Post Office Monthly Income Scheme: మన దేశ ప్రజల్లో తరతరాలుగా పొదుపు గుణం కొనసాగుతూ వస్తోంది. ఆదాయంలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటుగా మారింది. భవిష్యత్ అవసరాల కోసం ప్రజలు ముందు నుంచే డబ్బు దాస్తుంటారు. ఇలా డబ్బు దాచేందుకు చాలా సంప్రదాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. పోస్టాఫీస్ పథకాలు ప్రజల నమ్మకం సంపాదించాయి. మన దేశంలో బ్యాంక్ ఖాతాల కంటే పోస్టాఫీస్ ఖాతాలు ఎక్కువగా ఉండడమే దీనికి నిదర్శనం.
ప్రస్తుతం షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. వాటితో వ్యవహారం రిస్క్‌తో కూడుకున్నది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. పోస్టాఫీస్ స్కీమ్స్ అలా కాదు. వీటిలో జమ చేసే డబ్బు ఎక్కడికీ పోదు, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. పైగా, ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం ఖచ్చితంగా ఆదాయం లభిస్తుంది. అందుకే, పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Post Office Small Savings Schemes) పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే వ్యక్తులు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు.
పోస్టాఫీసు పథకాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెడుతూ వెళితే, దీర్ఘకాలంలో వడ్డీతో కలిపి మంచి సంపద సృష్టించొచ్చు. అంతేకాదు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందే స్కీమ్ కూడా ఒకటి ఉంది. దాని పేరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం వివరాలు:
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకానికి (Post Office Monthly Income Scheme - POMIS) ప్రజల నుంచి మంది ఆదరణ లభిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్స్‌లో ఇది ఒకటి. ఒకేసారి కొంత మొత్తాన్ని ఈ ఖాతా ద్వారా పెట్టుబడి పెడితే, ప్రతి నెల హామీతో కూడిన రాబడిని పొందొచ్చు.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
సింగిల్ అకౌంట్‌లో ఏకమొత్తంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి ఖాతాలో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు.
ఈ పథకంలో 5 సంవత్సరాల కాలానికి డబ్బును డిపాజిట్ చేయవచ్చు.
POMIS ఖాతాలో డిపాజిట్ చేసే మొత్తంపై కేంద్ర ప్రభుత్వం 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఈ పథకం కింద వచ్చే వడ్డీ ఆదాయం ప్రతి నెలా ఖాతాదారు ఖాతాలో జమ అవుతుంది. ప్రతి నెలా ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
సింగిల్ అకౌంట్‌లో రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 5,500 చేతికి వస్తుంది.
జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ. 9,250 గ్యారెంటీ ఆదాయాన్ని పొందొచ్చు.
మరో ఆసక్తికర కథనం: మే 20న స్టాక్ మార్కెట్‌కు సెలవు, కారణం ఏంటో చెప్పిన NSE