Provident Fund Limit : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  (Finance Minister Nirmala Sitharaman) ఈ నెల జులై 23న కేంద్ర బడ్జెట్‌ ప్రకటిస్తారు. మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్న ప్రకారం, ప్రస్తుత ప్రావిడెంట్ ఫండ్ (PF) పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్‌ వాస్తవమైతే, లక్షలాది మంది ఉద్యోగులకు మరింత ప్రయోజనం & సామాజిక భద్రత విషయంలో భారీ మార్పను చూడొచ్చు. 


మన దేశంలోని ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి, అత్యససర సమయాల్లో అండగా నిలవడానికి ప్రావిడెంట్ ఫండ్‌ను రూపొందించారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) పథకం కింద ఏర్పాటైంది. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఉద్యోగి మూల వేతనంలో 12% చొప్పున ప్రతి నెలా కాంట్రిబ్యూట్‌ చేస్తారు.


దీర్ఘకాలిక ప్రయోజనం


ఈ ఫండ్‌ ప్రస్తుత వేతన పరిమితి రూ. 15,000. పదేళ్ల నుంచి, అంటే, 2014 సెప్టెంబర్‌ నుంచి ఇదే మొత్తం అమల్లో ఉంది. ఈ పదేళ్లలో పెరిగిన జీవన వ్యయాలు & ద్రవ్యోల్బణం కారణంగా ఈ పరిమితిని పాతదిగా లెక్కించాలి. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న రూ. 25,000 వల్ల మరింత మంది ఉద్యోగులను తప్పనిసరి కవరేజ్ కిందకు వస్తారు. తద్వారా PF ప్రయోజనాలను ఎక్కువ మంది అందుకుంటారు.


ఈ నెల 23న, 2024-25 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్న నిర్మల సీతారామన్, కొత్త PF పరిమితి ప్రకటించే అవకాశం ఉంది. ఈ విధాన మార్పును అమలు చేసేందుకు కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


కొన్ని చిక్కులు


రూ. 15,000 కంటే ఎక్కువ - రూ. 25,000 కంటే తక్కువ నెల జీతం తీసుకుంటున్న ఉద్యోగులు తప్పనిసరి చందా వైపు మారితే... ఈ విభాగంలో ఊహించని మార్పులు చూసే అవకాశం ఉంది. ఆ ఉద్యోగుల జీతం నుంచి కట్‌ అయ్యే 12% డబ్బు EPF, EPS ఖాతాల్లోకి వెళతాయి. ఈపీఎఫ్‌ ఖాతాపై ఏటా వడ్డీ రాబడి కూడా వస్తుంది. అంటే, "దీర్ఘకాలిక ఆర్థిక భద్రత + అధిక రాబడి" గొడుగు కిందకు ఉద్యోగులు వస్తారు. అయితే.. ఇంటికి తీసుకెళ్లే జీతం కొంతమేర తగ్గుతుంది, ఇంటి బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.


ఈ ఫండ్‌ ప్రస్తుత పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 25,000 పెంచితే, కంపెనీ యాజమాన్యాలు కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా పరిపాలన పరమైన సర్దుబాట్లు చేసుకోవాలి. కొత్తగా పీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కోసం 12% కాంట్రిబ్యూట్‌ చేయాలి. దీనివల్ల పరిపాలన భారం & ఆర్థిక వ్యయం పెరుగుతాయి. కొన్ని వ్యాపారాలకు, ప్రత్యేకించి చిన్న & మధ్యతరహా పరిశ్రమలకు ఇది ఆందోళనకర విషయం.


ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు


ఇంటిని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం లేదా మార్పులు చేయడం, వైద్య ఖర్చులు, ఉన్నత విద్య ఖర్చులు, వివాహ సంబంధిత ఖర్చుల వంటి కొన్ని నిర్దిష్ట అవసరాల కోసం పీఎఫ్‌ ఖాతాలో డబ్బును ఉపయోగించుకోవచ్చు.


ఉద్యోగి ఖాతాలో పీఎఫ్‌ మొత్తం ప్రతి నెలా పెరుగుతుంది, ఆ మొత్తంపై వార్షిక వడ్డీ జమ అవుతుంది. ఇది, డబ్బు విలువను పెంచుతుంది + దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పిస్తుంది.


ప్రావిడెంట్ ఫండ్‌ విరాళాలపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: చల్లబడిన పసిడి సెగ - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయ్‌