Surrender Rules For Insurance Policy: మన దేశంలో కోట్ల మందికి బీమా పాలసీలు ఉన్నాయి. దీర్ఘకాలం పాటు ప్రీమియం కట్టలేక, పాలసీ వ్యవధి మధ్యలోనే పాలసీని రద్దు చేసుకునే (Surrender) వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సందర్భంలో, అప్పటి వరకు పాలసీదారు కట్టిన డబ్బు పరిస్థితేంటి?. సదరు బీమా కంపెనీ.. సరెండర్‌ ఖర్చులు, ఛార్జీలు, టాక్స్‌లను మినహాయించుకుని మిగిలిన ప్రీమియం డబ్బును (Surrender of a life insurance policy) పాలసీదారుకు చెల్లిస్తుంది. దీనిని సరెండర్‌ వాల్యూ (Surrender Value) అంటారు. ఇప్పటి వరకు, బీమా కంపెనీ నుంచి వచ్చే సరెండర్‌ వాల్యూ చాలా తక్కువగా ఉంటోంది, పాలసీదార్లు నష్టపోతున్నారు.


పాలసీదారుకు కలిగే ఆర్థిక నష్టాన్ని భారీగా తగ్గించడానికి, 'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI) రంగంలోకి దిగింది. నాన్-లింక్డ్ పాలసీల (సంప్రదాయ పాలసీలు) సరెండర్ విలువను ‍‌పెంచుతూ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. కొత్త నిబంధనలు కొత్త ఆర్థిక సంవత్సరం (01 ఏప్రిల్‌ 2024) నుంచి అమల్లోకి వస్తాయి. వాస్తవానికి, దీనికి సంబంధించిన కసరత్తు ఏడాది పైగా సాగింది. సంవత్సరం క్రితమే ముసాయిదా పత్రం విడుదల చేసిన ఇర్డాయ్‌ (IRDAI).. బీమా కంపెనీలు, పరిశ్రమలోని ఇతర వర్గాలతో అనేక దఫాలు సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త నిబంధనలు రూపొందించింది.


బీమా పాలసీ సరెండర్‌ విలువ విషయంలో కొత్త నిబంధనలు


పాలసీ తీసుకున్న తేదీ నుంచి మూడేళ్ల కాలం లోపు ఆ పాలసీని సరెండర్‌ చేస్తే.. సరెండర్‌ విలువ యథాతథంగా లేదా కాస్త తక్కువగా ఉంటుంది. అంటే, అప్పటివరకు పాలసీదారు చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి వస్తుంది, లేదా, పన్నుల వంటి కొన్ని ఖర్చుల్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. 


పాలసీ తీసుకున్న తర్వాత, 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య సరెండర్‌ చేస్తే, సరెండర్‌ వాల్యూ కొద్దిగా పెరుగుతుంది. ఈ కేస్‌లో 'ప్రీమియం థ్రెషోల్డ్' దాటి చెల్లింపులు జరుగుతాయి కాబట్టి, చెల్లించిన మొత్తం ప్రీమియం కంటే కొద్దిగా ఎక్కువ మొత్తాన్ని పాలసీదారు అందుకోవచ్చు. 


ఏడు సంవత్సరాలకు మించి ప్రీమియం చెల్లించిన పాలసీని సరెండర్‌ చేస్తే, సరెండర్‌ వాల్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే, IRDAI కొత్త రూల్‌ ప్రకారం, ఎంత ఎక్కువ కాలం పాలసీని హోల్డ్‌ చేస్తే సరెండర్‌ విలువ అంత ఎక్కువగా ఉంటుంది.


ప్రస్తుతం, రెండు సంవత్సరాల పాటు పూర్తి ప్రీమియంలు చెల్లించిన తర్వాత, ఆ పాలసీని పాలసీ మెచ్యూరిటీ గడువు లోపులో ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. రెండేళ్ల కంటే ముందు పాలసీని సరెండర్ చేస్తే ఒక్క రూపాయి కూడా పాలసీదారుకు తిరిగి (refund) రాదు. 2 సంవత్సరాల తర్వాత, గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూని (Guaranteed Surrender Value) మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇందులోనూ చాలా భారీ ఖర్చును చూపిస్తుంది. 


ఏప్రిల్‌ 01 నుంచి ఈ లెక్కలన్నీ మారిపోతాయి. పాలసీని ఎప్పుడు సరెండర్‌ చేసినా, అప్పటి వరకు బీమా కంపెనీకి చెల్లించిన డబ్బంతా  యథాతథంగా/ కాస్త తక్కువగా తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం:గోల్డ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా? - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి