Income Tax Return Filing 2024: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ చేసి, దానిని వెరిఫై (ITR verify) చేయడంతో కథ ముగిసిపోదు. దాఖలు చేసిన ITRను ఆదాయ పన్ను విభాగం ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ ప్రాసెసింగ్ ప్రక్రియలో, కొంతమందికి ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ అందుతుంది.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్లకు ఇంటిమేషన్ నోటీస్ వస్తుంది. రిజిస్టర్డ్ ఇ-మెయిల్ అడ్రస్‌కు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఈ సమాచారం అందుతుంది. ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి నోటీస్ వచ్చినా తప్పకుండా చదవాలి. మీ ఐటీఆర్‌లో మీ ఆదాయ పన్ను లెక్కింపు పన్ను విభాగం దగ్గర ఉన్న సమాచారానికి అనుగుణంగా మీ ఐటీఆర్‌లోని లెక్కలు లేకపోతే, ఆ విషయాన్ని ఐటీ నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారు, కాబట్టి ఇది చాలా కీలకం.
ఏ సందర్భాల్లో సెక్షన్ 143 (1) కింద నోటీస్ వస్తుంది?
- రిఫండ్ విషయంలో ఆదాయ పన్ను విభాగం కొన్ని మార్పులు చేసిప్పుడు
- అదనపు పన్ను లేదా వడ్డీ చెల్లించాల్సి వచ్చినప్పుడు.
- రిటర్న్ ప్రాసెస్ పూర్తయినప్పటికీ రిఫండ్ కోసం అభ్యర్థన పెట్టుకోనప్పుడు
సెక్షన్ 143(1) కింద ఇన్‌టిమేషన్ నోటీస్ ఏం చెబుతుంది?
- టాక్స్ పేయర్ ఆదాయ వివరాలు, క్లెయిమ్ చేసిన డిడక్షన్లు, పన్ను లెక్కలు అన్నీ ఐటీ విభాగం దగ్గర ఉన్న సమాచారంతో సరిపోయింది. కాబట్టి, అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సెక్షన్ 143(1) కింద వచ్చే నోటీస్ చెబుతుంది. అలాగే, చెల్లించాల్సిన పన్ను, రిఫండ్ రెండూ '0'గా మారతాయి.
- ఒక వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్‌లో ఏదైనా ఆదాయాన్ని నివేదించకపోవడం లేదా డిడక్షన్‌ను తప్పుగా క్లెయిమ్ చేయడం లేదా పన్నును తప్పుగా లెక్కించడం వంటివి ఈ నోటీస్ చూపుతుంది. ఇలాంటి కేస్‌ల్లో సదరు వ్యక్తులు మరికొంత పన్ను చెల్లించాల్సి వస్తుంది.
- ఆదాయ పన్ను విభాగం అంచనా ప్రకారం ఒక వ్యక్తి తన వాస్తవ పన్ను బాధ్యత కంటే అదనంగా చెల్లించినప్పుడు రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోమని సెక్షన్ 143(1) వివరిస్తుంది.
సెక్షన్ 143(1) నోటీస్ తెరవడానికి పాస్‌వర్డ్
ఇన్టిమేషన్ నోటీస్ ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఉండాలి. మీ పాన్‌తో (PAN) పాటు మీ పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఉపయోగించాలి. ఉదాహరణకు, మీ పాన్ AAAAA0000A, మీ పుట్టిన తేదీ 01 ఏప్రిల్ 1990 అయితే.. నోటీస్ తెరవడానికి పాస్‌వర్డ్ aaaaa000a01041990 అవుతుంది. పాస్‌వర్డ్‌లోని ఇంగ్లీష్ అక్షరాన్నీ స్మాల్ కేస్‌లో ఉండాలి.
ఇన్‌టిమేషన్ నోటీస్‌లో తొలుత మీ వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత, మీ ITRలో మీరు అందించిన ఆదాయ పన్ను వివరాలను డిపార్ట్‌మెంట్ దగ్గరున్న సమాచారంతో పోల్చడం జరుగుతుంది. ఐటీఆర్‌లో ప్రతి కేటగిరీ కింద టాక్స్ పేయర్ నివేదించిన ఆదాయాన్ని, ఆదాయ పన్ను విభాగం లెక్కించిన ఆదాయంతో పోల్చే పట్టికను ఇంటిమేషన్ నోటీస్ అందిస్తుంది. ఈ రెండు వివరాలను జాగ్రత్తగా పోల్చుకోవాలి. నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై వర్తించే పన్ను బాధ్యత, వర్తించే పన్ను మినహాయింపు, సెక్షన్ 234A, 234B, 234C కింద వడ్డీ, సెక్షన్ 234F కింద లేట్ ఫీజ్, మొత్తం ఆదాయ పన్ను బాధ్యత వంటివి కూడా ఇన్‌టిమేషన్ నోటీస్‌లో కనిపిస్తాయి.
సెక్షన్ 143 (1) టాక్స్ నోటీస్‌కు ఎలా స్పందించాలి?
స్టెప్ 1 - ఐటీ డిపార్ట్‌మెంట్ చేసిన సర్దుబాట్ల స్వభావాన్ని, నోటీస్‌లో సూచించిన కారణాలను అర్థం చేసుకోవాలి.
స్టెప్ 2 - మీరు ఇప్పటికే సమర్పించిన సమాచారానికి తగిన వివరణలు, రుజువు పత్రాలు లేదా దిద్దుబాట్లను అందించేలా సిద్ధం కావాలి.
స్టెప్ 3 - ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో, లేదా ఐటీ కార్యాలయానికి వెళ్లి మీ ప్రతిస్పందనను (response) నిర్దిష్ట సమయంలోగా సమర్పించాలి.
స్టెప్ 4 - మీరు సమర్పించిన ప్రతిస్పందన కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
ఒకవేళ మీకు రిఫండ్ బకాయి ఉంటే, ఆ మొత్తాన్ని ఇన్‌టిమేషన్ నోటీస్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్ చూపుతుంది. దాని గురించి SMS మాత్రం పంపదని గుర్తుంచుకోండి. కాబట్టి, రిఫండ్ క్లెయిమ్ చేసుకోమని మీకు ఎలాంటి SMS వచ్చినా, అది మోసగాళ్లు విసిరిన వల అని అర్ధం చేసుకోండి, ఎలాంటి లింక్‌లపైనా క్లిక్ చేయకండి.
మరో ఆసక్తికర కథనం: నేల చూపుల్లో చమురు రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి