RBI WhatsApp : టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు వేషాలు మారుస్తున్నారు. కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. దీంతో ఏది ప్రాడో ఏది రియలో తెలుసుకోలేకపోతున్నాం. నేరుగా మీ కుటుంబ సభ్యులే వేరే నెంబర్‌తో ఫోన్ చేస్తే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి పని ఆన్‌లైన్ అయిపోయిన ఈ తరుణంలో వేసే అడుగు జాగ్రత్తగానే ఉండాలి. అలాగని ప్రతి అంశాన్ని అనుమానించడం కూడా కొన్నిసార్లు తప్పే అవుతుంది. అలాంటిదే ఇప్పుడు వాట్సాప్‌లో జరుగుతోంది.
బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని చాలా మందికి ఆర్బీఐ పేరుతో ఉన్న 9999041935 నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. చాలా మంది ఇది ఫేక్ అనుకొని లైట్ తీసుకుంటున్నారు. మరికొందరు బ్లాక్ చేస్తున్నారు. కానీ ఇది నిజంగానే ఆర్బీఐ నిర్వహిస్తున్న నెంబర్ ముఖ్యమైన సమాచారాన్ని ఖాతాదారులకు ప్రజలకు చేరే వేసేందుకు ఎప్పుడో ఈ వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో భాగంగానే ప్రజలకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తోంది.
పంపించిన మెసేజ్‌లో ఏముందంటే... "ముఖ్య గమనిక: మీ బ్యాంక్ మీ ఖాతాకు రీ-కేవైసీ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసిందా? మీ బ్యాంక్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచేందుకు దయచేసి మీ KYC ను అప్డేట్ చేయండి.📌 KYC ఎలా అప్డేట్ చేయాలి:👉 మీ సమీపంలోని బ్యాంక్ శాఖ లేదా గ్రామ పంచాయితీ క్యాంప్‌కి వెళ్లండి👉 ఆధార్ / ఓటర్ ID / డ్రైవింగ్ లైసెన్స్ / పాస్‌పోర్ట్ / NREGA జాబ్ కార్డ్ తీసుకెళ్లండి👉 వివరాలలో మార్పులు లేకపోతే → స్వీయ ప్రకటన (Self-declaration) సరిపోతుంది✅ ఈ ప్రచారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. "అని ఉంది. ఇంత చెప్పినా కూడా మాకు నమ్మకం లేదు దొర అంటే... వాట్సాప్ నోటిఫికేషన్ ఆపేసేందుకు ఆ మేసేజ్‌లోనే STOP అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంచుకుంటే చాలు మీకు భవిష్యత్‌లో ఆ నెంబర్ నుంచి మెసేజ్‌లు రానేరావు.
ఆర్బీఐకి వాట్సాప్ ఛానల్ ఉంది తెలుసా?
ప్రజలకు ఆర్థిక సమాచారాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక WhatsApp ఛానెల్‌ను ఎప్పుడో ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల్లో ఖాతాదారులకు ముఖ్యమైన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ అప్‌డేట్స్ సులభంగా అందించేందుకు ఈ చొరవ తీసుకుంది.
కొత్త WhatsApp ఛానెల్ 'RBI కెహ్‌తా హై' (RBI చెబుతోంది) అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ఇప్పటికే SMS, టెలివిజన్ ప్రకటనలు, వార్తాపత్రికలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు చేరే వేస్తోంది. ఇప్పుడు మీకు వస్తున్న మెసేజ్‌లు కూడా అలాంటివే.
బ్యాంకింగ్, డిజిటల్ భద్రత, ఇతర ముఖ్యమైన అంశాల గురించి అధికారిక సమాచారాన్ని సరైన టైంలో వినియోగదారులకు నేరుగా అందించడం కోసమే WhatsApp ఛానల్ లాంఛ్ చేసింది. తరచుగా నకిలీ వార్తలు, సైబర్ మోసాలు పెరుగుతున్న వేళ ఇది కచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని ఆర్బీఐ భావించింది. అధికారిక సమాచారాన్ని నేరుగా పంచుకోవడంతో గందరగోళం తగ్గుతుందని ప్రజల విశ్వాసం పెరుగుతుందని RBI ఆశిస్తోంది.