Income Tax Return Filing 2024: ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడ్‌/ ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. షేర్లు ‍‌(Share), మ్యూచువల్‌ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడులు పెడుతున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, సాధారణంగా, షేర్లు & మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి మంచి లాభాలు కళ్లజూడవచ్చు. 


మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబుడులు ఉండి, గత ఆర్థిక సంవత్సరంలో ‍‌(2023-24) వాటిని అమ్మడం ద్వారా లాభం (capital gains) సంపాదిస్తే, ఆ విషయాన్ని ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌లో (ITR 2024) రిపోర్ట్‌ చేయడం మాత్రం మరిచిపోవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను పత్రాల్లో వెల్లడించడం చాలా ముఖ్యం. నేను చెప్పకపోతే ఐటీ అధికార్లకు ఎలా తెలుస్తుంది, కొన్ని కోట్ల మందిలో నన్ను గుర్తు పెట్టుకుంటారా? అని మాత్రం అనుకోవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌ మీద ఒక వ్యక్తి సంపాదించే ఆదాయ వివరాలు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గరకు చేరతాయి. కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద సంపాదించిన రాబడిని మీరు వెల్లడించకపోయినా, ఒకవేళ పొరపాటున మరిచిపోయినా కూడా ఐటీ డిపార్ట్‌మెంట్‌కు సులభంగా దొరికిపోతారు. 


మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే లాభాల మీద ఎంత పన్ను చెల్లించాలన్న విషయం (Income Tax on Mutual Fund Profits) చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌ యూనిట్లను మీరు ఎంత కాలం పాటు కొనసాగించారు/ హోల్డ్‌ చేశారు అన్నది ఇక్కడ కీలకం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ సహా ఏ రకమైన మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్‌ చేసినా, అన్నింటిలో వచ్చే లాభాలపై పన్ను చెల్లించాలి.


ఎస్‌టీసీజీ - ఎల్‌టీసీజీ 
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం లోపులో అమ్మినపుడు లాభం వస్తే, అది స్వల్పకాలిక మూలధన లాభం (short term capital gain - STCG) కిందకు వస్తుంది. దీనిపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభం పన్ను చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత అమ్మినపుడు లాభం వస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభం అవుతుంది. దీనిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను (long term capital gains tax) చెల్లించాలి. 


రూ.లక్ష లోపుంటే వెసులుబాటు
ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక వ్యక్తికి వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభం లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటే, దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.1 లక్షకు పైబడిన లాభంపై, ఇండెక్సేషన్ బెనిఫిట్‌ లేకుండా 10% పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపితే 20% టాక్స్‌ కట్టాలి.


గత ఫైనాన్షియల్‌ ఇయర్‌లో మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మి లాభం సంపాదిస్తే, ఐటీఆర్‌ ఫైల్‌ చేసే సమయంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఫామ్‌ 16తో పాటు ఫామ్‌ 26AS, యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (AIS), టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (TIS), క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్‌ దగ్గర పెట్టుకోవాలి. ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యి ఈ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి కొన్న & అమ్మిన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువల పూర్తి సమాచారం AIS, TISలో ఉంటుంది. స్వల్పకాలిక/ దీర్ఘకాలిక మూలధన లాభం ఎంతో క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్‌ ద్వారా తెలుస్తుంది.


ఒకవేళ, గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి డివిడెండ్ పొందితే, దానిని కూడా ఐటీఆర్‌లో చూపాలి. ఇతర ఆదాయ వనరులు (Income From Other Sources) కింద దానిని రిపోర్ట్‌ చేయాలి.


మరో ఆసక్తికర కథనం: నగదు రూపంలో చెల్లిస్తున్నారా? ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌ తెలిస్తే ఇక ఆ పని చేయరు