Tax Saving Tips For ITR 2024: మార్చి నెల ముగింపునకు వస్తోంది. ఏప్రిల్ నుంచి ఆదాయ పన్ను పత్రాలను సమర్పించే సీజన్ ప్రారంభమవుతుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడుల ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే, దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవడానికి ఇంకా ఇంకొన్ని రోజుల సమయం మిగిలే ఉంది.
ఎక్కువ కేసుల్లో, చివరి క్షణంలో పన్ను ప్రణాళిక చేస్తున్నప్పుడు పన్ను చెల్లింపుదార్లు కొన్ని తప్పులు చేస్తున్నారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా తర్వాతి కాలంలో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా టాక్స్ సేవింగ్ ప్లాన్‌లో ఉంటే, అందుకోసం మార్గాలు వెదుకుతుంటే, ఈ తప్పులు మాత్రం చేయకండి.
పన్ను ఆదా చేసే పెట్టుబడుల విషయంలో ఎక్కువగా జరుగుతున్న తప్పులు:
1. అవసరానికి తగ్గట్లుగా లేని పెట్టుబడులు
పన్ను చెల్లింపుదార్లు చివరి నిమిషంలో హడావిడి నిర్ణయం తీసుకోవడం వల్ల, పన్ను ఆదా కోసం సరైన పథకాలు ఎంచుకోవడం లేదు. దీర్ఘకాలంలో భారీ ప్రయోజనాలు పొందాలనుకుంటే PPF ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. NPS ద్వారా మీ పదవీ విరమణను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పథకాలన్నింటినీ ఎంచుకునే సమయంలో, మీ అవసరాలను కచ్చితంగా గుర్తించడం ముఖ్యం.
2. అవసరం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం
పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్ చేయడానికి, మీకు అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. ఉదాహరణకు, మీరు గృహ రుణం తీసుకున్నట్లయితే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, అసలుపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద అసలు మొత్తంపై రాయితీ లభిస్తుంది. మీక్కూడా హోమ్ లోన్ ఉంటే, PPF వంటి పథకాల్లో మీ అవసరానికి మించి పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకంటే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద గరిష్ట మినహాయింపు పరిమితి రూ. 1.50 లక్షలు మాత్రమే.
3. పెట్టుబడుల్లో వైవిధ్యం లేదు
చాలా మంది టాక్స్ పేయర్లు పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు తమ పెట్టుబడుల్లో వైవిధ్యం (Diversity) చూపడం లేదు. పండ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టినట్లుగా, ఒకే రకమైన పెట్టుబడులతో మూసధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల తర్వాతి కాలంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అవసరాన్ని బట్టి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, దీర్ఘకాలికంగా PPF వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అదే సమయంలో, మంచి రాబడి కోసం ELSS ఫండ్స్ వంటి వాటిని కూడా ఎంపిక చేసుకోవచ్చు.
4. సరైన ఆర్థిక ప్రణాళిక కరవు
చివరి క్షణంలో పన్ను ఆదా చేసేటప్పుడు సరైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం లేదు. ఇది కూడా భవిష్యత్‌లో ఆర్థిక బాధలకు కారణమవుతుంది. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు, భవిష్యత్తు రాబడి + ఇతర ప్రయోజనాలను సరిగ్గా పరిశోధించిన తర్వాత మాత్రమే పెట్టుబడిని ప్లాన్ చేయాలి.
5. అన్ని తగ్గింపుల గురించి తెలీకపోవడం
పాత పన్ను విధానం ప్రకారం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల మినహాయింపులు కాకుండా ఇతర పన్ను మినహాయింపుల ప్రయోజనాలను కూడా పొందొచ్చు. NPSలో పెట్టుబడి పెట్టడంపై సెక్షన్ 80CCD(1B) కింద అదనంగా రూ.50,000 మినహాయింపు లభిస్తుంది. గృహ రుణంపై వడ్డీ, ఆరోగ్య బీమా తీసుకోవడం మొదలైన వాటిపైనా పన్ను మినహాయింపులు ఉంటాయి. పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు, ఇలాంటి తగ్గింపుల గురించి తెలుసుకోవడం మర్చిపోవద్దు.
మరో ఆసక్తికర కథనం: గం జీతంతో సరిపెట్టుకున్న అజీమ్ ప్రేమ్‌జీ వారసుడు, కారణమేంటో తెలుసా?