Post Office Scheme: కరోనా ముందున్న కాలానికి, ఇప్పటికి చాలా విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే మన దేశంలోని పెద్ద శాతం జనాభా బ్యాంక్‌, పోస్టాఫీసు లేదా LIC పథకాల వంటి సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో మాత్రమే డబ్బులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఇదే కోవకు చెందితే, మంచి పోస్టాఫీసు పథకం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును గతంలో కంటే వేగంగా రెట్టింపు చేయవచ్చు. 


ఆ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra). ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి, ఈ పథకంపై లభించే వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం 7.2 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. వడ్డీ రేటు పెంపు తర్వాత, ఇప్పుడు ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తం ఇంకా త్వరగా రెట్టింపు అవుతుంది. 


కిసాన్ వికాస్ పత్ర వివరాలు
కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది ఏకమొత్తం డిపాజిట్ పథకం ‍‌(One-time Deposit Scheme). ఈ స్కీమ్‌లో చేరే పెట్టుబడిదారు, తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఒకే దఫాలో పెట్టుబడిగా జమ చేయాలి. ఆ తర్వాత, నిర్ణీత కాల వ్యవధిలో రెట్టింపు డబ్బును పొందవచ్చు. ఈ పథకం కింద, మీరు పోస్టాఫీసుకు వెళ్లి ఖాతా తెరవవచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో, మీరు కనిష్టంగా రూ. 1,000 జమ చేయాలి, గరిష్ట మొత్తానికి ఎలాంటి పరిమితి లేదు.


గతం కంటే వేగంగా డబ్బు రెట్టింపు
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కిసాన్ వికాస్ పత్ర పథకం వడ్డీ రేటును పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఈ పథకం డిపాజిట్లను రెట్టింపు చేసే కాల వ్యవధి తగ్గింది. ఇంతకుముందు, డబ్బు డబుల్‌ కావడానికి 120 నెలలు పట్టేది, ఇప్పుడు 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. మీరు పథకంలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, 115 నెలల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్‌గా రూ. 20 లక్షలు పొందవచ్చు. ఈ పథకం కింద, చక్రవడ్డీ రేటు ప్రయోజనం అందుతుంది.


కిసాన్ వికాస్ పత్ర కింద, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న ఎవరైనా ఖాతా ఓపెన్‌ చేయవచ్చు, డిపాజిట్‌ చేయవచ్చు. కనీస మొత్తం రూ. 1000 నుంచి, గరిష్టంగా ఎంత మొత్తాన్నైనా రూ. 100 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్‌ అకౌంట్‌తో పాటు, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్‌లో అకౌంట్‌ కూడా తెరవవచ్చు. 


డిపాజిట్‌ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు మరణిస్తే..?
ఒకవేళ, డిపాజిట్‌ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే KVP ఖాతాదారు మరణిస్తే, ఆ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని నామినీ క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం, ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రం, నామినీ వ్యక్తిగత గుర్తింపు పత్రాన్ని పోస్టాఫీసులో సమర్పించాలి. ఆ తర్వాత సంబంధిత ఫారం నింపి సబ్మిట్‌ చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత, కొన్ని రోజుల్లోనే డబ్బు చేతికి వస్తుంది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: సిబిల్‌ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి