Sukanya Samriddhi Yojana: మహిళలు, బాలికల స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను (Government Schemes for Women) అమలు చేస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం. కేంద్ర ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఇటీవలే పెంచింది. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు కూడా పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత, SSY వడ్డీ రేటు 7.60 శాతం నుంచి 8.00 శాతానికి చేరింది. ఈ రేట్లు 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) అమలవుతాయి.
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వాళ్ల చదువులు, పెళ్లి ఖర్చుల కోసం ప్రతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళనను దూరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ కుమార్తెకు 21 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ₹69 లక్షలకు యజమానురాలిని చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హత, మార్గం గురించి తెలుసుకుందాం.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు
సుకన్య సమృద్ధి యోజన కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఆమె తల్లిదండ్రులు ఖాతా తెరవవచ్చు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఖాతాను ప్రారంభిస్తే, ఆ పాపకు 15 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అక్కడితో పెట్టుబడి అంకం పూర్తవుతుంది. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, ఖాతాలో మీరు జమ చేసిన మొత్తం మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బు ఆమె ఉన్నత చదువులకు పనికి వస్తుంది. బాలికకు 21 ఏళ్లు నిండిన తర్వాత, ఖాతా నుంచి పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బు ఉన్నత చదువు లేదా వివాహం కోసం ఉపయోగపడుతుంది.
69 లక్షల రూపాయలు ఎలా పొందుతారు?
మీరు, 2023 ఏప్రిల్-జూన్ నెలల మధ్య మీ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి ఖాతాను తెరిస్తే, జమ చేసే మొత్తంపై 8.00 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతాలో ఏడాదికి రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం, ఆడపిల్లకి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు రూ. 69 లక్షల నిధి లభిస్తుంది. మీరు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాలంటే, ప్రతి నెలా రూ. 12,500 మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పన్ను రాయితీ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
SSY ఖాతా ఎలా తెరవాలి?
మీరు ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో SSY ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి, తప్పనిసరిగా ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం లేదా ఆధార్ కార్డు ఉండాలి. దీంతో పాటు, కుమార్తె తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, చిరునామా రుజువును వంటివి ఉండాలి. బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి ఫారంను పూరిస్తే, మీ కుమార్తె పేరిట SSY ఖాతా ప్రారంభం అవుతుంది. ఒక పేరెంట్ తరపున గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం మాత్రమే SSY ఖాతాను ఓపెన్ చేయగలరు. ఒకవేళ, ఆ తల్లిదండ్రులకు రెండోసారి కవల ఆడపిల్లలు పుడితే, అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు కూతుళ్ల కోసం కూడా సుకన్య సమృద్ధి ఖాతా తెరవవచ్చు.