Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మీరు ఇప్పటికీ ఐటీఆర్‌ (ITR 2024) ఫైల్‌ చేయకపోతే, జరిమానా లేకుండా జులై 31, 2024 వరకు రిటర్న్‌ దాఖలు చేయవచ్చు.


మీ రిటర్న్‌ను మీరే ఫైల్ చేయాలనుకుంటే, ఇది కూడా పెద్ద కష్టం కాదు. ఐటీఆర్‌ ఎలా ఫైల్‌ చేయాలో చెప్పే వేలాది వీడియాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ ఐటీఆర్‌లో చాలా వివరాలు ప్రి-ఫిల్డ్‌ రూపంలో ముందుగానే నమోదై ఉంటాయి. రిటర్న్‌ దాఖలు చేసే ముందు, ప్రతి పన్ను చెల్లింపుదారు కొన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని రెడీ ఉంచుకోవాలి. దీనివల్ల, రిటర్న్‌లు దాఖలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఫారం-16 ‍‌(Form-16)
ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలుకు ఫామ్‌-16 చాలా ముఖ్యం. ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి అతని కంపెనీ ఫామ్‌-16 జారీ చేస్తుంది. దీని ద్వారా ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడం సులభంగా మారుతుంది. ఫామ్‌-16లో, పన్ను చెల్లింపుదారు స్థూల ఆదాయంతో పాటు, ఆదాయం నుంచి తీసేసిన తగ్గింపులు, నికర ఆదాయం, TDS వంటి వివరాల పూర్తి సమాచారం ఉంటుంది. ఐటీఆర్‌లో నింపాల్సిన ఎక్కువ వివరాలు ఫామ్‌-16లో ఉంటాయి.


హోమ్ లోన్ స్టేట్‌మెంట్ (Home Loan Statement)
మీరు ఏదైనా బ్యాంక్ లేదా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (NBFC) నుంచి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లోన్ స్టేట్‌మెంట్‌ను ఆ బ్యాంక్‌ నుంచి తీసుకోవడం మర్చిపోవద్దు. రుణంపై మీరు ఎంత వడ్డీ చెల్లించారో ఇది చెబుతుంది. ఆదాయ పన్ను సెక్షన్ 24(B) ప్రకారం గృహ రుణంపై చెల్లించే వడ్డీపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.


పెట్టుబడులకు రుజువు (Proofs For Investment)
పన్ను ఆదా కోసం.. ఆదాయ పన్ను సెక్షన్ 80C, 80CCC, 80CCD వంటి సెక్షన్ల పరిధిలోకి వచ్చే మార్గాల్లో పెట్టుబడులు పెడితే, ఆ పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ తీసి పెట్టుకోవాలి. పన్ను మినహాయింపును, రాయితీలను క్లెయిమ్ చేయడానికి ఆ డాక్యుమెంట్లు పనికొస్తాయి.


మూలధన లాభాల పత్రాలు (Capital Gain Papers)
మీరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లేదా స్థిరాస్తి వంటి ఆస్తి తరగతుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం సంపాదిస్తే, దానిని మూలధన లాభం అంటారు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు, క్యాపిటల్ గెయిన్స్ రూపంలో ఆర్జించిన లాభం గురించి కూడా సమాచారం ఇవ్వాలి.


ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ (Aadhar Card, PAN Card)
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఆధార్, పాన్ వివరాలు సరిచూసుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి, రిటర్న్ ఫైల్ చేసే ముందు ఈ రెండు పత్రాలను తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. దీంతో పాటు, మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే వాటి గురించి సమాచారాన్ని అందించడం కూడా ముఖ్యం.


శాలరీ స్లిప్ (Salary Slip)
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు, పన్ను చెల్లింపుదారు తన శాలరీ స్లిప్‌ను కూడా దగ్గర పెట్టుకోవాలి. శాలరీ స్లిప్‌లో, ఆ వ్యక్తి ఆదాయం. DA, HRA వంటి వాటి గురించిన సమాచారం ఉంటుంది.


మీరు మొదటిసారిగా ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేస్తుంటే, పైన చెప్పిన కీలక విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి మీరు కొత్త కాకపోయినప్పటికీ ఆ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీస్‌ వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: దేశంలో కోటికి పైగా ఖాళీ ఇళ్లు - అమ్మరు, అద్దెకు ఇవ్వరు!