Post Office Scheme: కేంద్ర ప్రభుత్వం నడిపించే చిన్న మొత్తాల పొదుపు పథకాలు ‍‌(Small savings scheme) సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. చిన్న మొత్తాల పొదుపు పథకాల కిందకు... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) వంటి స్కీమ్స్‌ వస్తాయి. వీటిలో ఒక మంచి మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో పెద్ద మొత్తంలో సంపద తిరిగి చేతిలోకి వస్తుంది.


స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో.. మీరు NSCని ఎంచుకుంటే, దానిపై ఎంత వడ్డీ ఆదాయం వస్తుంది, ఐదేళ్ల కాలానికి ఎంత మొత్తం తిరిగి వస్తుందన్న కాలుక్యులేషన్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో ఐదేళ్ల పాటు మీ డబ్బును ఇన్వెస్ట్ చేయగలిగితే, మెచ్యూరిటీ అమౌంట్‌ మీద ఏడాదికి 7.7% చొప్పున వడ్డీని పొందవచ్చు. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. అంటే, మీ దగ్గర ఎంత డబ్బున్నా దానిని NSC అకౌంట్‌లో డిపాజిట్‌ చేయవచ్చు. 


NSCని ఎంచుకుంటే ఆదాయ పన్ను ప్రయోజనం         
ముందే చెప్పుకున్నట్లు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కాబట్టి పెట్టుబడి నష్టం/భయం ఉండదు. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్లు హామీతో కూడిన రాబడి ‍‌(Guaranteed return) పొందుతారు. ఇంకా చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. పైగా, ఆదాయ పన్ను ఆదా అవుతుంది. ఈ స్కీమ్‌లో జమ చేసే డబ్బుకు, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C (Section 80C of the Income Tax Act) కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల మొత్తం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 


ఐదేళ్ల కాలానికి, NSCలో రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు పెట్టే పెట్టుబడిపై ఎంత మొత్తం చేతికి అందుతుంది?      


మీరు NSCలో ఐదేళ్ల కాలానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, మీకు మొత్తం రూ. 44,903 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్‌గా రూ. 1.44 లక్షల కార్పస్ లభిస్తుంది.
రూ. 5 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో రూ. 2.24 లక్షల వడ్డీ అందుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 7.24 లక్షలు.
రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, ఐదేళ్లలో మీకు రూ. 4.49 లక్షల వడ్డీతో కలిపి, రూ. 14.49 లక్షలు కార్పస్‌గా లభిస్తుంది.
రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే, వడ్డీ రూపంలో రూ. 8.98 లక్షలతో కలిపి మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 28.98 లక్షలు చేతికి వస్తుంది.
రూ. 30 లక్షల పెట్టుబడిపై ఐదేళ్ల కాలానికి అందే వడ్డీ రూ. 13.47 లక్షలు. మెచ్యూరిటీ తర్వాత తిరిగి వచ్చే మొత్తం రూ. 43.47 లక్షలు.
రూ. 40 లక్షలు పెట్టుబడి పెడితే, మొత్తం కార్పస్ రూ. 57.96 లక్షలు అవుతుంది. ఇందులో వడ్డీ ఆదాయం రూ. 17.96 లక్షలు.
రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 72.45 లక్షలు చేతికి వస్తుంది. ఇందులో వడ్డీ ఆదాయం రూ. 22.45 లక్షలు ఉంటుంది.


ఇది కూడా చదవండి: మార్కెట్‌ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్‌' మీ దగ్గర ఉన్నాయా?