Advantages and Disadvantages Of A Home Loan Co Applicant: ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ప్రజలు డబ్బు ఆదా చేస్తారు. కానీ, చాలా మంది అంత డబ్బును కూడబెట్టలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో, సొంతింటి కోసం బ్యాంక్‌ లేదా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి గృహ రుణం (Home Loan) తీసుకుంటారు. హౌమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు, ఎక్కువ మంది సింగిల్‌గానే రుణం తీసుకుంటారు. కొంతమంది తమతో పాటు సహ దరఖాస్తుదారుని (Home Loan Co Applicant) కూడా కలుపుకుంటారు. 


బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో కో-అప్లికెంట్‌తో కలిసి లోన్‌ కోసం దరఖాస్తు చేసినప్పుడు, తీసుకున్న రుణానికి ప్రధాన దరఖాస్తుదారు, సహ-దరఖాస్తుదారు ఇద్దరూ సంయుక్తంగా బాధ్యత వహిస్తారు. మీ హోమ్ లోన్‌లో కో-అప్లికెంట్‌ ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?, లాభనష్టాలేంటి?.


కో-అప్లికెంట్‌ ఎవరు కావచ్చు?


సహ-దరఖాస్తుదారు విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల మార్గదర్శకాల్లో చిన్నపాటి మార్పులు ఉంటాయి. సహ-దరఖాస్తుదారుడిగా ఎవరిని చేర్చుకోవాలన్నది ప్రధాన దరఖాస్తుదారుడి ఇష్టం. భార్య లేదా భర్త కో-అప్లికెంట్‌గా మారొచ్చు. తండ్రి-కొడుకు, తండ్రి-పెళ్లి కాని కుమార్తె కూడా కలిసి లోన్‌ కోసం అప్లై చేయొచ్చు. తోబుట్టువులు కూడా సహ దరఖాస్తుదారులు కావచ్చు. అయితే, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి (మైనర్‌) మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కో-అప్లికెంట్‌ కాలేడు.


కో-అప్లికెంట్‌ వల్ల ప్రయోజనాలు


రుణం పొందే అవకాశాలు పెరుగుతాయి: సహ-దరఖాస్తుదారుతో కలిసి లోన్ కోసం అప్లై చేస్తే మీకు రుణం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే, రుణం ఇచ్చే బ్యాంకు లేదా కంపెనీ మీ మీతో పాటు మీ సహ-దరఖాస్తుదారుడి ఆదాయాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇద్దరి ఆదాయాల వల్ల మీరు అధిక రుణం కూడా పొందొచ్చు.


క్రెడిట్ స్కోర్‌ వల్ల ప్రయోజనం: దాదాపు అన్ని బ్యాంకులు, రుణ సంస్థలు హోమ్‌ లోన్‌ ఇచ్చే సమయంలో మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. మీకు సంతృప్తికరమైన క్రెడిట్‌ స్కోర్‌ లేకపోయినప్పటికీ, మీ సహ-దరఖాస్తుదారుకి మంచి క్రెడిట్ స్కోర్‌ ఉంటే చాలు. కో-అప్లికెంట్‌ క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి.


ఆర్థిక భారం సగానికి సగం తగ్గుతుంది: హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కో-అప్లికెంట్‌ ఉండటం వల్ల మీపై పెద్దగా ఆర్థిక భారం ఉండదు. EMI మొత్తాన్ని ఇద్దరూ పంచుకోవడం వల్ల ఆర్థిక భారం సగానికి తగ్గుతుంది. రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బంది ఉండదు.


పన్ను ఆదా: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, గృహ రుణం తీసుకునే దరఖాస్తుదారు & సహ దరఖాస్తుదారు కూడా పన్ను మినహాయింపుకు అర్హులు. సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనితో పాటు, సెక్షన్ 24 (B) కింద మరో రూ. 2 లక్షల వరకు అదనపు మినహాయింపు లభిస్తుంది.


మహిళా దరఖాస్తుదారుకు మినహాయింపు: రుణం తీసుకునేటప్పుడు మీతో పాటు మహిళా దరఖాస్తుదారు ఉంటే, సాధారణం కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. చాలా బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు మహిళలకు రాయితీలు ఇస్తాయి. ఆ రాయితీ ప్రయోజనం మీకు కూడా వర్తిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలంలో చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు.


రుణ కాల పరిమితి: మీతో రుణం తీసుకునే సహ-దరఖాస్తుదారు యువతి/యువకుడైతే మీ లోన్ కాల పరిమితి పెరుగుతుంది. ఫలితంగా మీ EMI మొత్తం తగ్గుతుంది. అయితే, కాల పరిమితి పెరిగితే రుణంపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.


కో-అప్లికెంట్‌ వల్ల నష్టాలు


హోమ్‌ లోన్‌ కో-అప్లికెంట్‌ వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి రుణం తీసుకుంటే.. ఆ రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఇద్దరిపైనా ఉంటుంది. హోమ్‌ లోన్‌ EMIని చెల్లించడం మిస్‌ అయితే, అప్పుడు ఇద్దరి క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుంది. సరైన వ్యక్తిని సహ-దరఖాస్తుదారుగా చేర్చుకోకుంటే అనవసర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి, కో-అప్లికెంట్‌ను ఎంచుకునేటప్పుడు ముందుచూపుతో ఆలోచించాలి.


మరో ఆసక్తికర కథనం: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పు, బెనిఫిట్స్‌ కట్‌ - ఇన్ని ప్రయోజనాలు తగ్గాయి