Pension Scheme: ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు లేదా సీనియర్‌ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వివిధ పెన్షన్‌ పాన్లను తీసుకొచ్చింది. ఈ పథకాలు పెన్షన్‌ రూపంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని విశ్రాంత ఉద్యోగులకు అందిస్తుంటాయి. అలాంటి పథకాల్లో ఒకటి 'ప్రధాన మంత్రి వయ వందన యోజన' (Pradhan Mantri Vaya Vandana Yojana - PMVVY). ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ. 18,500 వరకు పొందవచ్చు. అయితే.. ఈ ప్లాన్‌ మీరు తీసుకోవాలంటే 2023 మార్చి 31వ తేదీ వరకు, అంటే ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉంది.


'ప్రధాన మంత్రి వయ వందన యోజన'ను 2022-23 ఆర్థిక సంవత్సరం వరకే కొనసాగిస్తారు, 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభ రోజు నుంచి కనిపించదు. 2023 మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టిన వాళ్లకు మాత్రమే ఈ పథకం నుంచి ప్రయోజనాలు అందుతాయి. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, నెలనెలా ఆదాయం రావడంతో పాటు, అసలు మొత్తం కూడా తిరిగి వస్తుంది.


ప్రధాన మంత్రి వయ వందన యోజన
ఈ ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 4 మే 2017న ప్రారంభించింది. సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు. మీరు ఈ పథకంలో మొత్తం 10 సంవత్సరాల పాటు డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం 10 ఏళ్ల పాటు పెన్షన్‌ను పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఎల్‌ఐసీ మీకు తిరిగి ఇస్తుంది. ఒకవేళ, మీరు ఈ పాలసీని 10 ఏళ్ల లోపే ఆపేయాలని అనుకుంటే, ఆ వెసులుబాటు కూడా అందుబాటులో ఉంది.


పెన్షన్ ఎలా పొందాలి?
ఈ పథకంలో గమనించదగ్గ విషయం ఏమిటంటే, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని బట్టి మీకు పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. మీ అవసరానికి అనుగుణంగా పెన్షన్ స్వీకరణను ఎంచుకోవచ్చు. అంటే.. నెలకు ఒకసారి, త్రైమాసిక పద్ధతిలో, అర్ధ సంవత్సరానికి ఒకసారి, వార్షిక ప్రాతిపదికన కూడా పెన్షన్ పొందవచ్చు. మీకు ఎలా అవసరం అయితే, ఆ ఆప్షన్‌కు మారవచ్చు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి పెట్టుబడిదార్లకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.


ఈ పాలసీపై లోన్ కూడా.. 
పాలసీదారు ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, అతను మెచ్యూరిటీ సమయానికి ముందే డబ్బు తీసుకోవచ్చు. జీవిత భాగస్వామికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైతే, వాళ్ల వైద్య ఖర్చుల కోసం కూడా ఈ స్కీమ్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతో పాటు.. మీకు అవసరమైతే, పాలసీని కొనుగోలు చేసిన 3 సంవత్సరాల తర్వాత దానిపై రుణం తీసుకోవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి పెట్టిన మొత్తం నామినీకి అందిస్తారు.


రూ. 18,500 పెన్షన్ ఎలా పొందవచ్చు?
ఈ పథకంలోని ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలిద్దరూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి, మీరు మొత్తం రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ అపరిస్థితిలో, ఒక వ్యక్తి రూ. 15 లక్షల పెట్టుబడిపై ప్రతి నెలా రూ. 9,250 పెన్షన్ పొందుతారు. ఇద్దరికి కలిపి రూ. 18,500 పెన్షన్ లభిస్తుంది. 


LIC అధికారిక వెబ్‌సైట్ (ఆన్‌లైన్‌) లేదా LIC బ్రాంచ్‌కు వెళ్లడం ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.