Tips To Get A Home Loan: ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఇల్లు కొనలేని వ్యక్తుల సొంతింటి కలను హోమ్ లోన్/ హౌసింగ్ లోన్ నెరవేరుస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, నచ్చిన ఇంటిని సొంతం చేసుకోవడానికి గృహ రుణం తీసుకుంటున్నారు. లోన్ ఇచ్చే ముందు బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆ కస్టమర్ రుణ చరిత్ర లేదా క్రెడిట్ స్కోర్‌ను (Credit Score) ఖచ్చితంగా తనిఖీ చేస్తాయి.
సిబిల్‌తో పాటు ఈక్విఫాక్స్ (Equifax), ఎక్స్‌పీరియన్ (Experian), క్రిఫ్ హై మార్క్ (CRIF High Mark) వంటి సంస్థలు మన దేశంలో క్రెడిట్ రిపోర్ట్ ఇస్తున్నా, కేవలం సిబిల్ స్కోర్‌ను (CIBIL Score) మాత్రమే బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోర్ 700 దాటిన వాళ్లకు సులభంగా రుణం దొరుకుతోంది. ఒకవేళ సిబిల్ స్కోర్ 740 దాటితే తక్కువ వడ్డీ రేటుకు హౌమ్ లోన్ పొందొచ్చు. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువ ఉంటే మాత్రం గృహ రుణం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి కేస్‌ల్లో చాలా ఎక్కువ వడ్డీని బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు దండుకుంటాయి.
ఒకవేళ మీరు కూడా గృహ రుణం తీసుకోవాలనుకుంటే, మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు, బ్యాంక్‌ల తీరు మీకు ఇబ్బంది కలిగిస్తుంది, అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని ఉపాయాలను అనుసరిస్తే, తక్కువ సిబిల్ స్కోర్‌తో కూడా హోమ్ లోన్ పొందవచ్చు.
హోమ్ లోన్ టిప్స్
- తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా గృహ రుణం పొందాలనుకుంటే, చాలా సులభమైన ఉపాయం.. లోన్ గ్యారెంటర్ సాయం తీసుకోవడం. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తి మీతో కలిసి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేస్తారు. అతన్ని కో అప్లికాంట్ లేదా లోన్ గ్యారెంటర్‌గా పిలుస్తారు. అతని సిబిల్ స్కోర్ మీద మీకు హోమ్ లోన్ మంజూరవుతుంది, మీ సిబిల్ స్కోర్ గురించి బ్యాంక్ పట్టించుకోదు. కో అప్లికాంట్ లేదా లోన్ గ్యారెంటర్ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే, మీకు అంత తక్కువ వడ్డీ రేటుకు రుణం దొరుకుతుంది. లోన్ మీ పేరిటే జారీ అవుతుంది, EMI మీరే చెల్లించాలి. మీరు చెల్లించలేని పరిస్థితుల్లో మాత్రమే కో అప్లికాంట్ లేదా లోన్ గ్యారెంటర్ చెల్లించాల్సి వస్తుంది.
- మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే, సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించడానికి మీరు సిద్ధమైతే, మీకు రుణం దొరుకుతుంది. తక్కువ సిబిల్ స్కోర్‌తో జారీ చేసే రుణాలను బ్యాంక్‌లు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రమాదకర రుణాలు పరిగణిస్తాయి. అధిక వడ్డీ రేట్ల ద్వారా ఆ నష్టాన్ని కవర్ చేసుకుంటాయి.
- ఒకవేళ, సాధారణ వ్యక్తుల కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్ల నుంచి ఎక్కువ డౌన్ పేమెంట్ తీసుకుంటాయి, రిస్కీ లోన్లను కవర్ చేసుకుంటాయి.
- సాధారణంగా, మంచి సిబిల్ స్కోర్ ఉన్న వినియోగదార్లకు మాత్రమే వాణిజ్య బ్యాంకులు గృహ రుణాలు ఇస్తుంటాయి. అయితే, చాలా NBFCలు తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు కూడా హోమ్ లోన్లను అందిస్తున్నాయి. వాటి గురించి ఎంక్వైరీ చేసి లోన్ తీసుకోవాలి.
గృహ రుణం కోసం దరఖాస్తు చేయబోతున్నట్లయితే, ముందుగా మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఇందు కోసం చిన్న మొత్తానికి పర్సనల్ లోన్ తీసుకుని ఒక్క EMI కూడా మిస్ కాకుండా కట్టేయండి. ఆరు నెలలు తిరిగే సరికి మీ సిబిల్ స్కోర్ మంచి స్థాయికి చేరుతుంది. అప్పుడు గృహ రుణం కోసం అప్లై చేస్తే తక్కువ వడ్డీ రేటుకే లోన్ దొరుకుతుంది.
మరో ఆసక్తికర కథనం: మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి