Joint Home Loan Interest Rates: సామాన్యుల జీవితంలో ఇల్లు కొనడం ఒక పెద్ద కల. ఏటికేడు పెరుగుతున్న ఇళ్ల రేట్లు ఆ కలను సవాల్ చేస్తుంటాయి. సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఒక చిట్కా ఉంది. ఒక్క ఆదాయంతో లోన్ తీసుకునే బదులు, ఇద్దరి ఆదాయాన్ని చూపి హోమ్ లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల, సొంతింటిలోకి గృహ ప్రవేశం చేయవచ్చు & ఆర్థిక భారాన్నీ తప్పించుకోవచ్చు. సాధారణంగా... జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులతో కలిసి ఉమ్మడి గృహ రుణం తీసుకుంటుంటారు. దీనివల్ల హోమ్ లోన్ త్వరగా మంజూరు కావడం మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఉమ్మడి గృహ రుణం వల్ల వచ్చే కీలక ప్రయోజనాలు
అధిక రుణ అర్హత: బ్యాంకులు ఇద్దరు దరఖాస్తుదారుల ఉమ్మడి ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి, రుణ అర్హత పెరుగుతుంది. తద్వారా, మంజూరయ్యే రుణం మొత్తం కూడా పెరుగుతుంది. అయితే, ఒక దరఖాస్తుదారుడికి ఇప్పటికే ఉన్న అప్పులు రుణ అర్హతను ప్రభావితం చేయవచ్చు, కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందే వీటిని చూసుకోవాలి.
ఇద్దరికీ ఆదాయ పన్ను ప్రయోజనం: రుణగ్రహీతలు ఇద్దరూ అసలుపై (సెక్షన్ 80C) రూ. 1.50 లక్షల వరకు + వడ్డీపై రూ. 2 లక్షల వరకు (సెక్షన్ 24b) ఆదాయ పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఇద్దరూ EMI కడుతుంటేనే ఇది వర్తిస్తుంది. ఒక్కరే EMI కడుతుంటే ఆ ఒక్కరికే వర్తిస్తుంది.
రుణ కాల పరిమితి: సాధారణంగా, ఉమ్మడి గృహ రుణాల కాల పరిమితి ఎక్కువగా పెట్టుకోవచ్చు. దీనివల్ల, EMI తగ్గుతుంది. అయితే, కాల పరిమితి పెరిగే కొద్దీ వడ్డీ ఖర్చు పెరుగుతుంది. నిర్ణయం తీసుకునే ముందు స్థిర వడ్డీ రేటు & ఫ్లోటింగ్ వట్టీ రేట్లను పోల్చి చూసుకోవాలి.
తిరిగి చెల్లించే బాధ్యత: ఉమ్మడి రుణంలో, EMIని రుణగ్రహీతలు పంచుకుంటారు, ఇది వ్యక్తిగత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఊహించని అవసరాలు వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయి.
ఆస్తిపై సహ-యాజమాన్యం: చాలా బ్యాంకులు సహ-దరఖాస్తుదారులందరినీ ఆస్తికి సహ-యజమానులుగా ఉండాలని సూచిస్తాయి. ఇలా చేస్తే, ఆ ఆస్తిలో వ్యక్తిగత వాటాలపై స్పష్టత వస్తుంది, వివాదాలు తగ్గుతాయి.
దరఖాస్తు చేసుకునే ముందు మీకు ఇవి తెలియాలి
సహ-దరఖాస్తుదారులు: బ్యాంకులు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా పిల్లలు వంటి దగ్గరి కుటుంబ సభ్యులను మాత్రమే ఉమ్మడి గృహ రుణంలో సహ-రుణగ్రహీతలుగా అనుమతిస్తాయి. స్నేహితులు లేదా వ్యాపార భాగస్వాములు అర్హులు కాదు.
క్రెడిట్ స్కోర్: రుణ దరఖాస్తులను సమీక్షించేటప్పుడు బ్యాంక్‌లు అందరు దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్‌లను పరిశీలిస్తాయి. ఒక సహ-రుణగ్రహీత స్కోర్ తక్కువగా ఉంటే అధిక వడ్డీ పడవచ్చు. కాబట్టి, దరఖాస్తు చేసుకునే ముందు క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం.
రీపేమేంట్స్‌లో సమాన బాధ్యత: ఒక రుణగ్రహీత రీపేమెంట్ చెల్లించలేకపోతే, మరొకరు ఆ EMIలను కవర్ చేయాలి. అయినప్పటికీ, మిస్ చేసిన చెల్లింపులు అందరు రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి, దరఖాస్తు చేసుకునే ముందే ఇలాంటి విషయాలపై ఆలోచించుకోవాలి.
ఒకరు తప్పుకుంటే?: వివాదం, విడాకులు లేదా ఆర్థిక సమస్యల కారణంగా ఒక రుణగ్రహీత మధ్యలోనే లోన్‌ను వదిలేస్తే మిగిలిన రుణగ్రహీత ఆ రుణాన్ని ఒంటరిగా చెల్లించాలి. కొన్ని బ్యాంకులు కో-అప్లికెంట్‌ను స్థానంలో వేరొకరిని తీసుకురావడానికి, రీఫైనాన్సింగ్‌కు అనుమతిస్తాయి.
ఎక్కువ పత్రాలు, ఆమోదాలు: ఉమ్మడి రుణాలకు అందరు దరఖాస్తుదారుల జీతం స్లిప్‌లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, KYC, ఆస్తి పత్రాలు వంటి ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. ఈ ప్రాసెసింగ్ కోసం వ్యక్తిగత రుణం కంటే ఎక్కువ సమయం పడుతుంది.
ఏది ఏమైనప్పటికీ, ఉమ్మడి గృహ రుణం మీ కలల ఇంటికి చేరుకోవడానికి కొత్త మార్గాన్ని తెరుస్తుంది. దీనికి.. సహ-దరఖాస్తుదారుడిని తెలివిగా ఎన్నుకోవడం వంటి కొన్ని జాగ్రత్త అవసరం.
మరో ఆసక్తికర కథనం: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్ మీటర్ పెంచే మ్యాటర్ ఇదిగో!