Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు ప్రస్తుతం రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. 1. కొత్త ఆదాయ పన్ను పద్ధతి (New Tax Regime), 2. పాత ఆదాయ పన్ను (Old Tax Regime). ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నది పన్ను చెల్లింపుదార్లను (Taxpayers) తికమకపెట్టే విషయం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మీ మొత్తం ఆదాయం ఎంత, క్లెయిమ్ చేసుకోదగిన వ్యయాలు/పెట్టుబడులను సరిగ్గా గుర్తిస్తే.. ఏ పన్ను విధానం ఎంచుకోవాలో సులభంగా నిర్ణయించుకోవచ్చు.
ఈ కేస్‌లో కొత్త పన్ను పద్ధతి బెటర్
గత ఆర్థిక సంవత్సరం 2023-24లో, కొత్త పన్ను విధానంలో 'ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి'ని (Income Tax Rebate) రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచిన భారత ప్రభుత్వం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లోనూ అదే పరిమితిని కొనసాగించింది. ఉద్యోగులకు మరో రూ. 50 వేలు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) రూపంలో యాడ్ అవుతుంది. దీంతో కలిపి, కొత్త పన్ను విధానంలో రూ. 7.50 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను తగ్గింపులు/ మినహాయింపు సెక్షన్లు కొత్త పన్ను పద్ధతికి వర్తించవు.
కొత్త పన్ను విధానంలో... మీ మొత్తం ఆదాయం రూ. 7.50 లక్షల కన్నా ఒక్క రూపాయి పెరిగినా... రూ. 3 లక్షల ఆదాయం నుంచి పన్ను శ్లాబ్‌లు వర్తిస్తాయి. మీ ఆదాయం ఏడున్నర లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉంటే కొత్త పన్ను విధానాన్ని పరిశీలించవచ్చు. మీ ఆదాయం ఎక్కువగా ఉండి, ఇంటి రుణం లేకపోతే.. కొత్త పన్ను విధానం ఎంచుకోవడం బెటర్ ఆప్షన్‌గా చెబుతున్నారు.
ఈ కేస్‌లో పాత పన్ను పద్ధతి బెటర్
పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ. 5 లక్షలు. స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మరో రూ. 50 వేలు కలుస్తుంది, మొత్తం రూ. 5.50 లక్షల ఆదాయం వరకు మినహాయింపు ఉంటుంది. పాత పన్ను విధానంలో.. సెక్షన్ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు చూపించుకోవచ్చు. సెక్షన్ 80D, సెక్షన్ 80E, గృహ రుణంపై వడ్డీ, HRA వంటివి కూడా క్లెయిమ్ చేసుకుని ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ పద్ధతిలో... అన్ని రకాల పన్ను తగ్గింపులు, మినహాయింపులు చూపిన తర్వాత కూడా మీ ఆదాయం రూ. 5.50 లక్షలు దాటితే, రూ. 2.5 లక్షల నుంచి పన్ను శ్లాబ్‌లు వర్తిస్తాయి.
ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందగల వ్యయాలు, పెట్టుబడులు మీకు ఉండి; అవి మీ మొత్తం ఆదాయంలో 30 శాతం వరకు ఉంటే.. మీరు పాత పన్ను పద్ధతిని ఫాలో కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, మీకు గృహ రుణం ఉంటే.. అదే పెద్ద మినహాయింపును అందిస్తుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు రూ.14 లక్షలకు మించని ఆదాయం ఉండి, పన్ను తగ్గించుకోగల వ్యయాలు/ పెట్టుబడులు దానిలో 30 శాతం తగ్గకుండా ఉంటే.. మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు. దీనివల్ల ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ITR ఫైల్ చేయవచ్చు. లేదా.. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ.14 లక్షలకు మించకుండా, పన్ను తగ్గించుకునే వ్యయాలు / పెట్టుబడుల మొత్తం కూడా రూ. 4.25 లక్షలకు మించకుండా ఉంటే... ఇలాంటి సందర్భంలోనూ పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు.
ప్రస్తుతం, ఐటీ పోర్టల్‌లో కొత్త పన్ను పద్ధతి డీఫాల్ట్‌గా కనిపిస్తుంటుంది. పాత పన్ను విధానం సూటవుతుందని మీరు భావిస్తే దానికి మారిపోవచ్చు. ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించేందుకు చివరి తేదీ జులై 31.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ను మించి సిల్వర్ షాక్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి