PPF Account Closure: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (Public Provident Fund) జమ చేసే మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. PPF ఖాతాను పోస్టాఫీసు లేదా ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా ఓపెన్‌ చేయవచ్చు. ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 500 - గరిష్టంగా రూ. ఒక లక్షా 50 వేలను PPF ఖాతాలో జమ చేయవచ్చు.


ఇది EEE కేటగిరీ పథకం. అంటే ప్రతి సంవత్సరం మీరు డిపాజిట్ చేసిన మొత్తం, ఆ మొత్తం మీద ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో అందుకున్న సొమ్ము.. ఈ మొత్తం డబ్బు పన్ను రహితం.


దీర్ఘకాల పెట్టుబడికి ఇదొక మంచి ఆప్షన్‌. PPF ఖాతాలో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. 15 సంవత్సరాలు ముగిసిన తర్వాత, మీకు కావాలంటే మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. 


ఖాతా ప్రారంభించిన 15 ఏళ్ల తర్వాత, మీరు జమ చేసిన మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. అయితే, మెచ్యూరిటీకి ముందే PPF ఖాతా నుంచి మీరు కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే కొన్ని షరతులు పాటించాలి. ముందస్తు ఉపసంహరణకు కొంత జరిమానా చెల్లించాల్సి రావచ్చు.


ఆరేళ్ల లాక్‌-ఇన్‌ పిరియడ్‌
PPF ఖాతా మొదటి 6 సంవత్సరాలు పూర్తిగా లాక్ అవుతుంది. ఈ కాలంలో ఒక్క రూపాయి కూడా వెనక్కు తీసుకోవడం కుదరదు. ఆ తర్వాత, PPF ఖాతా నుంచి ఏటా 50 శాతం డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. 


ఉదాహరణకు... ఒక వ్యక్తి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో PPF ఖాతా ద్వారా పెట్టుబడిని ప్రారంభిస్తే, అతను 2026-2027 తర్వాత మాత్రమే డబ్బును విత్‌ డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. ముందస్తు విత్‌ డ్రా మీద కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 


PPF ఖాతా మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు మరణిస్తే, ఖాతాదారు నామినీకి ఈ 6 సంవత్సరాల ఈ షరతు వర్తించదు. నామినీ ఎప్పుడైనా డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు.


ఫారం-C ద్వారా డబ్బు విత్‌ డ్రా
కొంత మంది తమ PPF ఖాతాలను 15 ఏళ్లలోపే మూసివేస్తుంటారు. ఖాతాదారు లేదా వారిపై ఆధారపడిన వారికి ప్రాణాంతక అనారోగ్యం లేదా ఉన్నత విద్య వంటి ప్రత్యేక అవసరాల కోసం డబ్బు అవసరమైతే PPF ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు. మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్‌ చేస్తే, తెరిచిన తేదీ నుంచి మూసివేసిన తేదీ వరకు 1 శాతం వడ్డీని తీసేస్తారు.


PPF ఖాతా నుంచి ముందుగానే డబ్బును విత్‌ డ్రా చేసుకోవడానికి మీరు ఫారం-C సమర్పించాలి. ఈ ఫామ్ పోస్టాఫీసు, బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫామ్‌లో, మీ ఖాతా నంబర్, మీరు విత్‌ డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని పూరించాలి. ఫామ్‌ను పాస్‌బుక్‌తో పాటు సంబంధిత అధికారికి సమర్పించాలి. ఆ మొత్తం నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. లేదా, ఆ డబ్బును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా నేరుగా విత్‌ డ్రా చేసుకోవచ్చు.