Income Tax Return Filing 2024: క్రెడిట్ కార్డ్ ఖర్చులు మీ టాక్స్‌ లెక్కను సమూలంగా మార్చేస్తాయి. డిడక్షన్స్‌, రిబేట్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఆదాయ పన్ను పత్రాలు (ITR 2024) సమర్పించేటప్పుడు క్రెడిట్ కార్డ్ ఖర్చులను చాలా జాగ్రత్తగా యాడ్‌ చేయాలి.


స్టేట్‌మెంట్స్‌ దగ్గర పెట్టుకోండి
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ అన్ని క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను సేకరించండి. ఇప్పుడు అన్ని బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఫిజికల్‌ కాపీల నెలవారీ స్టేట్‌మెంట్‌లను అందిస్తున్నాయి. ఈ స్టేట్‌మెంట్స్‌లో పెద్ద కొనుగోళ్ల నుంచి చిన్నపాటి ఖర్చుల వరకు అన్ని లావాదేవీలు ఉంటాయి. కొన్ని ఖర్చులను మీరు మర్చిపోయినా ఈ స్టేట్‌మెంట్స్‌ గుర్తు చేస్తాయి.


క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే ఖర్చులు 
సాధారణంగా, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లు మీ ఖర్చులను వివిధ విభాగాలుగా వర్గీకరిస్తాయి. అంటే... ప్రయాణం & వసతి ‍(ప్రయాణ ఛార్జీలు, హోటల్ బుకింగ్స్‌ వంటివి), షాపింగ్ & డైనింగ్ ‍(రిటైల్ స్టోర్‌లు, రెస్టారెంట్‌లు వంటివి), యుటిలిటీస్‌, సబ్‌స్క్రిప్షన్స్‌, బిల్లుల చెల్లింపులు, విద్య & వైద్య ఖర్చులు, ట్యూషన్ ఫీజులు వంటివాటిని విడివిడిగా చూపుతాయి. వాటిని సరిగా లెక్కించి, ఐటీ రిటర్న్‌లో చూపించుకోవచ్చు.


క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించే కొన్ని చెల్లింపులను ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మినహాయింపులుగా క్లెయిమ్ చేయొచ్చు. ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80D కింద, పిల్లల చదువు కోసం ట్యూషన్ ఫీజ్‌ పేమెంట్స్‌ను సెక్షన్ 80C కింద మినహాయింపుగా చూపించుకోవచ్చు.


వ్యాపారం కోసం చేసే ప్రయాణ ఖర్చులు
మీరు ఏదైనా వ్యాపార సంస్థ యజమాని అయితే, వ్యాపార ప్రయాణానికి అయ్యే ఖర్చులను క్లెయిమ్ చేొవచ్చు. దీనికోసం... ప్రయాణ ఖర్చులకు సంబంధించిన రసీదులు లేదా ఇన్‌వాయిస్‌లు వంటి ప్రూఫ్‌లను మీ దగ్గర పెట్టుకోవాలి.


రూ.2 లక్షలు దాటితే...
మినహాయింపులు పొందడం మాత్రమే కాదు, ఎక్కువ విలువైన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలను తప్పనిసరిగా ఆదాయ పన్ను విభాగానికి చూపించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ క్రెడిట్ కార్డ్ వ్యయం రూ. 2 లక్షలు దాటితే, ఆ వివరాలు మీ ITRలో ఖచ్చితంగా రిపోర్ట్‌ చేయాలి. లేకపోతే ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీస్‌ వస్తుంది.


ముఖ్యమైన క్రెడిట్ కార్డ్ లావాదేవీలు లేదా కీలకమైన డిడక్షన్స్‌ ఉంటే, ఐటీఆర్‌ ఫైలింగ్ కోసం టాక్స్‌ ఎక్స్‌పర్ట్‌ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సాయం తీసుకోండి. తద్వారా, ఖచ్చితమైన సమాచారాన్ని మీ ఐటీఆర్‌లో చూపించగలుగుతారు, ఏ ఒక్క డిడక్షన్‌ మిస్‌ కాకుండా అన్ని రకాల తగ్గింపులు క్లెయిమ్‌ చేయడంలోనూ సాయం చేస్తారు.


ITR ఫైల్ చేస్తున్నప్పుడు, మీ ఆదాయ వనరులు & కేటగిరీ ఆధారంగా సరైన ఫారాన్ని ఎంచుకోవాలి. 


ITR-1 --- జీతం, ఒక ఇంటి ఆస్తి, ఇతర వనరుల ద్వారా ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం. 
ITR-2 --- వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం లేని వ్యక్తులు & హిందు అవిభాజ్య కుటుంబాల (HUF) కోసం. 
ITR-3 --- వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం కలిగిన వ్యక్తులు & HUFల కోసం. 


ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌లో క్రెడిట్‌ కార్డ్‌ ఖర్చులను చూపించడం వల్ల మీరు కొన్ని డిడక్షన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. లేదంటే ఆ ప్రయోజనాలన్నీ నష్టపోతారు.


మరో ఆసక్తికర కథనం: మీరూ రైల్వేస్టేషన్‌లో షాప్‌ పెట్టుకొని డబ్బులు సంపాదించవచ్చు- ఇలా అప్లై చేయండి