LIC Jeevan Akshay Policy: ఉద్యోగ జీవితం సాగినంత కాలం జీవన ప్రయాణానికి భరోసా ఉంటుంది. ప్రతి నెలా బ్యాంక్‌ ఖాతాలోకి కచ్చితంగా డబ్బులు వచ్చి పడతాయి. ఇంటి అవసరాలు, పిల్లల చదువుల వ్యయాలు, వ్యక్తిగత ఖర్చులు సహా అన్ని రకాల ఖర్చులను ఈజీగా దాటుకుంటూ వెళ్లవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత మాత్రం ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అవుతుంది. పిల్లల బాధ్యతలు తీరినా కుటుంబ ఖర్చులు మాత్రం తగ్గవు, పైగా పెరుగుతాయి. దీనికి తోడు అనారోగ్యాలు చుట్టుముట్టి మందుల ఖర్చులు కూడా నెలనెలా తడిసి మోపెడవుతుంటాయి. కాబట్టి, ఉద్యోగ విరమణ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం లేకపోతే ఈ రోజుల్లో కష్టం.


పదవీ విరమణ తర్వాత కూడా జీతం తరహాలోనే ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఆదాయం చేతిలోకి రావాలంటే, దానికి ఒక మంచి పెట్టుబడి పథకం ఉంది. మీరు ఉద్యోగి కాకపోయినా పర్లేదు, ఈ ప్లాన్‌ను మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. దివ్యాంగులు కూడా ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవచ్చు. 


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెన్షన్‌ ప్లాన్‌ (LIC Pension Plan) ఇది. ఈ ప్లాన్‌ పేరు ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్ పాలసీ (LIC Jeevan Akshay Policy). ఈ పథకాన్ని కొనడం వల్ల, మీరు ప్రతి నెలా దాదాపు 36 వేల రూపాయలు అందుకోవచ్చు. దీంతో మీ ఇంటి, వ్యక్తిగత ఖర్చులను సులభంగా భరించవచ్చు. ఎవరి పైనా ఆధారపడకుండా గౌరవంగా బతకవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా, తన ఖాతాదార్లు ప్రతి నెలా సంపాదించే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పిస్తోంది. దీనివల్ల జీవిత భద్రత, ఆర్థిక భద్రత రెండూ సాధ్యమవుతాయి.


ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ
జీవన్ అక్షయ్ పాలసీ పథకాన్ని LIC పునఃప్రారంభించింది. ఈ పాలసీ ప్రకారం మీరు ఒక్క వాయిదా మాత్రమే చెల్లించి, జీవితాంతం సంపాదించవచ్చు. సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్‌, యాన్యుటీ ప్లాన్ ఇది.


ఈ పాలసీలో, మీరు ప్రతి నెలా రూ. 36,000 పొందడానికి, యూనిఫాం రేటుతో జీవితాంతం చెల్లింపు యాన్యుటీ ఆప్షన్‌ తీసుకోవాలి. ఉదాహరణకు.. మీ వయస్సు 45 ఏళ్ల సంవత్సరాల ఉండి ఈ ప్లాన్‌ని తీసుకోవాలి అనుకుంటే.. రూ. 70 లక్షల సమ్‌ అస్యూర్డ్‌ ఆప్షన్‌ ఎంచుకోండి. ఇందులో 71,26,000 రూపాయల సింగిల్‌ పేమెంట్‌ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెలా రూ. 36,429 పెన్షన్ వస్తుంది. అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోతే, పింఛను ఆగిపోతుంది.


ఏ వయస్సుల వారికి?
35 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వయస్సు గల వారు ఈ LIC ప్లాన్‌ని తీసుకోవచ్చు. 


ఏడాది నుంచి నెల వరకు ఆప్షన్లు
వివిధ మార్గాల్లో పెన్షన్ పొందే ఆప్షన్లు ఈ పాలసీలో ఉన్నాయి. ఏడాది పింఛను మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా నెలనెలా పింఛను పొందే ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు 75 ఏళ్లు ఉండి, ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే... మీరు రూ. 6,10,800 ఏకమొత్తం ప్రీమియం చెల్లించాలి. దీనిపై సమ్‌ అస్యూర్డ్‌ ఆప్షన్‌ రూ. 6 లక్షలు. ఇందులో.. ఏడాది పింఛను రూ. 76,650, అర్ధ వార్షిక పింఛను రూ. 37,035, త్రైమాసిక (3 నెలలు) పింఛను రూ. 18,225. నెలవారీ పింఛను 6 వేల రూపాయలు మీకు అందుతుంది. 


తక్కువ పెట్టుబడి ఎంపిక
తక్కువ పెట్టుబడితో ఏటా రూ. 12,000 పింఛను కూడా ఈ పాలసీలో లభిస్తుంది. కేవలం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సంపాదించవచ్చు. 1 లక్ష రూపాయల పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 12000 రూపాయలు పొందుతారు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే, ఇతర ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.