Bal Jeevan Bima Yojana: తమ పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని, తామెన్ని కష్టాలు ఎదుర్కొన్నా తమ సంతానం మాత్రం ఎలాంటి ఉబ్బందులు పడకుండా జీవించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, ఘనంగా వివాహాలు చేయాలని కూడా ఆశ పడతారు. అయితే, ఉన్నత విద్య, పెళ్లిళ్ల వంటి సందర్భాల కోసం లక్షల రూపాయలు కావాలి. భారీ ఖర్చును భరించలేని వాళ్లు, అలాంటి సందర్భాల్లో అవస్థలు పడతారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ముందస్తు ప్రణాళిక అవసరం. పిల్లల కోసం పెట్టుబడి ప్రణాళికను వాళ్లు పుట్టినప్పటి నుంచి ప్రారంభిస్తే, అవసరానికి ఆ డబ్బు అక్కరకు వస్తుంది.


పిల్లల చదువుల దగ్గర నుంచి పెళ్లి వరకు చాలా ఖర్చులను అనేక ప్రభుత్వ పథకాలు భరిస్తున్నాయి. మీరు కూడా మీ పిల్లల కోసం మంచి పెట్టుబడి ఆప్షన్‌ కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ ప్రత్యేక పథకం ఒకటి ఉంది.


ఈ పోస్ట్‌ ఆఫీస్‌ పథకం పేరు 'బాల్ జీవన్‌ బీమా యోజన' (చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్). పిల్లల భవిష్యత్తు కోసమే ఈ బీమా పథకాన్ని రూపొందించారు. తల్లిదండ్రులు, తమ పిల్లల పేరుతో బాల జీవన్‌ బీమా యోజనను తీసుకోవచ్చు. నామినీగా పిల్లలను ఉంచాలి. ఒక కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ  పథకం వర్తిస్తుంది. ఈ పథకం కోసం తల్లిదండ్రుల వయస్సు కూడా ముఖ్యమే. 45 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయలేరు.


5-20 సంవత్సరాల వయస్సు వారికి లైఫ్ ఇన్సూరెన్స్
ఈ పథకం, 5 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి వర్తిస్తుంది. ఈ పథకం తీసుకుంటే... కట్టాల్సిన ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన జమ చేయవచ్చు. చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద, ప్రతిరోజు రూ. 6 నుంచి రూ. 18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. ఈ ప్లాన్‌ మెచ్యూరిటీ తేదీన, కనీసం రూ. 1 లక్ష హామీతో కూడిన ప్రయోజనం లభిస్తుంది.


 చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పూర్తి వివరాలు:


* ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుంది
* ఈ పథకం తీసుకోవడానికి, పిల్లల వయస్సు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి
* మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది
* పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారు (తల్లి లేదా తండ్రి) వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు
* పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, అటువంటి పరిస్థితిలో, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు.
* పాలసీ ప్రీమియాన్ని తల్లిదండ్రులు చెల్లించాలి
* ఈ పాలసీ మీద రుణ ప్రయోజనం ఉండదు
* మీకు వద్దు అనుకుంటే, ఈ పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు
* రూ. 1000 హామీ మొత్తం మీద ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ ఇస్తారు