How To Calculate Your Personal Loan EMI: అర్హులైన వ్యక్తులకు బ్యాంక్‌ వ్యక్తిగత రుణాలు వేగంగా లభిస్తాయి, వివిధ అవసరాల సందర్బాల్లో ఆదుకుంటాయి. పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ముందు, EMI (Equated Monthly Instalment) గురించి తెలుసుకోవాలి, ఇది మీ ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. లోన్‌ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. 

ప్రస్తుతం, ఆన్‌లైన్‌లో చాలా పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌లు అందుబాటులో ఉన్నాయి. రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితిని మీరు ఎంటర్‌ చేస్తే, మీరు నెలకు ఎంత EMI కట్టాలో అది చూపిస్తుంది. 

EMI ఎలా పని చేస్తుంది?తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి క్రమం తప్పకుండా చెల్లించే స్థిరమైన మొత్తం EMI. ఇందులో అసలుతో పాటు వడ్డీ కూడా కలిసి ఉంటుంది. లోన్‌ రీపేమెంట్‌ ప్రారంభమైన తొలి నెలల్లో, EMIలో వడ్డీ భాగం ఎక్కువగా ఉంటుంది, క్రమంగా తగ్గుతుంది. కాలం గడిచేకొద్దీ EMIలో వడ్డీ మొత్తం తగ్గి ఆ స్థానంలో అసలు మొత్తం జమ అవుతుంది. EMI మొత్తాన్ని రుణ మొత్తం, వడ్డీ రేటు, కాల పరిమితి ఆధారంగా నిర్ణయిస్తారు. రుణ నిబంధనలు మారకపోతే EMI స్థిరంగా ఉంటుంది.

వ్యక్తిగత రుణం కోసం EMIని ఈ సూత్రం ఆధారంగా లెక్కిస్తారు:

EMI = Pxrx(1+r)^n(1+r)^n-1 

ఈ ఫార్ములాలో...

P = రుణం అసలు (అరువుగా తీసుకున్న మొత్తం)r = నెలవారీ వడ్డీ రేటు (వార్షిక వడ్డీ రేటు ÷ 12 ÷ 100)n = రుణ కాలపరిమితి (నెలల్లో)

EMIలను నెలవారీగా చెల్లిస్తారు కాబట్టి, కాల పరిమితిని నెలల్లో లెక్కిస్తారు.

ఉదాహరణకు...

మీరు 2 సంవత్సరాలు (24 నెలలు) కోసం 15 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే:

EMI =500000 x (15/100/12) x (1+15/100/12)^24(1+15/100/12)^24-1

సుమారుగా EMI నెలకు రూ. 24,243 అవుతుంది.

ఆన్‌లైన్‌ EMI కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?ఈ గందరగోళమంతా లేకుండా, ఇప్పుడు, చాలా బ్యాంక్‌లు & ఆర్థిక సంస్థలు ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్‌ కాలుక్యులేటర్‌ను అందిస్తున్నాయి. మీరు ఈ విధంగా లెక్కలు వేసి గజిబిజి పడకుండా, ఎంచక్కా ఆన్‌లైన్‌ కాలుక్యులేటర్‌తో సెకన్ల వ్యవధిలో EMIని లెక్కించవచ్చు. దీనికోసం...

ఏదైనా బ్యాంక్ లేదా NBFC వెబ్‌సైట్‌ను సందర్శించి, EMI కాలిక్యులేటర్ విభాగంలోకి వెళ్లండి.లేదా, గూగుల్‌లో పర్సనల్‌ లోన్‌ EMI కాలుక్యులేటర్‌ అని టైప్‌ చేసినా వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి. ఒక కాలుక్యులేటర్‌ ఎంచుకున్నాక లోన్ మొత్తం, వడ్డీ రేటు, కాల పరిమితిని నమోదు చేయండి.కాలిక్యులేటర్ మీ EMI మొత్తం, చెల్లించవలసిన మొత్తం, వడ్డీ విభజనను తక్షణమే చూపిస్తుంది.ఇక్కడ మీరు వివిధ మొత్తాలను ఎంటర్‌ చేస్తే, దానికి అనుగుణంగా EMI మారుతుంది. తద్వారా, మీ ఆర్థిక పరిస్థితులకు సరిపోయేదానిని ఎంచుకోవచ్చు.

ఆన్‌లైన్‌ పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌ను ఎందుకు ఉపయోగించాలి?ఫార్ములా లేదా ఎక్సెల్‌ను ఉపయోగించి EMIని మాన్యువల్‌గా లెక్కించడం గందరగోళంగా ఉండడమే కాదు, చాలా సమయం తీసుకుంటుంది. మీరు పొరపాటున ఒక్క అంకె తేడాగా వేసినా, లెక్క మొత్తం మారుతుంది, మీ ఫైనాన్షియల్‌ ప్లాన్‌ దెబ్బతింటుంది. ఆన్‌లైన్ EMI కాలిక్యులేటర్‌లో ఈ లోపాలు ఉండవు. మీ EMI, వడ్డీ, మొత్తం లోన్ మొత్తాన్ని ఒక్క సెకనులో లెక్కించి, మీ ముందు ఉంచుతుంది. అంతేకాదు, మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి సులభమైన గ్రాఫ్‌లు, చార్ట్‌లను కూడా ప్రదర్శిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: '1996 పీడకల' రిపీట్‌ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్‌ మార్కెట్‌లో ఒకటే టెన్షన్‌