Income Tax on House Sale: ఏ కారణం వల్లనైనా మీరు మీ పాత ఇంటి అమ్మకానికి పెట్టినా లేదా ఇప్పటికే అమ్మినా... ఆ ఇంటి ద్వారా వచ్చిన డబ్బు పన్ను పరిధిలోకి వస్తుందా, రాదా అన్నది తెలుసుకోవాలి. ఇంటి విక్రయం ద్వారా వచ్చిన మీరు పొందిన ఆదాయానికి పన్ను బాధ్యత (Tax liability) ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సందర్భాన్ని బట్టి అది మారుతుంది.


ఇంటిని విక్రయించడం ద్వారా వచ్చే లాభం మూలధన లాభంగా (Capital gain) పరిగణిస్తారు. దానిపై రెండు విధాలుగా పన్ను విధిస్తారు. మీరు ఒక ఇంటిని కట్టిన/కొన్న 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత విక్రయిస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభం (Long term capital gain - LTCG) కిందకు వస్తుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ (Indexation Benefit) తర్వాత క్యాపిటల్ గెయిన్ మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక ఇంటిని కట్టిన/కొన్న 24 నెలల లోపు అమ్మితే, దాని ద్వారా వచ్చే లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా (Short term capital gain - STCG) లెక్కిస్తారు. ఈ లాభం వ్యక్తగత ఆదాయానికి యాడ్‌ అవుతుంది. మీ ఆదాయానికి వర్తించే టాక్స్‌ స్లాబ్ ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి.


ఇలా చేస్తే పన్ను కట్టక్కర్లేదు 
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 (Section 54 of the Income Tax Act) ప్రకారం, పాత ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో మరో ఇంటిని కొనుగోలు చేస్తే, ఆ సందర్భంలో పన్ను బాధ్యత తప్పుతుంది. ఈ ప్రయోజనం దీర్ఘకాలిక మూలధన లాభం విషయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. విక్రేత లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, తనకు అనువైన మరొక ఇంటిని కొనడం అని అలాంటి సందర్భంలో చట్టం నమ్ముతుంది. కాబట్టి పన్ను నుంచి ఉపశమనం (Tax exemption) ఇస్తుంది.


ఎలాంటి ఆస్తిని కొంటే పన్ను మినహాయింపు లభిస్తుంది?
పాత ఇంటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని మరొక నివాస ఆస్తిని (Residential property) కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి మాత్రమే ఉపయోగించాలని సెక్షన్ 54 స్పష్టంగా చెబుతోంది. ఆ డబ్బుతో వాణిజ్యపరమైన ఆస్తిని కొంటే పన్ను మినహాయింపు లభించదని దీని అర్థం. 


ఒకవేళ మీరు నివాస భూమి అమ్మితే... ఆ లాభంతో వేరొక నివాస భూమి కొనుగోలు చేయడం లేదా ఇల్లు కట్టుకుంటే మూలధన లాభాల పన్నుకు సమానమైన మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. 


నివాస ఆస్తిని కొనడానికి ఎంత గడువు ఉంటుంది?
సెక్షన్ 54 ప్రకారం పన్ను మినహాయింపు పొందడానికి, పాత ఆస్తిని బదిలీ చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనాలి. కొత్త నిర్మాణం చేపడితే, మూడేళ్లలోపు ఇల్లు పూర్తి చేయాలి. పాత ఆస్తిని విక్రయించడానికి ఒక సంవత్సరం ముందు కొత్త ఇల్లు కొనుగోలు చేసినా టాక్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకంపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాన్ని మరో రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడి పెడితే సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు (Tax exemption) లభిస్తుంది. ఒక ప్రాపర్టీ లాభాల నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినా లేదా నిర్మించినా... ఒక ఆస్తిపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 


CGAS అకౌంట్‌లో జమ చేయాలి
మీరు ఇల్లు కొనాలనుకుంటే, ITR దాఖలు చేసిన తేదీ నాటికి మూలధన లాభం డబ్బును ఉపయోగించలేకపోతే, మీరు ఆ డబ్బును 'క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్' (CGAS) కింద బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అలా చేయకుంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ ఖాతాలో డబ్బు ఉంచినప్పటికీ...రెసిడెన్షియల్ ప్రాపర్టీని  రెండేళ్ల లోపు కొనాలి లేదా మూడేళ్ల లోపు కొత్త ఇల్లు నిర్మించాలి. ఈ గడువు దాటితే లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ చెల్లించాలి.


మరో ఆసక్తికర కథనం: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు