New Rules From March 01, 2025: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, మన దేశంలో కొన్ని కొత్త రూల్స్‌/ మార్పులు కూడా అమల్లోకి వస్తుంటాయి. అదే విధంగా, మార్చి నెల నుంచి కొన్ని నూతన నియమాలు అమల్లోకి వచ్చాయి, డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా వాటిలో ఉన్నాయి. నయా రూల్స్‌ గురించి తెలుసుకుంటే మీరు అప్‌డేటెడ్‌గా ఉండడమే కాదు, ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడతారు. ఈ నెల ప్రారంభం (మార్చి 01, 2025) నుంచి కొన్ని కీలక విషయాల్లో మార్పులు జరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ ఖాతాలో నామినీ పేరను జోడించడం దగ్గర నుంచి బీమా ప్రీమియం కోసం UPIలో కొత్త పద్ధతి వరకు అనేక మార్పులు ఈ జాబితాలో ఉన్నాయి.


మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ అకౌంట్‌ విషయంలో సెబీ కొత్త రూల్‌
ఖాతాల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, క్లెయిమ్ చేయని ఆస్తులను తగ్గించడానికి 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) కొత్త నియమం ప్రవేశపెట్టింది. ఈ రూల్‌ ప్రకారం, 01 మార్చి 2025 నుంచి, మ్యూచువల్ ఫండ్ & డీమ్యాట్ అకౌంట్‌లో 10 మంది వరకు నామినీలను యాడ్‌ చేయవచ్చు. గతంలో ఇద్దరు నామినీలను మాత్రమే చేర్చడానికి అనుమతించేవారు. నామినీని ఉమ్మడి ఖాతాదారుగా ఉంచవచ్చు లేదా వేర్వేరు ఖాతాల మధ్య డిస్ట్రిబ్యూట్‌ చేయవచ్చు. దీని కోసం, పెట్టుబడిదారు (ఖాతా ఓనర్‌) నామినీ వివరాలను అప్‌డేట్‌ చేయాలి.


నామినీ వివరాలను నవీకరించడానికి నామినీ పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలు వంటి గుర్తింపు రుజువును సమర్పించాలి. నామినీతో పెట్టుబడిదారు సంబంధ స్థితి, సంప్రదింపు వివరాలు, పుట్టిన తేదీ (మైనర్ అయితే) మొదలైన వివరాలను అందించాలి. గరిష్టంగా 10 మందిని నామినీలుగా చేయగలిగినప్పటికీ, పవర్ ఆఫ్ అటార్నీ (POA) ఉన్నవారు నామినీలను యాడ్‌ చేయలేరు. పెట్టుబడిదారు మరణించిన సందర్భంలో, నామినీలు ఆ పెట్టుబడిపై ఉమ్మడి యాజమాన్యాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఆస్తి బదిలీ కోసం ప్రత్యేక ఖాతాలు ప్రారంభించవచ్చు. సొంతంగా అటెస్ట్‌ చేసిన మరణ ధృవీకరణ పత్రం, KYC అప్‌డేషన్‌ వంటివి దీనికి అవసరం.


మరికొన్ని కొత్త విషయాలు
వివాదాస్పద క్లెయిమ్‌లను సెబీ ప్రమేయం లేకుండా ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి. 
పెట్టుబడిదారు OTP ఆధారిత ఆన్‌లైన్ ధృవీకరణ లేదా వీడియో రికార్డ్ డిక్లరేషన్ ద్వారా నామినేషన్ నుంచి వైదొలగవచ్చు. 
దివ్యాంగ పెట్టుబడిదారులు తమ ఖాతాను నిర్వహించే బాధ్యతను మైనర్ తప్ప మరెవరికైనా అప్పగించవచ్చు. 


UPIలో 'బ్లాక్‌డ్‌ అమౌంట్‌' ఫీచర్‌
మార్చి 01 నుంచి, UPI ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు కూడా సులభంగా మారింది. Bima-ASBA ఫీచర్‌ను IRDAI ప్రారంభించింది. దీని ద్వారా, పాలసీదారు తన బ్యాంకు ఖాతాలోని ప్రీమియం మొత్తాన్ని బ్లాక్ చేయవచ్చు. పాలసీ ఆమోదించిన తర్వాత మాత్రమే ఈ చెల్లింపు జరుగుతుంది. బీమా కంపెనీ, పాలసీ అప్లికేషన్‌ను తిరస్కరిస్తే ఆ డబ్బు ఆటోమేటిక్‌గా అన్‌బ్లాక్ అవుతుంది. దీనివల్ల, పాలసీదారు డబ్బుకు భద్రత పెరుగుతుంది, మోసాల అవకాశాలను తగ్గిస్తుంది, డిజిటల్ చెల్లింపులపై కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతుంది. 


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు
రెపో రేట్‌ తగ్గింపునకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి, కొత్త రేట్లు మార్చి 01 నుంచి అమలులోకి వచ్చాయి. మీరు FD ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, వడ్డీ రేట్లలో మార్పుల గురించి తెలుసుకోండి.


మరో ఆసక్తికర కథనం: భారత్‌లో టెస్లా ప్రవేశం దాదాపు ఖాయం, మొదటి షోరూమ్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే?