Diwali Muhurat Trading 2024: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు (శుక్రవారం, 01 నవంబర్‌ 2024) కూడా అమావాస్య ఘడియలు ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ కూడా దీపావళి వేడుకలు కొనసాగుతున్నాయి. దివ్వెల పండుగను పురస్కరించుకుని, ఈ రోజు స్టాక్ మార్కెట్‌కు సెలవు ఇచ్చారు, సాధారణ ట్రేడింగ్‌ జరగదు. అయితే, లక్ష్మీపూజ సందర్భంగా ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ "ముహూరత్‌ ట్రేడింగ్‌" (ముహూర్తపు ట్రేడింగ్‌)ఉంటుంది. ముహూరత్‌ ట్రేడింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


దీపావళి ముహూరత్‌ ట్రేడింగ్ 01 నవంబర్ 2024, శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తారు. సాంప్రదాయంగా, ప్రతి సంవత్సరం దీపావళి నాడు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSEలో ముహూరత్‌ ట్రేడింగ్ జరుగుతుంది. 


ముహూరత్‌ ట్రేడింగ్‌ టైమింగ్స్‌:


ప్రి-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45 గంటల నుంచి 6:00 గంటల వరకు జరుగుతుంది. 
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్, అంటే ముహూరత్‌ ట్రేడింగ్ సమయం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది.
బ్లాక్ డీల్ విండో సాయంత్రం 5:30 గంటల నుంచి 5:45 గంటల వరకు తెరిచి ఉంటుంది.
పీరియోడిక్‌ కాల్ బిడ్స్‌ సమయం సాయంత్రం 6:05 గంటల నుంచి 6:50 గంటల వరకు ఉంటుంది. 
BSE సర్క్యులర్ ప్రకారం, ఆర్డర్ ఎంట్రీ సెషన్ చివరి 10 నిమిషాల్లో ముగుస్తుంది. 
క్లోజింగ్‌ సెషన్‌ సాయంత్రం 7 గంటల నుంచి 7.10 గంటల వరకు ఉంటుంది.
పోస్ట్-క్లోజింగ్‌ సెషన్‌ సమయం రాత్రి 7.10 గంటల నుంచి 7.20 వరకు ఉంటుంది.


ముహూరత్‌ ట్రేడింగ్ అంటే ఏంటి?
హిందు క్యాలెండర్ ప్రకారం, కొత్త సంవత్సరం మొదటి రోజు దీపావళి పండుగతో ప్రారంభం అవుతుంది. ఈ దీపావళి నుంచి సంవత్‌ 2080 ముగిసి సంవత్‌ 2081 ప్రారంభమైంది. కొత్త సంవత్సరం తొలి రోజును వ్యాపారులు శుభ సూచకంగా భావిస్తారు. ఆ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టినా సంపద పెరుగుతుందని & వ్యాపార విజయానికి దారి తీస్తుందని నమ్ముతారు. బంగారం, షేర్లు వంటివి ఎక్కువగా కొంటారు. భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి శుభ ఘడియల్లో ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ జరుగుతుంది. దానినే ముహూరత్‌ ట్రేడింగ్ అంటారు. సెంటిమెంట్‌ను సంవత్ 2081 ప్రారంభంలో లక్ష్మీ పూజ చేసి, ముహూరత్‌ ట్రేడింగ్‌లో వీలైనన్ని కంపెనీల షేర్లు కొంటారు.



ఏ షేర్లు కొనొచ్చు?
మీకు ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో అనుభవం ఉంటే, లాంగ్‌ రన్‌లో ఏ కంపెనీలు లాభాలు ఇవ్వగలవో ఇప్పటికే మీకో ఐడియా ఉండి ఉంటుంది. నిస్సంకోచంగా వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. ముఖ్యంగా, లార్జ్‌ క్యాప్స్‌ స్టాక్‌ మిమ్మల్ని నిరాశపరచవని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని యాడ్‌ చేసుకుంటూ వెళ్లాలి. 


మీరు మార్కెట్‌కు కొత్తయితే..  
ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌, సిస్టమేటిక్స్‌ గ్రూప్‌, జేఎం ఫైనాన్షియల్‌, ఆనంద్‌ రాఠీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, షేర్‌ఖాన్‌ సహా ప్రముఖ బ్రోకరేజ్‌లు ముహూరత్‌ ట్రేడింగ్‌ కోసం ఇప్పటికే కొన్ని "స్టాక్‌ పిక్‌ లిస్ట్‌"లు విడుదల చేశాయి. మీరు కాస్త పరిశోధన చేసి, లాభదాయకం అనుకున్న కంపెనీలను ఆ లిస్ట్‌ల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుదలకు అవకాశం ఉన్న కంపెనీల షేర్లను ధర తగ్గినప్పుడల్లా యాడ్‌ చేసుకుంటూ వెళ్లాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి