సంబంధించి ఇండియన్‌ రైల్వేస్‌లో కొత్త రూల్‌ అమల్లోకి వచ్చింది. ట్రైన్‌ టిక్కెట్‌ ముందుస్తు బుకింగ్‌ గడువును గతంలోని 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించింది. ఇప్పుడు, ప్రయాణ తేదీకి 60 ముందు నుంచి మాత్రమే టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోగలరు. నవంబర్‌ 01 నుంచి ఈ రూల్‌ అమల్లోకి వచ్చింది.


గ్యాస్‌ సిలిండర్‌ రేటు పెంపు
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల బ్లూ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఈ నెల నుంచి పెరిగింది. నవంబరు 01 నుంచి, ఒక్కో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.62 పెంచుతూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 5 కేజీల  సిలిండర్‌ రేటును కూడా రూ.15 మేర పెంచాయి. ఇళ్లలో వంటకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ రేటులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.


ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌
దేశంలోని అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌, తన క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. వివిధ రకాల క్రెడిట్‌ కార్డ్‌లపై ఇప్పటి వరకు ఇస్తున్న రివార్డ్‌ పాయింట్లతో కోత పెట్టింది. కిరాణా సరుకులు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లలో చేసే చెల్లింపులు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ వంటి వాటిపై ఎఫెక్ట్‌ ఉంటుంది. ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్‌ రద్దు ఇకపై నెలకు రూ.50,000 వరకు చేసే ఖర్చుకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా స్కూల్‌, కాలేజీ ఫీజులు చెల్లిస్తే 1 శాతం ఛార్జ్‌ చేస్తుంది. ఈ నెల 15 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.


ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీల్లో మార్పులు చేసింది. దీనిని నెలకు 3.50% నుంచి 3.75%కు పెంచింది. సాయుధ దళాలకు ఇచ్చే శౌర్య, డిఫెన్స్‌ కార్డులను ఈ పెంపు వర్తించదు. ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో యుటిలిటీ చెల్లింపులు (విద్యుత్‌ బిల్లు, గ్యాస్‌ బిల్లు వంటివి) రూ.50,000కు మించితే 1 శాతం సర్‌ఛార్జ్‌ తీసుకుంటుంది. నవంబర్‌ 01 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. 


ఇండియన్‌ బ్యాంక్‌ స్పెషల్‌ స్కీమ్స్‌
ఇండియన్‌ బ్యాంక్‌ IND సూపర్‌ 400, IND సూపర్‌ 300 పేరిట స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లను అమలు చేస్తోంది. 300 రోజుల FD మీద సాధారణ పౌరులకు 7.05% వడ్డీ; సీనియర్‌ సిటిజన్లకు 7.55% వడ్డీ చెల్లిస్తోంది. 400 రోజుల FD మీద సాధారణ కస్టమర్లకు 7.30% వడ్డీ; సీనియర్‌ సిటిజన్లకు 7.55% వడ్డీ రాబడిని జమ చేస్తోంది. ఈ నెలతో (నవంబర్‌ 30) ఈ స్పషల్‌ ఎఫ్‌డీల గడువు ముగుస్తుంది.


రిజర్వ్‌ బ్యాంక్‌ రూల్స్‌‌
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ నగదు బదిలీలకు సంబంధించి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త రూల్స్‌ అమలు చేస్తోంది. ఈ రూల్స్‌ నవంబర్‌ 01 నుంచి అమల్లోకి వచ్చాయి. మనీ ట్రాన్స్‌ఫర్‌లో భద్రతను పెంచేందుకు కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది.


మరో ఆసక్తికర కథనం: నగలు కొనేవాళ్లకు ఈ రోజు పండగే - అతి భారీగా తగ్గిన పసిడి, వెండి రేట్లు