Tatkal Booking New Rules: మనలో చాలా మందికి రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం. కానీ అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తత్కాల్‌ టికెట్ బుక్ చేయడం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిదే. కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ముందు కూర్చొని టైమ్‌ పది లేదా 11 అవ్వగానే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే కళ్లు మూసి తెరిచే లోపు టికెట్లన్నీ అయిపోతాయి. సామాన్య ప్రయాణికులకు ఒక టికెట్ కూడా దొరకని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ భారతీయ రైల్వే 2026లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల ఇకపై సామాన్యులకు తత్కాల్‌  టికెట్‌లు దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అవి మీకు ఎలా ఉపయోగపడతాయో చాలా వివరంగా తెలుసుకుందాం..

Continues below advertisement

ఏజెంట్లకు నో ఎంట్రీ; సామాన్యులకే మొదటి ఛాన్స్‌

తత్కాల్ బుకింగ్‌లో అతి పెద్ద మార్పు ఏంటంటే, బుకింగ్‌ ప్రారంభమైన మొదటి కొన్ని నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణికులకు మాత్రమే కేటాయించారు. గతంలో తత్కాల్ విండో ఓపెన్ అవ్వగానే లైసెన్స్‌ ఉన్న ఏజెంట్లు తమ వద్ద ఉన్న వేగవంతమైన సాఫ్ట్‌వేర్‌ సహాయంతో టికెట్లన్నీ బుక్ చేసే వారు. కానీ, ఇప్పుడు కొత్త రూల్‌ ప్రకారం, మొదటి కొన్ని నిమిషాల పాటు ఏజెంట్లు లాగిన్ అవ్వడానికి లేదా టికెట్లు బుక్ చేయటానికి వీలుండదు. దీని వల్ల సామాన్య ప్రయాణికులకు టికెట్లు దొరికే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఏజెంట్ల ప్రమేయం లేకుండా పారదర్శకంగా టికెట్లు పంపిణీ చేయాలన్నదే రైల్వే ముఖ్య ఉద్దేశం. 

దొంగ అకౌంట్లు- బాట్లపై కఠిన చర్యలు 

చాలా మంది ఏజెంట్లు లేదా బ్లాక్ మార్కెట్‌ కేటుగాళ్లు బాట్స్‌ అని పిలిచే ఒక రకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంటారు. ఇవి మనుషుల కంటే వేగంగా వివరాలను నింపి టికెట్లను బుక్ చేస్తాయి. దీనిని అరికట్టడానికి రైల్వే ఇప్పుడు సరికొత్త అడ్వాన్స్‌డ్‌ మానిటరింగ్‌ టూల్స్‌ను వాడుతోంది. ఒక అకౌంట్ నుంచి అసాధారణమైన వేగంతో టికెట్లు బుక్ అవుతుంటే ఆ సాఫ్ట్‌వేర్‌ వెంటనే గుర్తు పడుతుంది. అలా అనుమానాస్పదంగా ప్రవర్తించే అకౌంట్లను రైల్వే తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. దీని వల్ల అక్రమంగా టికెట్లు బుక్ చేసే వారికి చెక్ పడుతుంది. 

Continues below advertisement

ఐడీ వెరిఫికేషన్ తప్పనిసరి

ఇకపై తత్కాల్ టికెట్‌ బుక్ చేయాలంటే కేవలం పేరు, ఊరు ఉంటే సరిపోదు. మొబైల్‌ నంబర్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డు వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే, మీరు తత్కాల్ టికెట్‌బుక్ చేయడం అసాధ్యం. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దొంగ అకౌంట్లను, బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని అరికట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ వివరాలు సరిగా ఉంటేనే టికెట్‌ కన్ఫార్మ్‌ అవుతుంది. 

సూపర్‌ ఫాస్ట్‌ సర్వర్లు- నో హ్యాంగింగ్‌

గతంలో తత్కాల్‌ టైమ్‌ అవ్వగానే రైల్వే వెబ్‌సైట్‌ స్లో అయిపోయేది లేదా హ్యాంగ్‌ అయిపోయేది. టికెట్లు బుక్ చేసే సమయంలో సర్వర్లు మొరాయించడం వల్ల చాలా మంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రైల్వే తన సర్వర్‌ కెపాసిటీని భారీగా పెంచింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వెబ్‌సైట్‌వేగంగా పని చేసేలా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల మీరు టికెట్లు బుక్ చేసేటప్పుడు వెబ్‌సైట్‌ ఆగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. 

యాప్‌- వెబ్‌సైట్‌-రెండూ సమానమే!

చాలా మందికి ఒక సందేహం ఉంది. మొబైల్‌ యాప్‌లో టికెట్లు త్వరగా దొరుకుతాయా? లేక వెబ్‌సైట్‌లోనా? అని.  తేడాను రైల్వే ఇప్పుడు తొలగించింది. యాప్, వెబ్‌సైట్ రెండూ ఒకే రకమైన సాంకేతికతతో, ఒకే వేగంతో పని చేసేలా మార్పులు చేశారు. అంతే కాకుండా ఆటో ఫిల్‌టూల్స్ లేదా స్క్రిప్టుల ద్వారా వివరాలను ఆటోమేటింక్‌గా నింపే ప్రయత్నాలను అడ్డుకోవడానికి స్పెషల్‌ ఫిల్టర్‌లను ఏర్పాటు చేశారు. దీని వల్ల అందరికీ సమానమైన అవకాశం లభిస్తుంది. 

పేమెంట్ సమస్యలకు చెక్ 

తత్కాల్‌ బుకింగ్‌లో మరో పెద్ద తలనొప్పి పేమెంట్‌ ఫెయిల్ అవ్వడం. సీట్లు ఖాళీగా ఉన్నా, డబ్బులు కట్ అయ్యి టికెట్ రాకపోవడం వల్ల ప్రయాణికులు విసిగిపోయే వారు. ఇప్పుడు పేమెంట్ సిస్టమ్‌ను కూడా రైల్వే శాఖ అప్‌డేట్ చేసింది. లావాదేవీలు వేగంగా పూర్తి అయ్యేలా ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. 

తప్పుడు వివరాలు ఇస్తే జరిమానా

టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల వివరాలు  చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. పేరు లేదా ఇతర గుర్తింపు వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే, ఆ టికెట్‌ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు జరిమానా కూడా కట్టాల్సి రావచ్చు. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే వివరాలు నింపాలి.