New Rules March 2026: మార్చి 1వ తేదీ నుంచి అంటే నేటి (ఆదివారం) నుండే పలు ముఖ్యమైన మార్పులు అమలులోకి రాబోతున్నాయి. వీటి ప్రభావం సామాన్యుడి జేబుపై పడనుంది. ఈ మార్పులలో SIM బైండింగ్ నుండి LPG ధరల సమీక్ష, రైల్వే టికెట్ బుకింగ్ వంటి పలు అంశాలు ఉన్నాయి. మొత్తంగా వీటి ప్రభావం కేవలం మీ వాలెట్‌కే పరిమితం కాకుండా, మొబైల్ ఫోన్, బ్యాంకింగ్ సేవలు, రైలు ప్రయాణాలపై కూడా పడుతుంది. మీరు డిజిటల్ పేమెంట్స్ చేసినా, గ్యాస్ సిలిండర్ కొన్నా లేదా రైలులో ప్రయాణించే వారైనా ఈ అప్‌డేట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.-
సిమ్ బైండింగ్ రూల్
మెసేజింగ్ యాప్‌లకు సంబంధించిన ఈ మార్పు మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది. కొత్త SIM బైండింగ్ నిబంధనల ప్రకారం, ఇకపై WhatsApp, టెలీగ్రామ్ (Telegram) లేదా Signal వంటి యాప్‌లు మీ యాక్టివ్ SIM కార్డ్‌తో అనుసంధానమై మాత్రమే ఉండాలి. మీ ఫోన్ నుండి సిమ్ తీసివేస్తే, ఈ యాప్‌లన్నీ పనిచేయడం ఆగిపోతాయి. గతంలో ఇలా ఉండేది కాదు. ఇప్పటి వరకు మొబైల్ వినియోగదారులు సిమ్ లేకుండా కూడా వాట్సాప్ వంటి పలు మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించేవారు. డిజిటల్ ఫ్రాడ్‌లను అరికట్టడమే దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇటీవలి సంవత్సరాలలో SIM స్వాప్, నకిలీ రిజిస్ట్రేషన్ల మోసాలు పెరిగాయి. అందుకే యాక్టివ్ SIM లేకుండా మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించలేరు. దీనితో పాటు WhatsApp Web వంటి డెస్క్‌టాప్ వెర్షన్‌లు కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతాయి.
రైలు టికెట్ బుకింగ్
జనరల్ టికెట్, ప్లాట్‌ఫారమ్ టికెట్, సీజన్ టికెట్ బుక్ చేసుకునే నిబంధనలు కూడా 1 మార్చి 2026 నుండి మారాయి. ఇప్పుడు రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి కొత్త Rail One Appను ఉపయోగించాలి. పాత UTS (Unreserved Ticketing System) మొబైల్ యాప్ నిలిపివేశారు. అటువంటి పరిస్థితిలో మీ పాత UTS వాలెట్‌లో ఉన్న డబ్బును అదే మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయడం ద్వారా కొత్త యాప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
LPG సిలిండర్ ధర
19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరల్లో 28 నుంచి 31 రూపాయల వరకు తగ్గించారు. ఢిల్లీలో ఇప్పుడు వీటి కొత్త ధర 1740.50 రూపాయలు. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 49 రూపాయలు పెరిగి 1,961.50 కాగా, 14.2 కేజీల సిలిండర్ ధర రూ.905 గా ఉంది. ప్రతి నెలా మొదటి తేదీ మాదిరిగానే, మార్చి ఒకటో తేదీన కూడా చమురు కంపెనీలు వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ల ధరలను సమీక్షించాయి. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు.
బ్యాంకింగ్, UPI నిబంధనలలో మార్పు
UPIకి సంబంధించిన నిబంధనల ప్రకారం, ఇకపై పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు కేవలం పిన్ (PIN) మాత్రమే కాకుండా, బయోమెట్రిక్ లేదా మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలని భావించారు. ఇది కాకుండా, కొన్ని ప్రభుత్వ బ్యాంకులలో Minimum Balance మెయింటైన్ చేయనందుకు విధించే జరిమానా నిబంధనలను మార్చారు. దీనివల్ల కస్టమర్లకు ఉపశమనం లభించనుంది.
అద్దెదారులు, యజమానుల కోసం నిబంధనలు
2025-26 కోసం ప్రతిపాదిత కొత్త అద్దె నిబంధనల ప్రకారం, మార్చి 1 నుండి కొత్త అగ్రిమెంట్లలో కొన్ని మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం అద్దె ఒప్పందం (Rent Agreement) డిజిటల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు తప్పనిసరి. సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఇప్పుడు గరిష్టంగా 2 నెలల అద్దెను మాత్రమే తీసుకోవచ్చు. ఇంటి యజమానులు 24 గంటల ముందు నోటీసు ఇవ్వకుండా ఇంటికి రాలేరు