How To Invest In Mutual Fund SIP: నెలకు రూ.25,000 జీతం తీసుకునే వ్యక్తి కూడా కరోడ్‌పతి కావచ్చు. ఇంత చిన్న జీతం నుంచి ఇంకా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసి అంత పెద్ద మొత్తం సంపాదించగలనా అన్న డౌట్‌ అక్కర్లేదు. సరైన చోట దీర్ఘకాలం పెట్టుబడి పెడితే చాలు. కోటి రూపాయల ఫండ్‌ తయారవుతుంది.


మీరు రిస్క్ తీసుకోవడానికి భయపడకపోతే, షేర్లలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు కళ్లజూడొచ్చు. షేర్‌ మార్కెట్‌పై అవగాహనతో దీర్ఘకాలం పాటు కొనసాగితేనే ఈ రివార్డ్‌ దక్కుతుంది.


పెద్దగా రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోతే, SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్‌. SIPలో ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అంత త్వరగా కోటీశ్వరులవుతారు. దీనికోసం SIPలో సరైన ఫండ్‌ ఎంచుకోవాలి, రిస్క్‌ను చూసుకోవాలి. మీ పెట్టుబడులను ఎంత కాలం కొనసాగిస్తారన్న విషయం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది.


రూ.కోటి సంపాదించడానికి ఎన్నేళ్లు పడుతుంది?
నెలకు రూ. 25,000 జీతం తీసుకునే వ్యక్తి, అందులో ఎక్కువ భాగాన్ని సిప్‌లోకి మళ్లించడం సరికాదు, కుటుంబ అవసరాలను కూడా చూసుకోవాలి. అయితే.. పెట్టుబడి కోసం ప్రతి నెలా జీతం నుంచి 15-20% వినియోగించొచ్చు, దీనిని దీర్ఘకాలం కొనసాగించాలి. ఇంతకన్నా తక్కువ మొత్తం కేటాయిస్తే రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.


ప్రతి నెలా జీతం రూ.5000 మొత్తాన్ని SIPలో పెట్టుబడి పెడితే... 12% వడ్డీ రేటుతో 26.5 సంవత్సరాల్లో రూ.కోటి రూపాయలు సృష్టించొచ్చు. ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడితే, 21 సంవత్సరాల లోపు రూ.1 కోటికి చేరుకోవచ్చు.


వార్షిక రాబడి 15% వస్తుందనుకుంటే... కోటీశ్వరుడిగా మారడానికి ఇంకా తక్కువ సమయం పడుతుంది. నెలవారీ రూ.5000 పెట్టుబడితో కేవలం 23 ఏళ్లలో రూ.1 కోటి టార్గెట్‌ చేరుకోవచ్చు. రూ.10 వేల SIPలో, 18 సంవత్సరాల మూడు నెలల్లో మిలియనీర్ అవుతారు. ఒక్క నెల కూడా మిస్‌ కాకుండా పెట్టుబడిని కొనసాగిస్తేనే టార్గెట్‌ రీచ్‌ అవుతారు.


ఏ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి?
మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, లిక్విడ్ ఫండ్, టాక్స్ సేవింగ్ ఫండ్ వంటివి వాటిలో కొన్ని. ప్రస్తుతం, ఈ ఫండ్స్‌లో 4 వేలకు పైగా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల్లో కొన్ని మంచి రాబడి ఇస్తాయి, కొన్ని పథకాలు తక్కువ రిటర్న్‌ ఇస్తాయి. ఉదాహరణకు, డెట్ మ్యూచువల్‌ ఫండ్స్ వార్షికంగా 6 నుంచి 8 శాతం రాబడిని మాత్రమే ఇస్తున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే 14-15 శాతం రిటర్న్‌ అందుకోవచ్చు. ఈక్విటీ ఫండ్‌ పథకాల ద్వారా మాత్రమే రూ.1 కోటి కలను నిజం చేసుకోవచ్చు.


SIPలో డబ్బు ఎలా పెరుగుతుంది?
మ్యూచువల్ ఫండ్‌ SIPలో కనిపించే అతి పెద్ద ప్రయోజనం చక్రవడ్డీ. గత నెలలో లేదా గత సంవత్సరంలో వచ్చిన వడ్డీని అసలుకు కలిపి, ఆ పూర్తి మొత్తంపై మళ్లీ వడ్డీ లెక్కించడాన్ని చక్రవడ్డీ అంటారు. ఉదాహరణకు... మీ దగ్గర రూ.12 వేల రూపాయలు ఉన్నాయనుకుందాం. ఈ డబ్బును 10% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మూడేళ్ల తర్వాత రూ.3,600 వడ్డీ (12,000 x 10 x 3 ÷ 100 = 3600) లభిస్తుంది. ఇప్పుడు, SIPని ఎంచుకుని ప్రతి నెలా రూ. 1000 చొప్పున డిపాజిట్ చేస్తే, ఇక్కడ కూడా వార్షికంగా 10% వడ్డీ వస్తుందనుకుంటే, మూడేళ్ల తర్వాత మీకు మొత్తం రూ.5,509 లాభం వస్తుంది. ఇక్కడ చక్రవడ్డీ సూత్రం పని చేసింది. కాబట్టి, చక్రవడ్డీతో చాలా త్వరగా ధనవంతులు కావచ్చు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: నగదు రూపంలో చెల్లిస్తున్నారా? ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌ తెలిస్తే ఇక ఆ పని చేయరు