Quant Mutual Fund: దేశీయంగా ఒకపక్క స్టాక్ మార్కెట్లు ఎన్నడూ చూడని బుల్ జోరును కొనసాగిస్తుంటే మరోపక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో గందరగోళం కొనసాగుతోంది. ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హౌస్ క్వాంట్ ఫ్రంట్ రన్నింగ్ కి పాల్పడిందనే అనుమానంతో సెబీ నిర్వహించి సెర్చ్ అండ్ సీజర్ పెద్ద ప్రకంపనలను సృష్టిస్తోంది.


మూడు రోజుల కిందట మ్యూచువల్ ఫండ్ ఆఫీసుల్లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్వహించిన సోదాలతో చాలా మంది పెట్టుబడిదాలు తమ డబ్బును క్వాంట్ స్కీమ్స్ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం గడచిన మూడు రోజులుగా పెట్టుబడిదారులు ఏకంగా వివిధ స్కీమ్స్ నుంచి మెుత్తంగా రూ.1,400 కోట్లను ఉపసంహరించుకున్నట్లు వెల్లడైంది. పెట్టుబడిదారుల్లో తలెత్తిన ఆందోళనలతో వారు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను(SIP) పెట్టుబడులను కొనసాగించాలా లేక నిలిపివేయాలా అనే ప్రశ్నలను ప్రేరేపించాయి.


ప్రస్తుతం అనేక స్కీమ్స్ నడుపుతున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ కేటగిరీల్లో వివిధ కాల వ్యవధులలో ఆకట్టుకునే పథకాలకు ప్రసిద్ధి చెందింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గడచిన 5 ఏళ్లలో అద్భుతమైన రాబడులను తన పెట్టుబడిదారులకు అందించింది. ఈ కాలంలో ఫండ్ దాదాపు 495% అసాధారణమైన సంపూర్ణ రాబడిని సాధించింది. ఇదే క్రమంలో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా మంచి పనితీరును కనబరిచి పెట్టుబడిదారులకు 348.65% రాబడిని అందించింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మే నెలలో దాని ఖజానాలో సుమారు రూ.9,355 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇది నిర్వహణలో ఉన్న దాని మొత్తం ఆస్తులలో సుమారు 12.41 శాతానికి సమానమైనది. 


ఈ వ్యవహారంపై అనేక మంది స్టాక్ మార్కెట్ నిపుణులు సైతం ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ పెట్టుబడులను క్వాంట్ ఫండ్ హౌస్ ద్వారా కొనసాగించవచ్చని సూచించారు. ఈ పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ ఫౌండర్ సందీపా టాండన్ వెల్లడించారు. పెట్టుబడిదారులు దూకుడుగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న వేళ లిక్విడిటీ స్థాయి, రిస్క్‌ని నిర్వహించగల సామర్థ్యం గురించి పెట్టుబడిదారులు, వాటాదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మూడు రోజులుగా క్వాంట్ ఫండ్స్ నుంచి దాదాపు రూ.1,398 కోట్లను విత్ డ్రా చేసారని వెల్లడిస్తూ ఇది మెుత్తం ఆస్తుల్లో 1.5 శాతానికి సమానమైనవిగా పేర్కొన్నారు. 


క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో పెట్టుబడులను కొనసాగించటంపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ ఫిరోజ్ అజీజ్ స్పందిస్తూ.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు స్టాక్ ఇన్వెస్టర్ల మాదిరిగా వార్తలకు ప్రతిస్పందించకూడదన్నారు. స్టాక్‌పై ప్రతికూల వార్తలు స్టాక్ ధరలో తక్షణ పతనానికి దారితీయవచ్చని, అయితే ఆ లాజిక్ మ్యూచువల్ ఫండ్‌కు వర్తించదని  స్పష్టం చేశారు. మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్‌ల బుట్ట, దాని పనితీరు స్టాక్‌ల అంతర్లీన పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇదే క్రమంలో ఇతర నిపుణులు సైతం పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లను లిక్విడేట్ చేయెుద్దని సూచిస్తున్నారు. అయితే స్వల్ప కాలంలో ఇలాంటి విత్ డ్రా ధోరణి కారణంగా కొత్త ఒత్తిడి ఉంటుందని, పెట్టుబడుల విలువ ఎన్ఏవీ సైతం తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.