Low CIBIL Score: ఈ భూమ్మీద ఉన్న ప్రతి సగటు మనిషికి డబ్బుకు కటకటలాడే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటప్పుడు బంధుమిత్రుల దగ్గర అప్పు తీసుకుంటారు. కావల్సిన మొత్తం పెద్దదైతే, బ్యాంకులు లేదా NBFCల గడప తొక్కుతారు. మంచి క్రెడిట్ స్కోర్‌లు ఉన్న వ్యక్తులకు పర్సనల్‌ లోన్‌ దొరకడం పెద్ద మ్యాటరే కాదు. క్రెడిట్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవాళ్లకే చిక్కొచ్చి పడుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి రూపాయి ఇవ్వడానికి కూడా బ్యాంకులు ఇష్టపడవు. 


సిబిల్‌ స్కోర్‌ ఎంత ఉండాలి?
CIBIL స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బెస్ట్‌ స్కోర్‌గా బ్యాంక్‌లు లెక్కలోకి తీసుకుంటాయి. 700 కంటే తక్కువ ఉన్నవాళ్లకు పర్సనల్‌ లోన్‌ పుట్టడం కష్టం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, CIBIL స్కోర్ 700 కంటే తక్కువ ఉన్న వాళ్ల పరిస్థితేంటి, వాళ్ల కష్టం గట్టెక్కే మార్గమేంటి? అంటే, కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే వ్యక్తిగత రుణం తీసుకునే మార్గం సులభంగా మారుతుంది.


అన్నింటికంటే ముందు, లోన్ కోసం అప్లై చేసే ముందే మీరు మీ క్రెడిట్ రిపోర్టును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. కొన్ని సార్లు క్రెడిట్ రిపోర్ట్ అప్‌డేట్ కాదు. లేదా, దానిలో మీకు సంబంధం లేని తప్పుడు ఎంట్రీ ఉండవచ్చు. మీకు అలాంటి ఇష్యూ కనిపిస్తే, లోన్ తీసుకునే ముందే దాన్ని సరిదిద్దుకోండి.


మీ ఆదాయం, ఆస్తిపాస్తులను చూపించడం
మీ క్రెడిట్ రిపోర్ట్‌లో సరిదిద్దలేని లోపం ఉంటే, లోన్‌ పొందే మరో మార్గం ఉంది. రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం మీకు ఉందని రుణదాత దగ్గర మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్‌లో మీ జీతం, సేవింగ్స్‌ లేదా మీ ఆస్తుల వివరాలు ఉండవు. అలాంటి వాటిని చూపించి లోన్‌ అడగవచ్చు. అప్పుడు, కొంచెం ఎక్కువ వడ్డీ రేటుతోనైనా రుణం ఇవ్వడానికి బ్యాంకర్‌ అంగీకరించే అవకాశం ఉంది.


జాయింట్‌ లోన్‌ కోసం ట్రై చేయండి
మీ CIBIL స్కోర్ తక్కువగా ఉంటే... మీ తండ్రి, సోదరుడు, సోదరి లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్‌ లోన్‌ కోసం అప్లై చేయవచ్చు. అయితే, ఉమ్మడి రుణంలో మీతో ఉండే వ్యక్తికి అధిక CIBIL స్కోర్‌ ఉండాలి. ఇలాంటి చిట్కా పాటిస్తే బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ మీకు 'నో' చెప్పదు. ఎక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని రుణాన్ని మంజూరు చేయవచ్చు.


తక్కువ లోన్‌ కోసం అప్లై చేయండి
పైన పేర్కొన్న చిట్కాలు పని చేయకపోతే, మరో మార్గం కూడా ఉంది. అది.. తక్కువ మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే, పెద్ద మొత్తంలో EMIని మీరు తిరిగి చెల్లించగలరా, లేదా అని మీ కెపాసిటీని రుణదాత అనుమానించవచ్చు. రుణం మొత్తం తక్కువగా ఉంటే, దానిని తిరిగి చెల్లించగలమంటూ రుణదాతను ఒప్పించవచ్చు.


NBFC లేదా ఫిన్‌టెక్ కంపెనీ నుంచి రుణం
చివరిగా ఈ రెమెడీని ఉపయోగించండి. చాలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), కొత్త తరం ఫిన్‌టెక్ కంపెనీలు తక్కువ క్రెడిట్ స్కోర్/తక్కువ CIBIL స్కోర్ ఉన్నప్పటికీ మీ లోన్‌ అప్లికేషన్‌కు ఓకే చెప్పవచ్చు. అయితే, వాటి వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటాయని మాత్రం మర్చిపోవద్దు.