Credit Card Balance Transfer: ప్రస్తుతం మన దేశంలో 20 కోట్ల క్రెడిట్‌ కార్డ్‌లు వాడుకలో ఉన్నాయని అంచనా. దేశంలో అతి రుణదాత HDFC బ్యాంక్‌, తాము 2 కోట్ల క్రెడిట్‌ కార్డుల మైలురాయిని దాటినట్లే ఇటీవలే ప్రకటించింది. క్రెడిట్‌ కార్డ్‌ల జారీలో, భారత్‌లోని అతి పెద్ద ఆర్థిక సంస్థ HDFC బ్యాంక్‌. 


బ్యాంక్‌లతోపాటు, కొన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (NBFCs) కూడా క్రెడిట్‌ కార్డ్‌లు జారీ చేస్తున్నాయి. క్రెడిట్‌ కార్డ్‌ అనేది నిప్పు లాంటిది. దానితో దీపం వెలిగించుకోవచ్చు, ఇంటినీ తలగబెట్టుకోవచ్చు. ఏదైనా మన వాడకాన్ని బట్టే ఉంటుంది. 


కొంతమంది, వివిధ కారణాల వల్ల క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులను సకాలంలో చెల్లించరు. దీనివల్ల సదరు వ్యకి క్రెడిట్‌ స్కోర్‌ (credit score) పడిపోతుంది. ఆ వ్యక్తిని ఎగవేతదారుగా (Defaulter) బ్యాంక్‌లు/ ఆర్థిక సంస్థలు పరిగణిస్తాయి. కొత్త అప్పులు పుట్టవు. గడువు దాటాక బిల్లు చెల్లించాలంటే జరిమానా, వడ్డీ వంటి అదనపు బాదుడు భరించాలి. ఇలాంటి ఇబ్బందుల్లో పడకూడదనుకుంటే సకాలంలో బిల్‌ సెటిల్‌ చేయాలి. ఒకవేళ, గడువులోగా డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే... ఆ బిల్లును వేరే క్రెడిట్‌ కార్డుకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఇది, ఇంతకుముందు చెప్పిన ఇబ్బందులన్నింటి నుంచి కాపాడుతుంది.


క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (What is a credit card balance transfer?)


క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటే... ఒక కార్డ్‌లో చెల్లించాల్సిన బిల్లును (Outstanding Amount) మరొక కార్డ్‌కు బదిలీ చేయడం. ఉదాహరణకు... మీ దగ్గర రెండు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయనుకుందాం. మొదటి క్రెడిట్‌ కార్డ్‌పై బిల్లు చెల్లించాల్సిన టైమ్‌ వచ్చినా మీ దగ్గర డబ్బు లేదు. రెండో క్రెడిట్‌ కార్డ్‌ బిల్లింగ్‌ డేట్‌కు (Credit card billing date) కొంత టైమ్‌ ఉందనుకుందాం. ఇలాంటి పరిస్థితిలో... మీ మొదటి క్రెడిట్‌ కార్డులోని చెల్లించాల్సిన మొత్తాన్ని రెండో క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేయొచ్చు. దీనివల్ల.. ఆ బిల్లు కట్టడానికి మీకు టైమ్‌ దొరుకుతుంది. 


ఒక కార్డ్‌ బిల్లునే కాదు, ఒకేసారి ఎక్కువ కార్డ్‌ బిల్లులను కలిపి ఒకే కార్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. తద్వారా, ఆ బిల్లులన్నీ కట్టడానికి టైమ్‌ దొరుకుతుంది, అన్నింటినీ కలిపి ఒకే కార్డ్‌ ద్వారా కట్టేయొచ్చు. 


వేర్వేరు బ్యాంక్‌ కార్డ్‌ల మధ్య బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (Balance transfer between different bank cards)


ఒకే బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల మధ్యే కాదు, వివిధ బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డుల మధ్య కూడా బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ సాధ్యమే. ఉదాహరణకు.. మీ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌ మొత్తాన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లోకి పంపుకోవచ్చు.


ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. 1) అన్ని క్రెడిట్‌ కార్డ్‌లు మీ పేరుపైనే ఉండాలి, మీ బిల్లు భారాన్ని మరో వ్యక్తి నెత్తి మీద వేయడం కుదరదు. 2) మీ క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీ, మీకు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫర్‌ ఇచ్చి ఉండాలి. మన దేశంలో చాలా బ్యాంక్‌లు ఈ ఆఫర్‌ అమలు చేస్తున్నాయి. మీకు కూడా ఈ ఆఫర్‌ ఉండే ఉంటుంది.


క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేయాలి? ‍‌(How to transfer credit card balance?)


నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా, కస్టమర్‌ కేర్‌ను సంప్రదించడం ద్వారా, SMS పంపడం ద్వారా క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు (Credit card balance transfer charges)


క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తే కొంత రుసుము చెల్లించాలి. ఈ సర్వీస్‌ మీద 1% నుంచి 5% వరకు/నిర్దిష్ట మొత్తంలో ప్రాసెసింగ్‌ ఫీజ్‌ ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ మీద నిర్దిష్ట కాలం వరకు వడ్డీ ఉండదు. ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు, వడ్డీ రేట్లు బ్యాంక్‌లను బట్టి మారతాయి.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనేందుకు గుడ్‌ ఛాన్స్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే