NPS New Fund: పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ), నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌ను (NPS) మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. ప్రభుత్వేతర యువ సబ్‌స్క్రైబర్‌లను ఆకట్టుకోవడానికి మరో రెండు, మూడు నెలల్లో కొత్త లైఫ్ సైకిల్ ఫండ్‌ ఆప్షన్‌లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆప్షన్లను ఎంచుకుంటే, పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బు పోగుపడే అవకాశం ఉంది.


PFRDA చైర్మన్ దీపక్ మొహంతి చెప్పిన ప్రకారం... ప్రతిపాదిత పథకం వల్ల, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టే చందాదార్ల డబ్బు పెరుగుతుంది. ప్రస్తుతం, రిస్క్‌ను తగ్గించడానికి, 35 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గిస్తున్నారు. కొత్త లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ ద్వారా ఈ పరిమితిని 45 సంవత్సరాలకు చేరుస్తారు. 


ఈక్విటీ ఫండ్స్‌లో ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) కొత్త బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ ఫండ్‌ను ప్రారంభిస్తామని దీపక్ మొహంతి చెప్పారు. ప్రస్తుతం LC 75, LC 50, LC 25 పేరిట మూడు రకాల లైఫ్ సైకిల్ ఫండ్స్‌ ఉన్నాయి. వీటిని... అగ్రెసివ్ ఆటో ఛాయిస్, మోడరేట్ ఆటో ఛాయిస్, కన్జర్వేటివ్ ఆటో ఛాయిస్ అని కూడా పిలుస్తున్నారు.


లైఫ్ సైకిల్ ఫండ్‌లో, చందాదార్లు స్వేచ్ఛగా పెట్టుబడి ఆప్షన్స్‌ ఎంచుకోవచ్చు. సబ్‌స్క్రైబర్‌ ఎంచుకున్న ఆప్షన్‌ ప్రకారం ఈక్విటీ - డెట్/బాండ్స్‌ మధ్య కేటాయింపులు ఉంటాయి. టైర్-1, టైర్-2 NPS ఖాతాల కోసం ఆటో/యాక్టివ్ ఆప్షన్‌తో సహా వివిధ రకాల పెట్టుబడి ఎంపికలు దీనిలో ఉంటాయి.


ఈ పథకం కింద, ప్రస్తుతమున్న 35 సంవత్సరాల వయస్సు నుంచి కాకుండా, చందాదారుకు 45 సంవత్సరాల వయస్సు వచ్చిన నాటి నుంచి ఈక్విటీల్లో అతని పెట్టుబడులు క్రమంగా తగ్గుతాయి. ఇదే జరిగితే, NPSను ఎంచుకునే వ్యక్తులు ఎక్కువ కాలం ఈక్విటీ ఫండ్స్‌లో ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇది దీర్ఘకాలిక పెన్షన్ కార్పస్‌ను సృష్టిస్తుంది. దీర్ఘకాలం మార్కెట్‌లో ఉంటారు కాబట్టి రిస్క్-రిటర్న్ మధ్య సమతౌల్యం కూడా ఏర్పడుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఎన్‌పీఎస్ నాన్-గవర్నమెంట్ కింద 9.7 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 11 లక్షలకు పెరుగుతుందని అంచనా.


గత ఆర్థిక సంవత్సరం 2023-24లో, 1.22 కోట్ల మంది కొత్త చందాదార్లు  అటల్ పెన్షన్ యోజనలో (APY) చేరారని PFRDA చైర్మన్ దీపక్ మొహంతి చెప్పారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు, ఒక ఆర్థిక సంవత్సరంలో ఇదే రికార్డ్‌ నంబర్‌ అని వివరించారు. మరో విశేషం ఏంటంటే... 1.22 కోట్ల మంది కొత్త చందాదార్లలో ఎక్కువ మంది (52 శాతం) మహిళలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో 1.3 కోట్ల మంది చందాదార్లు APYలో చేరవచ్చని భావిస్తున్నారు. 2024 జూన్ ముగింపు నాటికి, అటల్ పెన్షన్ యోజనలో చేరిన మొత్తం చందాదారుల సంఖ్య 6.62 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు మొహంతి చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: మోదీ 3.0 బడ్జెట్‌లో ఈ వర్గంపై ఆదాయ పన్ను భారం తగ్గింపు!