Pradhan Mantri Shram Yogi Maan-Dhan: సంఘటిత రంగ ఉద్యోగులకు చాలా పింఛను పథకాలు ఉన్నాయి. వీరు పీఎఫ్, ఈపీఎఫ్, జీపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందుతారు. తక్కువ వేతనాలు పొందే అసంఘటిత రంగ కార్మికులకు గతంలో ఇలాంటివి ఉండేవికాదు. అందుకే ఉద్యోగ విరమణ తర్వాత వీరంతా పింఛను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. ఇందులో రూ.200 పెట్టుబడితో పెళ్లైన దంపతులు ఏటా రూ.72,000 వరకు పింఛను పొందొచ్చు.
ఏంటీ పథకం!
కొన్నేళ్లుగా అసంఘటిత రంగ కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారు. జీవిత చరమాంకంలో డబ్బుల్లేక ఎంతో ఇబ్బంది పడేవారు. కూలీలు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, మేస్త్రీలు, ఇటుక బట్టీల్లో పనిచేసేవారు, రిక్షా లాగేవారు, రజకులు, చేనేత, బీడీ, చర్మ ఇతర చేతి వృత్తుల కార్మికులకు ఎలాంటి పింఛన్ పథకం ఉండేది కాదు. వీరిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ (PM - SYM) పథకం తీసుకొచ్చింది.
వీరు అర్హులు!
నెలకు రూ.15,000 లోపు ఆదాయం గల 18-40 ఏళ్ల వయస్కులు ఈ పథకానికి అర్హులు. న్యూ పెన్షన్ స్కీమ్ (NPS), ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌వో చందాదారులకు అవకాశం లేదు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారూ అర్హులు కారు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవడం సులభం. మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్య ఉంటే చాలు. దగ్గర్లోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరొచ్చు.
ప్రయోజనాలు ఇవీ!
ప్రధానమంత్రి శ్రమ యోగి పథకంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి చందాదారుడికి కనీస పింఛను భద్రత ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 పింఛను అందుతుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు చందాదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం పింఛను వస్తుంది. కుటుంబానికి ఉపయోగపడుతుంది.
రూ.72వేలు ఎలా వస్తాయంటే?
ఈ పథకం ద్వారా దంపతులు ఏటా రూ.72,000 పింఛను పొందొచ్చు. ఉదాహరణకు దంపతుల వయసు 30 ఏళ్లని అనుకుందాం. ఒక్కొక్కరు నెలకు రూ.100, ఇద్దరూ కలిపి రూ.200 జమ చేయాలి. మొత్తంగా ఏడాదికి రూ.1200 పెట్టుబడి పెడతారు. వీరికి 60 ఏళ్లు వచ్చాక నెలకు రూ.3000 చొప్పున ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36,000 పింఛను లభిస్తుంది. ఇద్దరికీ కలిపి రూ.72,000 వస్తుందన్నమాట.
Also Read: పీవీ సింధుకు గోల్డ్! ప్రత్యర్థిని ఉరుకులు పెట్టించిన తెలుగుతేజం