IRDAI Master Circular On ULIP: మన దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీల నియంత్రణ సంస్థ అయిన 'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI), యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల (ULIPs) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మనం షార్ట్‌కట్‌లో 'యులిప్'గా పిలుస్తాం. ఈ పథకాలు స్టాక్ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి కాబట్టి, కచ్చితమైన రాబడికి హామీ ఇవి ఇవ్వలేవు. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు యులిప్‌లను నిర్వహిస్తున్నాయి.
ULIP ప్రకటనలపై మాస్టర్ సర్క్యులర్
యులిప్‌లకు సంబంధించి ఇన్యూరెన్స్ రెగ్యులేటర్ తాజాగా ఒక మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. యులిప్‌ను పెట్టుబడిగా ప్రచారం చేయొద్దని, ఆ తరహా ప్రకటనలు వెంటనే ఆపేయాలని బీమా కంపెనీలను IRDAI ఆదేశించింది. యులిప్ ప్రకటనలకు సంబంధించి ఈ నెల 19న (బుధవారం) ఈ మాస్టర్ సర్క్యులర్ జారీ అయింది. యూనిట్ లింక్డ్ లేదా ఇండెక్స్ లింక్డ్ ఉత్పత్తులను (Index Linked Products) పెట్టుబడి ఉత్పత్తులుగా ప్రకటనల్లో చూపడాన్ని నిషేధిస్తున్నట్లు IRDAI తన సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొంది. ఇకపై అలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వొద్దని దేశంలోని అన్ని బీమా కంపెనీలకు చెప్పింది. తన ఆదేశాలకు సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది, వాటిని తప్పకుండా పాటించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను IRDAI ఆదేశించింది.
బీమా మినహా ఇతర సేవల ప్రకటనలు నిషేధం
IRDAI, తన మాస్టర్ సర్క్యులర్‌లో మరికొన్ని సూచనలు కూడా చేసింది. అడ్వర్టైజ్‌మెంట్లలో హోరెత్తిస్తున్న మరికొన్ని అంశాలను కూడా నిలిపేయాలని బీమా కంపెనీలకు సూచించింది. ఆ సూచనల ప్రకారం... బీమాకు సంబంధం లేని ఏ సేవను కంపెనీలు ప్రచారం చేయకూడదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైనా సాధారణ బీమా ఉత్పత్తిని మార్కెట్‌లోకి తెస్తున్నప్పుడు లేదా తీసుకొచ్చినపుడు.. పాత ధరలతో ప్రస్తుత ధరలను (New Policy Price) లేదా తగ్గింపులను (Discounts) పోల్చకూడదు. పాలసీ తీసుకునే వినియోగదార్లకు ఆ పాలసీకి సంబంధించిన నియమాలు, నిబంధనలు, నష్టాల గురించి స్పష్టంగా వివరించాలి. ఇలా చేయకుండా బీమా ఉత్పత్తి వల్ల ఒనగూరే లాభాలను మాత్రమే హైలైట్ చేయకూడదు.
అతిశయోక్తి ప్రచారంపై నిషేధం
బీమా కంపెనీలు పాక్షిక ప్రయోజనాలను వివరించడంతోనే సరిపెట్టకుండా.. సంబంధిత పాలసీకి ఉన్న పరిమితులు, షరతుల గురించి కూడా వినియోగదార్లకు అర్ధమయ్యే భాషలో, స్పష్టంగా చెప్పాలి. అంతేకాదు.. ఏదైనా బీమా ఉత్పత్తి ప్రయోజనాలను గురించి అతిశయోక్తి ప్రకటనలు ఇవ్వకూడదు. అంటే, పావలా ప్రయోజనం కల్పించి ముప్పావలా కవరింగ్ ఇవ్వకూడదు. పోటీ కంపెనీ ఇమేజ్‌ను డామేజ్ చేసేలా, కించపరిచేలా అనుచిత విషయాలను కూడా చెప్పకూడదు.
IRDAI మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు, బీమా కంపెనీలు తమ 'యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్' లేదా 'ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్' లేదా 'యాన్యుటీ ప్రొడక్ట్' ప్రకటనల్లో వేరియబుల్ యాన్యుటీ పే-అవుట్ ఆప్షన్ గురించి వినియోగదార్లకు సాధారణ భాషలో పూర్తి సమాచారం అందించాలి. వారి పెట్టుబడిపై వచ్చే రాబడిలో హెచ్చుతగ్గులు ఉంటాయని కూడా ప్రకటనల్లో చెప్పాలి. కనీసం ఒక సంవత్సరం నుంచి కొత్త సమాచారం ఏమీ లేకపోతే, ఇన్సూరెన్స్ కంపెనీలు పాత డేటాను తమ ప్రకటనల్లో చూపించకూడదు. కంపెనీలు పాత డేటాను ప్రదర్శిస్తే, గతంలో ఇచ్చిన అక్షర శైలి (Font ఏూబతా), సైజునే (Font Size) ఇప్పుడు కూడా ఉపయోగించాలి. కరస్పాండెంట్ ఇండెక్స్ పనితీరు గురించి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వినియోగదార్లకు స్పష్టంగా తెలియజేయాలి.
మరో ఆసక్తికర కథనం: బంగారం కొనేవాళ్లకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి