Post Office Schemes: కేంద్ర ప్రభుత్వం ఈ దసరా, దీపావళికి ప్రజలకు శుభవార్త చెప్పనుంది? పోస్టాఫీస్ స్కీములుగా పిలిచే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు పెంచనుందని సమాచారం. అక్టోబర్ నుంచి సవరించిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఇదే జరిగితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (NSC) లబ్ధిదారులకు మేలు జరగనుంది.
బాండ్ యీల్డులే కారణం
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్ల పెంపునకు ఓ కారణం ఉంది. 2022, ఏప్రిల్ నుంచి పదేళ్ల బెంచ్‌మార్క్ బాండ్ యీల్డులు నిలకడగా 7 శాతానికి పైగా ఉంటున్నాయి. 2022 జూన్ నుంచి ఆగస్టు మధ్య వీటి సగటు 7.31 శాతంగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2016, మార్చి 18న విడుదల చేసిన సూత్రం ప్రకారం పీపీఎఫ్ వడ్డీరేటు వచ్చే త్రైమాసికంలో 7.56 శాతానికి పెరగొచ్చు. మూడు నెలల ప్రభుత్వ సెక్యూరిటీల (G-Sec) యీల్డు సగటు + 25 బేసిస్ పాయింట్లను అనుసరించి ఇది ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీరేటు 7.1 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
సుకన్యకు మళ్లీ 8%
ఆడ పిల్లలకు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకం (SSC) వడ్డీరేటు ఇప్పుడున్న 7.6 శాతం నుంచి అతి త్వరలోనే 8.3 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. మూడు నెలల ప్రభుత్వ సెక్యూరిటీల యీల్డు + 75 బేసిస్ పాయింట్లను అనుసరించి ఇది ఉంటుంది. అలాగే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లనూ ఈ నెలాఖర్లో సమీక్షించనున్నారని సమాచారం. ప్రభుత్వం వడ్డీరేట్ల పెంపునకు ఈ ఫార్ములాను ఉపయోగించుకున్నా సాధారణంగా పెంచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది.
2020లో చివరిసారి!
చివరి సారిగా 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను సవరించారు. 2022, సెప్టెంబర్ వరకు వీటిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ప్రభుత్వ సెక్యూరిటీల యీల్డు ఎక్కువగా పెరగడంతో సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లు పెంచుతారన్న వార్తలు వెలువడుతున్నాయి.
స్ప్రెడ్ ఆధారంగా పెంపు
సాధారణంగా ఒకే మెచ్యూరిటీ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల యీల్డులను బట్టి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను నిర్ణయిస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం వడ్డీరేట్లను సమీక్షించేటప్పుడు చివరి 3 నెలల యీల్డులను పరిగణనలోకి తీసుకుంటుంది. 2011లో శ్యామలా గోపీనాథ్ కమిటీ సూచనల మేరకు వడ్డీరేట్లను మార్కెట్‌కు అనుసంధానం చేశారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీల రాబడిపై 0-100 బేసిస్ పాయింట్ల వరకు స్ప్రెడ్ (100 బేసిస్ పాయింట్లు = 1 శాతం) ఉంటుంది. పీపీఎఫ్ మీద 25 బేసిస్ పాయింట్లు, సుకన్య సమృద్ధి యోజనపై 75 బేసిస్ పాయింట్లు, సీనియర్ సిటిజన్ స్కీములపై 100 బేసిస్ పాయింట్ల స్ప్రెడ్ ఉంటుంది.
అక్టోబర్ నుంచి అమలు
ఈ ఏడాది సెప్టెంబర్ 30న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై సమీక్ష ఉంది. ఇందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగానే 2022-23 ఆర్థిక ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రేట్ల అమలు ఉంటుంది. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పాత వడ్డీరేట్లే అమల్లో ఉంటాయి.