LIC Jeevan Dhara II Policy Details: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ, సోమవారం (22 జనవరి 2024) నుంచి కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇది, హామీతో కూడిన యాన్యుటీ ప్లాన్‌ (annuity plan). అంటే, ఏటా నిర్దిష్ట మొత్తం కచ్చితంగా చేతికి వస్తుంది. దీనికి, ఎల్‌ఐసీ జీవన్ ధార II అని పేరు పెట్టారు.


ఎల్‌ఐసీ జీవన్ ధార II పాలసీ ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిటింగ్, ఇండివిడ్యువల్‌, సేవింగ్‌, డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్. దీనిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.


పాలసీ తీసుకున్న మొదటి రోజునే గ్యారెంటీడ్‌ యాన్యుటీ రేట్స్‌ చెబుతారు. ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ ప్రకారం, జీవితకాలం మొత్తం వాయిదాల రూపంలో ఆ యాన్యుటీలను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది.


ఈ యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు. ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్‌ను బట్టి గరిష్ట వయస్సును నిర్ణయిస్తారు. ఈ గరిష్ట వయో పరిమితి... 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు మైనస్ వేచివుండే కాలం.


ప్రీమియం చెల్లింపు కాలం, వేచి ఉండాల్సిన వ్యవధి ‍(deferment period)‌, యాన్యుటీ ఆప్షన్‌, యాన్యుటీ చెల్లింపు విధానాన్ని ఎంచుకునే అవకాశం పాలసీదారుకు ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: మీ పాప భవిష్యత్‌ కోసం 10 ఉత్తమ పెట్టుబడి మార్గాలు, మీ ప్రేమను ఈ రూపంలో చూపండి


ముఖ్యమైన విషయాలు (Important points in LIC Jeevan Dhara II Policy): 


- పాలసీ ప్రీమియాన్ని వాయిదాల రూపంలో ‍‌(Regular Premium) లేదా ఏకమొత్తంగా ఒకేసారి (Single Premium) చెల్లించవచ్చు.       


- సింగిల్‌ లైఫ్ యాన్యుటీ తీసుకోవచ్చు. లేదా, జాయింట్ లైఫ్ యాన్యుటీ తీసుకోవచ్చు. సొంత కుటుంబానికి చెందిన జీవిత భాగస్వామి, తోబుట్టువులు, తాత, తల్లిదండ్రులు, పిల్లలు, మనుమలు, అత్తమామలు మధ్య తీసుకోవచ్చు.          


- 1వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు డిఫర్‌మెంట్‌ పిరియడ్‌ ఉంటుంది. మీకు ఎప్పటి నుంచి యాన్యుటీ చెల్లింపులు అవసరమో దీనిని బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు.      


- నెలనెలా, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 12 నెలలకు ఒకేసారి చొప్పున యాన్యుటీ పేమెంట్‌ ఆప్షన్స్‌ పెట్టుకోవచ్చు.        


- ఒకసారి ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్‌ను ఇక మార్చలేరు      


- ఈ ప్లాన్‌లో 11 యాన్యుటీ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు అనువైన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.


- ఎల్‌ఐసీ జీవన్ ధార II పాలసీ మొదటి ప్రీమియం కట్టిన వెంటనే బీమా రక్షణ ప్రారంభం అవుతుంది. 


- ఈ ప్లాన్‌లో, టాప్-అప్ యాన్యుటీ (Top-up Annuity) ద్వారా యాన్యుటీని పెంచుకునే అవకాశం ఉంది. పాలసీ అమలులో ఉన్న కాలంలో, అదనపు ప్రీమియాన్ని కూడా కలిపి ఒకే ప్రీమియంగా చెల్లించడం ద్వారా టాప్-యాన్యుటీని ఎంచుకోవచ్చు.


- ప్రీమియంలు కడుతున్న సమయంలోనైనా, ఆ తర్వాతైనా ఈ పాలసీ మీద లోన్‌ తీసుకోవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: Budget 2024: టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు?